అగ్ర నిర్మాత 30వేల కోట్ల ఆస్తి కోసం వార‌సుల‌ కుట్ర‌లు

ఇది డ‌బ్బు కోసం ఆట‌. సంప‌ద‌లో వాటాల‌ కోసం బిగ్ ఫైట్. ఇప్పుడు న‌మ్మిన‌వారే ఒక‌రితో ఒక‌రు పోరాటాల‌కు దిగుతున్నార‌ని జాతీయ మీడియాల్లో క‌థ‌నాలొస్తున్నాయి.;

Update: 2025-07-30 03:47 GMT

న‌టుడు, నిర్మాత‌, పారిశ్రామిక వేత్త సంజ‌య్ క‌పూర్ ఆక‌స్మిక మ‌ర‌ణం, అనంత‌ర ప‌రిణామాల గురించి తెలిసిందే. గ‌త నెల‌లో లండ‌న్ లోని ఓ మైదానంలో పోలో ఆడుతుండ‌గా తేనెటీగ శ్వాస‌నాళంలో ప్ర‌వేశించి కుట్టింది. దాంతో ఊపిరాడ‌క అల‌ర్జీ కార‌ణంగా తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన సంజ‌య్ గుండెపోటుతో మ‌ర‌ణించార‌ని క‌థ‌నాలొచ్చాయి. అయితే సంజ‌య్ ఆక‌స్మిక మ‌ర‌ణం త‌ర్వాత అత‌డికి చెందిన ఆస్తులు, కంపెనీల‌ వార‌స‌త్వ పోరు -వివాదాలు బ‌హిర్గ‌త‌మ‌య్యాయి. దాదాపు రూ.30,000 కోట్ల ఎస్టేట్ గురించిన స‌మ‌రం వేడెక్కిస్తోంది.

ఇది డ‌బ్బు కోసం ఆట‌. సంప‌ద‌లో వాటాల‌ కోసం బిగ్ ఫైట్. ఇప్పుడు న‌మ్మిన‌వారే ఒక‌రితో ఒక‌రు పోరాటాల‌కు దిగుతున్నార‌ని జాతీయ మీడియాల్లో క‌థ‌నాలొస్తున్నాయి. ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ క‌థ‌నం ప్ర‌కారం... సంజ‌య్ క‌పూర్ ఆక‌స్మిక మ‌ర‌ణంపై అత‌డి త‌ల్లి సందేహాలు వెలిబుచ్చారు. ఆస్తులు, కంపెనీల వ్య‌వ‌హారంలో అత‌డి భార్య ప్రియా స‌చ్ దేవ్ వ్య‌వ‌హారం మింగుడుప‌డ‌నిదిగా ఉంద‌ని కూడా ఆమె పేరును ప్ర‌స్థావించ‌కుండా ప‌రోక్షంగా ఆరోపిస్తున్న‌ట్టు జాతీయ మీడియాల క‌థ‌నాలు పేర్కొంటున్నాయి.

ఎందుకు ఈ ఆక‌స్మిక మార్పు?

తాజా ప‌రిణామం ప్ర‌కారం... దివంగత భర్త సంజయ్ కపూర్ అధ్యక్షతన ఉన్న ఆటో కాంపోనెంట్స్ తయారీ సంస్థ సోనా కామ్‌స్టార్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ప్రియా సచ్‌దేవ్ త‌న‌ను తాను ప్ర‌మోట్ చేసుకుంటున్నారు. తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లోను ఈ ఆక‌స్మిక మార్పు ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ప్రియా ఇన్‌స్టా బయోలో త‌న‌ను తాను సోనాకామ్ స్టార్ `నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్`గా ప్ర‌స్థావించారు. దానికి తోడు మునుపెన్నడూ లేని విధంగా ఇన్ స్టా బ‌యోలో ఇప్పుడు `ప్రియా సంజయ్ కపూర్` అని ఉంది. గతంలో `ప్రియా సచ్‌దేవ్ కపూర్` అని ఉండ‌గా, ఇప్పుడు ఈ అనూహ్య మార్పు దేనికోసం అనే చ‌ర్చ ఉధృత‌మైంది. భ‌ర్త దివంగ‌తుడ‌య్యాకే ఈ మార్పు దేనికోసం? అన్న‌ది సందేహానికి తావిచ్చింది.

