సుకుమార్ స్కూల్ నుంచి ఇంకో ఇద్దరు

తన అసిస్టెంట్లలో ప్రతిభావంతులను గుర్తించి వారు దర్శకులయ్యేలా ప్రోత్సహించే దర్శకుడు సుకుమార్.;

Update: 2025-09-27 14:30 GMT

తన అసిస్టెంట్లలో ప్రతిభావంతులను గుర్తించి వారు దర్శకులయ్యేలా ప్రోత్సహించే దర్శకుడు సుకుమార్. పల్నాటి సూర్యప్రతాప్ (కుమారి 21 ఎఫ్), హరిప్రసాద్ జక్కా (ప్లే బ్యాక్), బుచ్చిబాబు సానా (ఉప్పెన), శ్రీకాంత్ ఓదెల (దసరా), అర్జున్ వైకే (ప్రసన్న వదనం).. ఇలా ఆయన శిష్యుల్లో దర్శకులైన వారి సంఖ్య పెద్దదే. ఇప్పుడీ కోవలో సుకుమార్ ఇంకో ఇద్దరు దర్శకులను పరిచయం చేస్తున్నట్లు సమాచారం. వాళ్లే.. వీరా కోగటం, హేమంత్.

'పుష్ప', 'పుష్ప-2' చిత్రాలకు రచనతో పాటు రీసెర్చ్ విభాగంలో కీలక పాత్ర పోషించిన వీరా కోగటం ఓ థ్రిల్లర్ కథతో సుకుమార్‌‌ను మెప్పించాడు. కొన్ని నెలల కసరత్తు తర్వాత ఈ కథ ఫైనలైజ్ అయింది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఈ సినిమాకు కడప జిల్లా రాయచోటి కుర్రాడైన కిరణ్ అబ్బవరం న్యాయం చేయగలడని టీం భావించింది. గత ఏఢాది ‘క’ సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన కిరణ్‌కూ ఈ కథ నచ్చడంతో సినిమా ఓకే అయింది.

కిరణ్ కొత్త చిత్రం ‘కే రాంప్’ వచ్చే నెలలో విడుదల కానుంది. ప్రస్తుతం అతను ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాలో నటిస్తున్నాడు. ఇది పూర్తయ్యాక వీరా కోగటం సినిమాలో నటిస్తాడు. ఈ చిత్రాన్ని సుకుమార్ అన్న కొడుకు అశోక్ బండ్రెడ్డితో కలిసి వంశీ నందిపాటి నిర్మిస్తాడు. ఓ మోస్తరు బడ్జెట్లో సినిమా తెరకెక్కనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. మరోవైపు హేమంత్ అనే కొత్త దర్శకుడు చెప్పిన మరో వైవిధ్యమైన కథకు సుకుమార్ ఓకే చెప్పారు. ఇది కొత్త నటీనటులతో తెరకెక్కే సినిమా. దీన్ని సుకుమార్ రైటింగ్స్ ప్రొడ్యూస్ చేసే అవకాశముంది.

Tags:    

Similar News