నైజాం ఎగ్జిబిటర్లలో చీలికలు? సురేష్ బాబు నేతృత్వంలో కీలక చర్చలు!
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రాజుకున్న `పర్సంటేజ్ సిస్టమ్` వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రాజుకున్న `పర్సంటేజ్ సిస్టమ్` వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాతలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ బలాన్ని ప్రదర్శించిన తరుణంలో అటు నైజాం (తెలంగాణ) ఏరియాలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. థియేటర్ల యజమానుల సంఘంలో అంతర్గతంగా తీవ్రమైన విభేదాలు- చీలికలు వచ్చినట్లు సినీ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే నేడు టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్, ఇండస్ట్రీ పెద్ద దిక్కు అయిన డి. సురేష్ బాబు నేతృత్వంలో ఎగ్జిబిటర్ల అత్యవసర సమావేశం జరగడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వివాదంపై ఎగ్జిబిటర్ల అసోసియేషన్‌లో ప్రధానంగా రెండు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. రిలీజ్‌కి వస్తున్న ఒక భారీ చిత్రం విడుదల వరకు వేచి చూసి.. ఆ తర్వాత దీనిపై ఒక నిర్ణయానికి వద్దామని ఒక వర్గం అంటుంటే... ``ఇలాంటి సమస్యలపై అందరం ఇప్పుడే ఏకం కాకపోతే, భవిష్యత్తులో మళ్లీ ఇలా కలిసి పోరాడటం చాలా కష్టం`` అని మరో వర్గం గట్టిగా వాదిస్తోంది. ఈ అంతర్గత భేదాభిప్రాయాల వల్లే ఎగ్జిబిటర్ల ఐక్యత దెబ్బతినే ప్రమాదం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని పరిష్కరించి.. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదర్చడానికే సురేష్ బాబు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
అయితే ఈ మొత్తం వ్యవహారంపై సాధారణ సినీ అభిమానుల నుంచి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన కామెంట్లు వినిపిస్తున్నాయ్. సురేష్ బాబు, శిరీష్ (దిల్ రాజు బ్రదర్) వంటి వారు ఇటు నిర్మాతలుగా ఉంటూ.. అటు థియేటర్ల వ్యాపారంలోనూ ఎగ్జిబిటర్స్ గా అగ్రస్థానంలో ఉన్నారు కదా.. మరి వారు రెండు వైపులా ఎందుకు మాట్లాడుతున్నారు? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇండస్ట్రీలో ఒకే వ్యక్తి ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా మూడు పాత్రలు పోషిస్తున్నప్పుడు ఇలాంటి సమస్యల పరిష్కారంలో ప్రయోజనాల పరంగా సంఘర్షణ తప్పదని వారు విశ్లేషిస్తున్నారు. మరికొందరైతే ``రోజూ ఇదొక ఆటలా అయిపోయింది.. చివరకు వీరేం చేస్తారో చూద్దాం`` అంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.
నిర్మాతలకు, థియేటర్ల యాజమాన్యాలకు మధ్య ఉన్న ఈ పర్సంటేజ్ సిస్టమ్ గొడవ బాక్సాఫీస్ బిజినెస్‌ను దెబ్బతీసేలా మారడంతో ఇరు రాష్ట్రాల ట్రేడ్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇండస్ట్రీలోని అగ్ర నిర్మాతలు థియేటర్ల చైన్‌ను కూడా నియంత్రిస్తున్న తరుణంలో.. చిన్న నిర్మాతలు.. ఇండిపెండెంట్ సింగిల్ థియేటర్ల ఓనర్లు ఈ వివాదంలో నలిగిపోతున్నారు. సురేష్ బాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చర్చలు నైజాం ఎగ్జిబిటర్లలో నెలకొన్న ఈ చీలికలను ఆపుతాయా? లేక వివాదం మరింత ముదురుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.