లండ‌న్ నుంచి సంజ‌య్ పార్థీవ దేహం ఫార్మాల్టీస్ పూర్తి చేసి న్యూడిల్లీకి తీసుకురావ‌డానికి కొద్దిరోజుల స‌మ‌యం ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అత‌డి అంత్య క్రియ‌ల స‌మ‌యంలోనే ఆస్తులు, అంత‌స్తులకు వార‌సులు ఎవ‌రు? అనే చ‌ర్చ మొద‌లైంది. ముఖ్యంగా అత‌డికి మూడు పెళ్లిళ్లు అయ్యాయి. సంజ‌య్ త‌ల్లి రాణీ కపూర్ తో పాటు, ఇద్ద‌రు మాజీ భార్య‌లు, వారికి వార‌సులు ఉన్నారు. త‌న ప్ర‌స్తుత భార్య‌తో పాటు, మాజీ భార్య‌ల‌కు వార‌సులున్నారు గ‌నుక‌ సంప‌ద‌ల్ని ఎలా విభ‌జించాలి.. వాటాలు ఎలా వేయాలి? అంటూ ప్ర‌జ‌ల్లో విస్త్ర‌తంగా చ‌ర్చ సాగింది.

రాణి క‌పూర్ సందేహాలు ఎవ‌రిపై?

అయితే సంజ‌య్ త‌ల్లి గారైన రాణి క‌పూర్ ఆస్తుల కోసం పోరాటం మొద‌ల‌య్యాక‌ సంతృప్తిగా లేర‌ని, త‌న కోడ‌లు ప్రియా స‌చ్ దేవ్ విష‌యంలో అసంతృప్తిగా ఉన్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. సోనాకామ్ స్టార్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశానికి ముందు రాణి క‌పూర్ డైరెక్ట‌ర్ల బోర్డుకు ఒక లేఖ రాసారు. కొడుకు మ‌ర‌ణం త‌ర్వాత వివ‌ర‌ణ లేకుండా కొన్ని ప‌త్రాల‌పై తాను సంత‌కం చేయాల్సి వ‌చ్చింద‌ని, ఇది త‌న‌కు ఇష్టం లేని ప‌ని అని పేర్కొన్నారు. `కొంత‌మంది వ్యక్తులు` త‌మ‌ను తాము కుటుంబ ప్ర‌తినిధులుగా నిల‌బెట్టుకుంటున్నారని కూడా రాణీ క‌పూర్ ఈ లేఖ‌లో ఆరోపించారు. సూటిగా పేరును లేఖ‌లో రాయ‌క‌పోయినా కానీ ప్ర‌స్తుత కోడ‌లు ప్రియా స‌చ్ దేవ్ గురించే సంజ‌య్ త‌ల్లి ఇలా ఆరోపించార‌ని క‌థ‌నాలొచ్చాయి. అంతేకాదు రాణీ క‌పూర్ కు సంజ‌య్ ఒక కుమారుడు కాగా, మునుప‌టి వివాహం నుంచి స‌ఫీరా అనే కుమార్తె, అజారియ‌స్ అనే కుమారుడు ఉన్నారు. ఆస్తుల త‌గాదా మొద‌ల‌య్యాక స‌ఫీరా త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పేరును మార్చుకోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

వాటా కోరేది ఎవ‌రెవ‌రు?

