సూర్య-జ్ఞాన్ వేల్ మరో సరికొత్త సామాజిక కథతో!
వైవిధ్యమైన పాత్రలు, సామాజిక స్పృహ కలిగిన కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూర్య.
వైవిధ్యమైన పాత్రలు, సామాజిక స్పృహ కలిగిన కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూర్య. ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన `జై భీమ్` చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అంతకు మంచిన మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి సూర్య సరికొత్తగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. `జై భీమ్` వంటి క్లాసిక్ హిట్‌ను అందించిన దర్శకుడు టీజే జ్ఞానవేల్ తో సూర్య మరోసారి చేతులు కలపుతున్నారనే వార్త కోలీవుడ్‌తో పాటు సౌత్ సినీ సర్కిల్స్‌లో భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక చర్చలు ఇప్పటికే విజయవంతంగా ముగిశాయని కోలీవుడ్ వర్గాల సమాచారం.
కథా చర్చలు పూర్తవడంతో సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోందిట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిసింది. కథలోని విభిన్న పాత్రల కోసం టాలెంటెడ్ నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసే పనిలో దర్శకుడు జ్ఞానవేల్ పూర్తి నిమగ్నమయ్యారుట. ఈ క్రేజీ మూవీ షెడ్యూల్‌పై కూడా ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. అన్ని పనులను సకాలంలో పూర్తి చేసి సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారుట.
జ్ఞానవేల్ మార్క్ రియలిస్టిక్ డ్రామాగా, సమాజంలోని కొన్ని కీలక అంశాలను స్పృశిస్తూ కథ సాగుతుందని సమాచారం. సాధారణంగా సంచలన విజయాన్ని అందుకున్న కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందంటే? అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. `జై భీమ్` చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లను మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థలో - సామాజిక కోణంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సినిమాలో సూర్య పోషించిన లాయర్ చంద్రు పాత్ర అందరి హృదయాలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఆసారి కూడా అలాంటి అంశంతోనే సినిమా ఉంటుందని ..సామాజిక సందేశాన్ని ఇవ్వబోతోందనే కుతూహలం అందరిలోనూ నెలకొంది.
వాస్తవానికి `జై భీమ్` చిత్రానికి జాతీయ అవార్డు రావాలి. కానీ ఆ చిత్రానికి అవార్డు దక్కలేదు. దీంతో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. మంచి సినిమాలకు అవార్డులు మానేసి పలుకబడి ఉన్న సినిమాలకు అవార్డులిస్తారా? అంటూ నెటి జనులు తీవ్ర స్థాయిలో అప్పట్లో మండిపడ్డారు. `జైభీమ్` కు అన్ని అర్హతులున్నా? ఆ చిత్రాన్ని రాజకీయ కోణంలో పక్కనెబెట్టారా? అని పబ్లిక్ గానే విమర్శించారు. ఈ నేపథ్యంలో సూర్య-జ్ఞాన్ వేల్ మరోసారి చేతులు కలపడంతో? జాతీయ అవార్డు ను మించి అవార్డు అందుకునే మరో గొప్ప సందేశాత్మక చిత్రం చేస్తారని అభిమానులు ఆశీస్తున్నారు.
ప్రస్తుతం సూర్య టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో `విశ్వనాథ్ & సన్స్` చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సూర్య తమిళ ప్రాజెక్ట్ లో త్వరలోనే బిజీ అయ్యే అవకాశం ఉంది.