దాసరి, వర్మ తర్వాత స్థానం సుకుమార్ దే!
కానీ సుకుమార్ శిష్యులు వెలుగులోకి వచ్చిన తీరు ప్రశంసనీయం. గురువును మించిన శిష్యులనే తెలుగు పరిశ్రమకు సుకుమార్ మాత్రమే అందిస్తారు అన్నది కాదనలేని నిజం.;
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక దర్శకుడి విజయం అంటే తాను తీసే సినిమాలపైనే కాదు. అతడు తయారు చేసే శిష్య గణం పై కూడా ఆధారపడి ఉంటుందన్నది కాదనలేని నిజం. దర్శక రత్న దాసరి నారాయణరావు అనంతరం సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తమకంటూ ప్రత్యేకమైన స్కూల్ ను ఏర్పాటు చేసుకున్నారు. అదే స్థాయిలో విలక్షణ దర్శకుడు సుకుమార్ తన శిష్యులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ టాలీవుడ్‌ను శాషిస్తున్నారు అన్నది అంతే వాస్తవం. దాసరి నారాయణరావు వందలాది మందికి అవకాశం ఇచ్చి దర్శకత్వంలో ఓ వ్యవస్థనే సృష్టించారు.
ఆయన స్కూల్ నుంచి వచ్చిన ఎంతో మంది శిష్యులు సామాజిక అంశాలు , కమర్షియల్ విలువలున్న ఎన్నో సినిమాలు చేసారు. ఇక రామ్ గోపాల్ వర్మ, టెక్నికల్ వండర్స్ , క్రైమ్ డ్రామాల్లో కొత్త ఒరవడికే నాంది పలికారు. వర్మ ప్లేవర్ దాటి కొంత మంది సినిమాలు చేస్తే వర్మ తరహా ఐడియాలిజంతోహిట్లు అందుకున్న దర్శకులెంతో మంది ఉన్నారు. వారిద్దరి తర్వాత స్థానం సుకుమార్ దే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా మంది ఫేమస్ దర్శకులున్నారు. వాళ్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసి బయటకొచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు.
కానీ సుకుమార్ శిష్యులు వెలుగులోకి వచ్చిన తీరు ప్రశంసనీయం. గురువును మించిన శిష్యులనే తెలుగు పరిశ్రమకు సుకుమార్ మాత్రమే అందిస్తారు అన్నది కాదనలేని నిజం. సుకుమార్ దగ్గర పనిచేసిన వారు కేవలం దర్శకులుగా మారడమే కాకుండా, మొదటి సినిమాతోనే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. సుకుమార్ శిష్యులను విజయాల పరంగా చూస్తే? బుచ్చిబాబు తొలి సినిమా `ఉప్పెన`తో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం రెండవ సినిమా రామ్ చరణ్ తో `పెద్ది`ని పాన్ ఇండియాలో తెరకెక్కిస్తున్నాడు.
అలాగే శ్రీకాంత్ ఓదెల `దసరా` నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందించారు. ప్రస్తుతం శ్రీకాంత్ అదే నాని తో `ది ప్యారడైజ్` తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏకంగా గ్లోబల్ మార్కెట్ కే కనెక్ట్ చేయబోతున్నాడు. వీరిద్దరి కంటే ముందు `కుమారి 21ఎఫ్` పల్నాటి సూర్య ప్రతాప్ అంతే సంచలనం అయ్యాడు. `విరూపాక్ష`తో బ్లాక్ బస్టర్ అందుకున్న కార్తీక్ దండు కూడా సుకుమార్ స్కూల్ నుండి వచ్చిన వారే. త్వరలో మరింత మంది శిష్యులు సుకుమార్ స్కూల్ నుంచి బయటకు రాబోతున్నారు. వాళ్లందరితో అద్బుతాలు చేయించాలని సుకుమార్ పెద్ద ప్లాన్ తో ఉన్నాడు. తన ఐడియాల్ని సైతం షేర్ చేస్తూ స్టోరీ, డైలాగ్ రైటర్లు గా మరింత సానబెడుతున్నాడు. అవసరమైతే సుకుమార్ రైటింగ్స్ లోనే సినిమాలు నిర్మించడానికి సుక్కు సిద్దంగా ఉంటున్నాడు. ఆరకంగానూ తన శిష్యులను ప్రోత్సహించడం విశేషం.