వీకెండ్లో షోలు క్యాన్సిలేంటి బాస్

వేసవి అంటే ఒకప్పుడు సినిమాలకు వసూళ్ల పంట పండించుకునే సీజన్. పెద్ద పెద్ద సినిమాలు రిలీజయ్యేవి. థియేటర్ల కోసం నిర్మాతల మధ్య విపరీతమైన పోటీ ఉండేది.;

Update: 2026-05-11 04:06 GMT

వేసవి అంటే ఒకప్పుడు సినిమాలకు వసూళ్ల పంట పండించుకునే సీజన్. పెద్ద పెద్ద సినిమాలు రిలీజయ్యేవి. థియేటర్ల కోసం నిర్మాతల మధ్య విపరీతమైన పోటీ ఉండేది. ఇక కొత్త సినిమాల టికెట్ల కోసం థియేటర్ల దగ్గర జనాల కొట్లాటలు కూడా ఒక రేంజిలో జరిగేవి. సినిమా బాగున్నా బాలేకున్నా.. థియేటర్లలో జనం నిండుగా కనిపించేవారు. కేవలం ఏసీ కోసం సమ్మర్లో థియేటర్లకు వచ్చే వాళ్లు చాలామంది. వీకెండ్స్‌లో అయితే టికెట్ల కోసం రెకమండేషన్లు చేయించుకోవాల్సిన పరిస్థితి. కానీ ఇదంతా గతం.

ఇప్పుడు పీక్ సమ్మర్ సీజన్లో చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ కావట్లేదు. రిలీజవుతున్న సినిమాలను జనం పట్టించుకోవడం లేదు. ఈ వీకెండ్ అయినా పరిస్థితి మారుతుందేమో అని ఆశగా చూడడం.. వచ్చిన సినిమాలు వచ్చినట్లే వెనక్కి వెళ్లిపోవడం.. ఇదీ పరిస్థితి. మే నెల తొలి వారంలో రిలీజైన గాయపడ్డ సింహం, జెట్లీ సినిమాలకు ఒక మోస్తరుగా ఓపెనింగ్స్ అయినా వచ్చాయి. కానీ తర్వాతి వారం సినిమాల పరిస్థితి దయనీయంగా ఉంది.

‘గోదారి గట్టుపైన’ సినిమాను కాస్తో కూస్తో యూత్ చూస్తున్నారు. ఒక మోస్తరు టాక్ వల్ల ఒక మాదిరిగా ఓపెనింగ్స్ వచ్చాయి. ఆదివారం వరకు బండి నడిచే పరిస్థితి కనిపిస్తోంది. వీకెండ్ తర్వాత సినిమా నిలబడడం కష్టమే అని తేలిపోయింది. కానీ ఈ వారం వచ్చిన మిగతా రెండు పరిస్థితి మాత్రం దయనీయం. రవిబాబు ‘రేజర్’, లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ సినిమాలను జనం అస్సలు పట్టించుకోవడం లేదు. తొలి రోజు మార్నింగ్ షోలకు కూడా జనం లేరు. చాలా చోట్ల మినిమం ఆక్యుపెన్సీలు లేక షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి.

రిలీజ్ ముంగిట రవిబాబు ఇంటర్వ్యూలకు మంచి స్పందన వచ్చింది కానీ.. ఆయన సినిమాను మాత్రం జనం పట్టించుకోలేదు. పైగా బ్యాడ్ టాక్ రావడంతో సినిమా పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇక ‘సతీలీలావతి’ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. టాక్ కూడా పూర్తి నెగెటివ్‌గా రావడంతో ప్రేక్షకులు అస్సలు పట్టించుకోకుండా వదిలేశారు. శని, ఆదివారాల్లో కొత్త సినిమాలకు మినిమం ఆక్యుపెన్సీలు లేక షోలు క్యాన్సిల్ అవుతున్నాయంటే బాక్సాఫీస్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Tags:    

Similar News