335 కోట్లతో 440 ఎకరాల భారీ హిస్టారికల్ ఎస్టేట్ కొనుగోలు చేసిన మార్క్ జుకర్‌బర్గ్
మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిసిల్లా చాన్ తమ విలాసవంతమైన ఆస్తుల జాబితాలో మరో చారిత్రాత్మక రికార్డును చేర్చుకున్నారు.
మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిసిల్లా చాన్ తమ విలాసవంతమైన ఆస్తుల జాబితాలో మరో చారిత్రాత్మక రికార్డును చేర్చుకున్నారు. ఐర్లాండ్‌లోని ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న 19వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధ `స్ట్రాంకల్లీ క్యాసిల్` ని వీరు సొంతం చేసుకున్నట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక భవనాల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ కోట కొనుగోలు ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారింది.
ఈ గోతిక్ శైలి కోట అంచనా విలువ 20 నుండి 30 మిలియన్ యూరోలు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 335 కోట్లు) ఉంటుందని సమాచారం. దాదాపు 440 ఎకరాల భారీ ఎస్టేట్‌లో విస్తరించి ఉన్న ఈ చారిత్రాత్మక భవనం.. డబ్లిన్‌లోని మెటా యూరోపియన్ హెడ్‌క్వార్టర్స్‌కు కేవలం 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఐర్లాండ్ పర్యటనలకు వచ్చినప్పుడు బస చేయడానికి వీలుగా జుకర్‌బర్గ్ దంపతులు దీనిని ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. గడిచిన 25 ఏళ్లుగా ప్రైవేట్ ఇన్వెస్టర్ల సంరక్షణలో పునర్నిర్మించిన ఈ కోట ఇప్పుడు ఈ బిలియనీర్ చేతికి చిక్కింది.
ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడంతో నెటిజన్ల నుండి రకరకాల ఆసక్తికరమైన కామెంట్లు వెల్లువెత్తాయి. ఒకప్పుడు మార్క్ జుకర్‌బర్గ్ ధరించే సాదాసీదా టీషర్టులు, ప్యాంట్లు చూసి `సింపుల్ లివింగ్` అంటూ ప్రశంసించిన వారిని ఉద్దేశించి కొందరు సరదా సెటైర్లు వేశారు. ``సింపుల్ లివింగ్ అని చెప్పే జుకర్‌బర్గ్ ఏకంగా 440 ఎకరాల కోటనే కొనేశారు`` అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అలాగే 440 ఎకరాల భారీ ఎస్టేట్‌తో కూడిన చారిత్రాత్మక కోట కేవలం రూ. 335 కోట్లకే లభించడం నిజంగా చాలా చౌకైన డీల్ అని కొందరు కామెంట్ చేశారు. మరికొందరు నెటిజన్లు భారత్‌లోని లగ్జరీ రియల్ ఎస్టేట్ ధరలతో పోలుస్తూ కామెంట్లు చేశారు. దీని కంటే తక్కువ ధరకే గుర్గావ్‌లోని దేహాలియాస్ సూపర్ లగ్జరీ ప్రాజెక్ట్‌లో ఫ్లాట్ వచ్చేది... పైగా దాంతో పాటు కాలుష్యం, ట్రాఫిక్ ఉచితంగా లభించేవి! అంటూ చమత్కరించడం విశేషం.
సామాజిక మాధ్యమాల ద్వారా కోట్లాది మందిని అనుసంధానించే మెటా నెట్‌వర్క్‌ను నడుపుతున్న జుకర్‌బర్గ్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా తనదైన శైలిలో పెట్టుబడులు పెడుతున్నారు. సాంకేతిక రంగంలో అగ్రగామిగా ఉన్న ఆయన ఇప్పుడు చారిత్రాత్మక వైభవానికి నిలయమైన ఐర్లాండ్ కోటను తన ఖాతాలో వేసుకోవడం ద్వారా మరోసారి వార్తల్లో నిలిచారు.