అయితే రాణీ క‌పూర్ ఆరోప‌ణ‌ల మేర‌కు.. కుటుంబ ప్ర‌తినిధులం అని చెప్పుకుంటూ ఎస్టేట్ లో వాటా కోరుతున్న‌ది ఎవ‌రు? అన్న‌ది ఇంకా స్ప‌ష్ఠ‌త రాలేదు. సంజ‌య్ ఆస్తుల‌ను ఆక్ర‌మించుకోవాల‌నుకుంటున్న‌ది ఎవ‌రు? అన్న‌ది కూడా క్లారిటీ లేదు. వేల కోట్ల సంస్థానానికి ఎవ‌రికి వారు తామే వార‌సులం అని ప్ర‌క‌టించుకుంటున్న‌ట్టు కూడా తెలుస్తోంది. ప్ర‌స్తుతానికి ప్రియా స‌చ్ దేవ్ పేరు మార్పు, కొత్త పాత్ర, వారసత్వం గురించి కొన్ని ప్రశ్నలు లేవనెత్తాయి.

క‌రిష్మా క‌పూర్ వైఖ‌రి?

దివంగ‌త పారిశ్రామిక వేత్త సంజ‌య్ క‌పూర్ కి మూడు పెళ్లిళ్లు. మొద‌టి భార్య నందిత మ‌హ‌తానీకి విడాకులిచ్చాక‌, న‌టి క‌రిష్మాను అత‌డు పెళ్లాడాడు. ఆ త‌ర్వాత క‌రిష్మా నుంచి విడిపోయిన సంజ‌య్ మోడ‌ల్ ప్రియా స‌చ్ దేవ్ ని పెళ్లాడాడు. ఇక ఆస్తులు పోరాటాల గురించిన చ‌ర్చ‌లో సంజ‌య్ మొద‌టి భార్య నందిత పేరు పెద్ద‌గా ప్ర‌స్థావ‌న‌కు రావ‌డం లేదు కానీ, రెండో భార్య క‌రిష్మా క‌పూర్ ప్ర‌స్తుతం అత‌డి ఆస్తుల్లో వాటా కోరుతున్నారా? అంటూ ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. క‌రిష్మాకు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. వారిలో కియాన్, స‌మైరా కోసం సంజ‌య్ ఆస్తులు ఏవైనా రాసి ఇచ్చారా? అంటే.. గ‌తంలోనే సంజ‌య్ త‌న రెండో భార్య క‌రిష్మా, ఆమె పిల్ల‌ల‌కు అన్యాయం చేయ‌లేద‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. జాతీయ మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. క‌రిష్మా త‌న‌కు, త‌న పిల్ల‌ల‌కు రావాల్సిన దానిని కోర్టు ద్వారా ర‌ప్పించుకుంది. కరిష్మాకు ముంబైలో కొన్ని ఆస్తుల‌ను రాసిచ్చారు. భారీ ఇంటిని సొంతం చేసుకుంది. అందుకే ఇప్పుడు తన మాజీ భర్త ఆస్తి విషయాలలో ఎటువంటి ప్రమేయం లేదా వాటా లేదు. తాజా స‌మాచారం మేర‌కు .. మాజీ భ‌ర్త ఆస్తుల్లో వాటా కోసం పోరాడుతుంద‌నే వార్త‌ల్లో నిజం లేద‌ని క‌రిష్మా కుటుంబం ధృవీక‌రించిన‌ట్టు జాతీయ మీడియా క‌థ‌నాలు వెలువ‌రించింది.

2003లో కరిష్మా - సంజయ్ జంట‌ వివాహం జ‌రిగింది. మ‌న‌స్ఫ‌ర్థ‌ల కార‌ణంగా 2014 లో పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. 2016 లో విడాకులు మంజూర‌య్యాయి. క‌రిష్మాతో విడాకుల త‌ర్వాత మోడ‌ల్ కం న‌టి ప్రియా స‌చ్ దేవ్ ని సంజ‌య్ పెళ్లాడారు. ప్రియా అప్ప‌టికే మొద‌టి భ‌ర్త నుంచి విడిపోయారు. అయితే సంజ‌య్ త‌న పిల్ల‌ల బాధ్య‌త‌ను తీసుకుని, వారికి ఎలాంటి లోటు లేకుండా పెంచి పోషిస్తున్నారు.

Tags:    

Similar News