నటవారసుడిపై దుష్ప్రచారం.. ఇదంతా కుట్రేనా?
కొన్నిసార్లు రంగుల ప్రపంచంలో శత్రుత్వాలు బయటపడుతుంటాయి. బహిరంగంగా వివాదాలు రచ్చకెక్కుతుంటాయి. అలాంటి వివాదంతో ఇటీవల సునీల్ శెట్టి లాంటి సీనియర్ హీరో మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చారు.;
కొన్నిసార్లు రంగుల ప్రపంచంలో శత్రుత్వాలు బయటపడుతుంటాయి. బహిరంగంగా వివాదాలు రచ్చకెక్కుతుంటాయి. అలాంటి వివాదంతో ఇటీవల సునీల్ శెట్టి లాంటి సీనియర్ హీరో మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చారు. ఆయన తన కుమారుడిని డీగ్రేట్ చేస్తూ కొందరు తప్పుడు ప్రకటనలు జారీ చేస్తున్నారని, తనయుడి కెరీర్ ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సునీల్ శెట్టి లాంటి ఉద్ధండుడైన సీనియర్ హీరో ఇలాంటి ప్రకటన చేయడం అభిమానులకు పెద్ద షాకిచ్చింది.
సునీల్ కుమారుడు అహాన్ శెట్టి తడాప్ చిత్రంతో ఆరంగేట్రం చేసాడు. సాజిద్ నడియాడ్‌వాలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తొలి సినిమా ఫ్లాపయ్యాక అహాన్ పై చాలా దుష్ప్రచారం సాగింది. అతడు కొత్త కుర్రాడే అయినా సెట్స్ లో చాలా సౌకర్యాలు కోరుతున్నాడని, అతడి గొంతెమ్మ కోర్కెలు తట్టుకోలేక నిర్మాతలు చేతులెత్తేశారని కూడా ప్రచారం సాగింది. ఇంకా డెబ్యూ హీరోనే అయినా పది మంది అసిస్టెంట్లతో సెట్లో హల్ చల్ చేస్తున్నాడన్న ప్రచారం కూడా వైరల్ అయింది. అయితే ఇదంతా ఉద్ధేశ పూర్వకంగా తన కుమారుడిని నాశనం చేసేందుకు చేసిన కుట్ర అంటూ సునీల్ శెట్టి మీడియా ఎదుటే బరస్ట్ అయ్యారు. ఇది నిజంగా శెట్టి అభిమానులకు పెద్ద షాకిచ్చింది.
అయితే ఆ తర్వాత కూడా అహాన్ శెట్టిపై ఇలాంటి ప్రచారం ఆగడం లేదు. ఇటీవల అహాన్ శెట్టి ప్రముఖ మరాఠా నటి జియా శంకర్ తో డేటింగ్ లో ఉన్నాడని, తొందర్లోనే పెళ్లితో ఓ ఇంటివాడైపోతున్నాడని కూడా ప్రచారం సాగుతోంది. అయితే దీనిని అహాన్ బృందం నిరభ్యంతరంగా ఖండించింది. ఇవన్నీ పుకార్లు మాత్రమే. అహాన్ ఎవరినీ కలవడం లేదు. ప్రస్తుతం అతడి దృష్టి అంతా కెరీర్ పైనే. వరసగా పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. బోర్డర్ 2 త్వరలో వస్తోంది! అంటూ ఒక ప్రకటనను జారీ చేసింది అహాన్ టీమ్.
దురదృష్టవశాత్తూ తడాప్ ఫ్లాపైనా కానీ, సీనియర్ నటుడు సన్నీడియోల్ తో కలిసి బోర్డర్ 2లో నటించే అవకాశం దక్కించుకున్నాడు. ఇదే గాక తన వయసుకు తగ్గ స్క్రిప్టులను ఎంపిక చేసుకుని అహాన్ ముందుకు సాగుతున్నాడు.
ప్రస్తుతం వరస ప్రాజెక్టులకు కమిటయ్యాడని అతడి టీమ్ ప్రకటించింది. అయితే జియా శంకర్ తో ప్రేమాయణం, పెళ్లి అంటూ అహాన్ వ్యతిరేకులే ప్రచారం చేస్తున్నారా? లేక ఇదంతా పబ్లిసిటీ కోసం పీఆర్ స్టంట్ అనుకోవాలా? కాస్త ఆగితే కానీ తెలీదు. జియా శంకర్ మరాఠాలో బుల్లితెరపై చాలా పాపులర్ నటి. జెనీలియాతో కలిసి వేద్ అనే చిత్రంలో నటించింది.