అక్కినేని హీరో మూడేళ్లు ఎదురు చూపులు.. ఈ ఒక్క‌ ఛాన్స్ గ‌ట్టిగా కొడతాడా?

టాలీవుడ్‌లో ప్రస్తుతం మైథలాజికల్ - డివైన్ కాన్సెప్ట్ చిత్రాలకు భారీగా డిమాండ్ పెరిగింది.

Update: 2026-09-09 04:09 GMT

టాలీవుడ్‌లో ప్రస్తుతం మైథలాజికల్ - డివైన్ కాన్సెప్ట్ చిత్రాలకు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ ట్రెండ్‌లోనే అక్కినేని హీరో సుమంత్ తన తదుపరి చిత్రం `మహేంద్రగిరి వారాహి`తో ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఉందని సుమంత్ ఇటీవల వెల్లడించారు. కథ మూడేళ్ల క్రితమే ఓకే అయినా సరైన నిర్మాతలు దొరకకపోవడంతో ఏడాదిపాటు ఆగాల్సి వచ్చిందని.. ఆ తర్వాత మధు .. తదనంతరం దిల్ రాజు కాంబినేషన్‌లో పలు చిత్రాలకు పనిచేసిన లక్ష్మణ్ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారని తెలిపారు. ఫుటేజ్ నచ్చి లక్ష్మణ్ భాగస్వామి కావడం సినిమాపై నమ్మకాన్ని పెంచిందని సుమంత్ ఆనందం వ్యక్తం చేశారు.

సుమంత్ సినీ ప్రయాణాన్ని గమనిస్తే.. అత‌డి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన బంపర్ హిట్ చిత్రం `సత్యం`. ఆ సమయంలో మాస్- లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని హిందీ `విక్కీ డోనర్` రీమేక్‌గా `మళ్లీ రావా`, `సుబ్రహ్మణ్యపురం` వంటి విభిన్న కాన్సెప్ట్ చిత్రాలతో పాటు `గోదావరి` లాంటి క్లాసిక్స్ చేసినా కమర్షియల్‌గా బాక్సాఫీస్ వద్ద రూ. 50-100 కోట్ల రేంజ్ బిగ్గెస్ట్ మాస్ బ్లాక్‌బస్టర్ మాత్రం ఇంకా బకాయి పడే ఉందనే చెప్పాలి.

లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా.. అక్కినేని కాంపౌండ్ నుండి వచ్చిన సుమంత్ కెరీర్ ప్రారంభం నుండి ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. అయితే తన తాతగారు చూపించిన బాటలోనే ప్రతికూల పరిస్థితులను ప్రశాంతంగా ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుని.. ఎంతో పరిణతితో తన కెరీర్ ఎంపికలను చేసుకుంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి సొంత హోమ్ బ్యానర్ ఉన్నా.. నాగార్జున నేరుగా అవకాశాలు ఇవ్వగల వెసులుబాటు ఉన్నా... పరిశ్రమలో ``ఎవరికి వారే నిరూపించుకుని ఎదగాలి`` అనే సూత్రాన్ని సుమంత్ బలంగా నమ్ముతారు. స్వశక్తితో నిలబడాలనే నైజమే అత‌డిని నిర్మాత లక్ష్మణ్ లాంటి బయటి భాగస్వామ్యాల కోసం ఎదురుచూసేలా చేసింది.

చిత్రసీమలో ఒక్క సరైన విజయం పడితే రీ-ఎంట్రీ లేదా కంబ్యాక్ అనేది ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి హిందీ నటులు సన్నీ డియోల్ (గదర్ 2), బాబీ డియోల్ (యానిమల్) ఉదాహరణలుగా నిలిచారు. అవకాశాలు తగ్గిపోయి.. ట్రాక్ తప్పారనుకున్న సమయంలో ఒకే ఒక్క పవర్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ వారి కెరీర్‌ను రికార్డు స్థాయిలో మార్చేసింది. ఇప్పుడు సుమంత్ కూడా సరిగ్గా అలాంటి ఒక సాలిడ్ కంబ్యాక్ కోసమే చూస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఎవ‌రైనా న‌టుడు అన్ని అడ్డంకుల్ని అధిగ‌మించి ముందుకు సాగాలంటే క‌థ‌ల‌తో, న‌ట‌నా వైవిధ్యంతో.. విఫ‌ల‌ ప్ర‌యోగాల‌తో మాత్ర‌మే ముందు సాగాల్సి ఉంటుంది. సుమంత్ ఇక‌పై అలాంటి ప్ర‌యోగాలే చేస్తాడేమో చూడాలి.

ప్రస్తుతం ప్రేక్షకులు కంటెంట్ ఉన్న డివైన్ థ్రిల్లర్స్.. మైథలాజికల్ డ్రామాలను ఆదరిస్తున్న తరుణంలో `మహేంద్రగిరి వారాహి` సుమంత్ ఆశించిన ఆ పెద్ద కమర్షియల్ బ్రేక్ ఇస్తుందో లేదో వేచి చూడాలి. మూడేళ్ల శ్రమ, సరైన ప్రొడక్షన్ విలువలతో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏమేరకు రాణిస్తుందో .. అక్కినేని హీరోకి ఎలాంటి మైలేజ్ ఇస్తుందో థియేటర్లలోనే తేలనుంది.

Tags:    

Similar News