సూర్య.. కరెక్ట్ టైమ్ లో కష్టమైన క్యారెక్టర్
ఆ తర్వాత కూడా ప్రయోగాలు చేసినా ఈ తరహా పాత్రలకు మాత్రం కాస్త దూరమయ్యాడు.
సూర్య కెరీర్‌లో ఒకప్పుడు పాత్రలో ఏదో ఒక ఛాలెంజ్ ఉండే సినిమాలు ఎక్కువగా కనిపించేవి. ‘గజిని’లో షార్ట్ టర్మ్ మెమరీ లాస్‌తో బాధపడే పాత్ర, , ‘బ్రదర్స్’లో అవిభక్త కవలలు, ‘సుందరాంగుడు’లో శారీరక లోపాలతో పూర్తిగా వంగి పోయిన పాత్ర చేశాడు. ఆ తర్వాత కూడా ప్రయోగాలు చేసినా ఈ తరహా పాత్రలకు మాత్రం కాస్త దూరమయ్యాడు.
కంగువా, రెట్రో, కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్.. ఇలా జానర్స్ మారాయి కానీ పాత్రలోనే ఒక లోపం ఉండి, దాంతో కథ నడిచే సినిమా ఈమధ్య సూర్య నుంచి రాలేదు. ఇప్పుడు సూర్య 47తో మళ్లీ ఆ రోజులు గుర్తొచ్చే అవకాశం కనిపిస్తోంది. జీతు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఒక కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న సమయంలో జరిగిన ఘటనతో ఆయన చూపు కోల్పోతారట.
కొన్నేళ్ల తర్వాత చూపు లేకుండానే అదే కేసును మళ్లీ తన చేతుల్లోకి తీసుకుంటారనే టాక్ ఉంది. అయితే ఈ కథను మేకర్స్ అధికారికంగా బయటపెట్టలేదు. నిజానికి ఇలాంటి లోపం ఉన్న పాత్రలతో మన తెలుగు హీరోలు ఈమధ్య మంచి ప్రయోగాలే చేశారు. ‘రంగస్థలం’లో రామ్ చరణ్ వినికిడి సమస్య ఉన్న చిట్టిబాబుగా కనిపించారు. ‘రాజా ది గ్రేట్’లో రవితేజ చూపులేని పాత్ర చేశారు.
‘మాస్ట్రో’లో నితిన్ కూడా చూపులేని వ్యక్తిగా కనిపించారు. ‘పుష్ప’లో అల్లు అర్జున్ భుజం సమస్యను క్యారెక్టర్‌లో భాగం చేశారు. కథలో ఆ లోపాన్ని సరిగ్గా కలిపినప్పుడు హీరో నటనకు కూడా కొత్తగా ఏదో చేసే అవకాశం దొరుకుతోంది. పైగా సూర్యకు ఇప్పుడు మళ్లీ మంచి టైమ్ నడుస్తోంది. ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విజయాలతో వరుసగా రెండు మంచి ఫలితాలు అందుకున్నారు.
తెలుగు మార్కెట్‌లో కూడా మళ్లీ పట్టు వచ్చింది. ఇలాంటి సమయంలో మరో రెగ్యులర్ పాత్ర చేయకుండా, నటుడిని పరీక్షించే క్యారెక్టర్ వైపు వెళ్లడం కూడా మంచి మార్పే. నజ్రియా, నస్లెన్ కీలక పాత్రల్లో ఉండటం ఈ సినిమాపై మరింత బజ్ పెంచుతోంది. ఇక సూర్యకు చాలా కాలం తర్వాత పాత్రలోనే ఒక పెద్ద ఛాలెంజ్ దొరికినట్టే. ఒకప్పుడు ‘గజిని’లో జ్ఞాపకశక్తి సమస్యనే కథకు కీలకంగా మార్చారు. ఇప్పుడు చూపులేని పోలీస్ కథ నిజమైతే.. సూర్యలోని ఆ పాత నటుడిని జీతు మాధవన్ మళ్లీ ఎంత వరకు బయటకు తీస్తారో చూడాలి.