సందీప్ కిషన్ Bడే: SK33 నుంచి ఊహించ‌ని స‌ర్‌ప్రైజ్‌

టాలీవుడ్ యువ‌ హీరో సందీప్ కిషన్ తన కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ నిరంతరం ప్రయోగాలు చేస్తున్నారు;

Update: 2026-05-07 11:16 GMT

టాలీవుడ్ యువ‌ హీరో సందీప్ కిషన్ తన కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ నిరంతరం ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా అత‌డి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది `SK33` చిత్ర బృందం. ఈ స‌ర్ ప్రైజ్ ఏంటో తెలియాలంటే పూర్తి వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.




 


`శంబాల` వంటి భారీ విజయం తర్వాత దర్శకుడు యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీలో సందీప్ ఆస‌క్తిక‌ర పాత్ర‌లో న‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. షైనింగ్ పిక్చర్స్ పతాకంపై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సందీప్ కిషన్ బర్త్ డే స్పెషల్ గా విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దట్టమైన పొగమంచుతో నిండిన అడవిలో.. నాచు పట్టిన బండరాళ్ల మధ్య ఊయలలో ఉన్న ఒక పసిబిడ్డను.. ఒక గంభీరమైన సింహం రక్షిస్తున్నట్లుగా ఈ పోస్టర్ ఉంది. ఆ సింహం నుదుటిపై కిరీటం లాంటి చిహ్నం.. దాని వెనుక ఉన్న ఖడ్గం చూస్తుంటే ఇదొక అద్భుతమైన ఫారెస్ట్ అడ్వెంచర్ అని స్పష్టమవుతోంది. ``అడవి గుండెల్లో నుంచి ఒక లెజెండ్ పుట్టాడు`` అనే ట్యాగ్‌లైన్ ఈ సినిమాలో కంటెంట్ డెప్త్ ని చాటిచెబుతోంది.

ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ లో సింహానికి, తోడేలుకు మధ్య జరిగే పోరాటాన్ని చూపించి సినిమాపై క్యూరియాసిటీని పెంచారు. ``కొన్ని యుద్ధాలు ఎప్పటికీ ముగియవు.. కొంతమంది రాజులు ఎప్పటికీ మరణించరు`` అనే పవర్‌ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాలో వారసత్వం, అధికారం కోసం పోరాటం చుట్టూ తిరిగే కథాంశం ఉంటుందని హింట్ ఇచ్చాయి. సందీప్ కిషన్ ఈ సినిమా కోసం పూర్తిస్థాయిలో మేకోవర్ అవుతున్నారని.. గతంలో ఎన్నడూ చూడని కొత్త రూపంతో ప్రేక్షకులను అలరించబోతున్నారని సమాచారం.

సాంకేతికంగా ఈ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ (VFX), వరల్డ్ బిల్డింగ్ - ప్రొడక్షన్ డిజైన్ విషయంలో మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో ప్రకటించిన విధంగానే ఆగస్టు 2026 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సందీప్ కిషన్ తన కెరీర్‌లో చేస్తున్న అత్యంత ఖరీదైన - వినూత్నమైన చిత్రంగా `SK33` ఆస‌క్తిని పెంచుతోంది. పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు అయ్యాయి

Tags:    

Similar News