సుకుమార్ కు కథ చెప్పడం రాదంటున్న జగపతి
టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ గురించి తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి.;
టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ గురించి తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. తన సినిమాల్లో కాన్సెప్ట్, క్యారెక్టరైజేషన్, ఎమోషనల్ డెప్త్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే సుకుమార్, కథ చెప్పే విషయంలో మాత్రం కొంత వెనుకబడి ఉంటారని ఇండస్ట్రీలో చాలా కాలంగా వినిపిస్తున్న మాట. ఈ అభిప్రాయాన్ని తాజాగా ప్రముఖ నటుడు జగపతి బాబు కూడా తనదైన శైలిలో వెల్లడించడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జగపతి బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సుకుమార్ కథ చెప్పే విధానం చాలా భిన్నంగా ఉంటుందని అన్నారు. సుకుమార్ కథ చెప్పలేడని, ఈ విషయాన్ని అతను కూడా ఒప్పుకుంటాడంటూ ఆయన చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నాన్నకు ప్రేమతో సినిమా టైమ్ లో తన పాత్రకు సంబంధించిన కథ చెప్పేందుకు సుకుమార్ వచ్చినప్పుడు, కథను పూర్తి వివరంగా చెప్పలేకపోయాడని జగపతి బాబు గుర్తుచేశారు. ఏదో చెప్పడానికి ప్రయత్నించాడని, ట్రై చేస్తున్నాడు కదా అని, తాను వింటున్నానని, తర్వాత అవన్నీ కాదు, సార్ మీరు చేసేయండన్నాడని, సరే చేస్తా అని చెప్పానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అంటే, పూర్తి కథ వినకుండానే డైరెక్టర్ పై నమ్మకంతో జగపతి బాబు ఆ చేయడానికి ఒప్పుకున్నారని అర్థమవుతోంది.
ఇదే తరహా అనుభవం రంగస్థలం టైమ్ లో కూడా ఎదురైందని జగపతి బాబు వివరించారు. తన వద్దకు కథ చెప్పడానికి ముందు సుకుమార్ గంటన్నర పాటూ యోగా చేసొచ్చాడని, అయినా అది కూడా వర్కవుట్ అవలేదని చెప్పారు. సార్ మీరు ప్రెసిడెంట్ సార్, చొక్కా ఉండదు సార్, చుట్ట ఉంటుంది సార్, చాలా బావుంటుంది సార్ అని మాత్రమే చెప్పాడని ఆయన నవ్వుతూ గుర్తుచేశారు. బేసిక్ స్టోరీలైన్ చెప్పమంటే కూడా బావుంటుంది సార్ అని మాత్రమే చెప్పేవాడని, మొత్తం కథ పది నిమిషాల్లో ముగిసిపోయిందని ఆయన పేర్కొన్నారు. జగపతి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.
అయితే, కథ చెప్పడంలో వీక్ అయినా, సినిమాలను తెరకెక్కించే విషయంలో సుకుమార్ టాలెంట్ అసాధారణమని ఇండస్ట్రీలో అందరూ ఒప్పుకుంటారు. షూటింగ్‌కు వెళ్లాక అవసరాన్ని బట్టి స్క్రిప్ట్‌లో మార్పులు చేయడం, సీన్స్‌ను కొత్తగా ఆలోచించడం ఆయన ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇదే కారణంగా ఆయన సినిమాలు కాస్త ఆలస్యంగా వచ్చినా, ఫైనల్ అవుట్‌పుట్ మాత్రం ఎంతో ఎఫెక్టివ్‌గా ఉంటుంది. కథ చెప్పే టైమ్ లో క్లారిటీ లేకపోయినా, స్క్రీన్ పై చూపించే విజన్ మాత్రం చాలా క్లియర్‌గా ఉంటుందని పలువురు నటులు కూడా అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి, జగపతి బాబు చేసిన ఈ వ్యాఖ్యలు సుకుమార్ వ్యక్తిత్వంలో మరో కోణాన్ని బయటపెట్టాయి. ఒక డైరెక్టర్ గా ఆయనకు బలహీనతలు ఉన్నప్పటికీ, వాటిని తన స్ట్రెంగ్త్‌గా మార్చుకుని, అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించడం ఆయన ప్రత్యేకతగా చెప్పుకోవాలి. కథ చెప్పడంలో కాకుండా, కథను తెరకెక్కించడంలోనే తన అసలు మేజిక్ ఉందని మరోసారి ఈ వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి.