నిర్మాతగా దూసుకుపోతున్న సుకుమార్!
అలాగే నిర్మాతగానూ సుకుమార్ మరింత బిజీ అవుతున్నారు. ఈ విషయంలో ఏ స్టార్ డైరెక్టర్ లేనంత బిజీగా సుకుమార్ కనిపిస్తున్నారు.;
దర్శకుడిగా సుకుమార్ ఎలాంటి విజయాలు అందించారు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. `ఆర్య` నుంచి `పుష్ప 2` వరకూ ఎన్నో వైవిథ్యమైన చిత్రాల్ని అందించారు. ప్రత్యేకించి `పుష్ప` విజయంతో స్టార్ డైరెక్టర్ గా ఇండియాలోనే ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. ప్రస్తుతం ఇండియాన్ టాప్ 5 డైరెక్టర్లలో ఆయన ఒకరు. ఇప్పుడా యనతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ సహా స్టార్ హీరోలంతా క్యూలో ఉన్నారు. అలాగే తెలివైన శిష్యులను అందించడంలోనూ ఆయనే ముందున్నారు. ఇప్పటికే ఆయన స్కూల్ నుంచి కొంత మంది శిష్యులు డైరెక్టర్లగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే.
అలాగే నిర్మాతగానూ సుకుమార్ మరింత బిజీ అవుతున్నారు. ఈ విషయంలో ఏ స్టార్ డైరెక్టర్ లేనంత బిజీగా సుకుమార్ కనిపిస్తున్నారు. వరుసగా తన సొంత బ్యానర్ సుకుమార్ క్రియేటివ్ వర్క్స్ లో సినిమాలు నిర్మిస్తూ హైలైట్ అవుతున్నారు. `కుమారి 21 ఎఫ్` తో నిర్మాతగా తెరంగేట్రం చేసిన లెక్కలు మాస్టారు అనంతరం అదే సినిమా రీమేక్ కు సమర్పకుడిగా వ్యవహరించారు. `100 పర్సంట్ కాదల్` ను సమర్పించారు. అటుపై బుచ్చి బాబు దర్శకత్వం వహించిన `ఉప్పెన` కు నిర్మాతగా పని చేసారు. `విరూపాక్ష` చిత్ర నిర్మాణంలోనూ భాగమయ్యారు.
`మంజుమ్మల్ బోయ్స్` లాంటి మలయాళ చిత్రాన్ని తెలుగు అనువాదంలో ఆయన హస్తం ఉంది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న `పెద్ది` సినిమాకు నిర్మాతగా కొనసాగుతున్నారు. మరో రెండు బ్యానర్లతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే నాగ చైతన్య హీరోగా కార్తీక్ద దండు తెరకెక్కిస్తోన్న `వృషకర్మ` సినిమా నిర్మాణంలో భాగమయ్యారు. అసలు విషయం ఏంటంటే ఈ సినిమాలన్నింటినీ తన శిష్యులు డైరెక్ట్ చేయడం ఇంట్రెస్టింగ్. ఆ కథల్లో సుకుమార్ హస్తం కూడా ఉంది. రచన విభాగంలో ఆయన ఇన్వాల్వ్ అవుతూ అవసరమైన ఇన్ పుట్స్ ఇస్తున్నారు.
ఆ రకంగా తన బ్రాండ్ ను, పేరునే పెట్టుబడి పెడుతున్నారు. తాజాగా ప్రియదర్శి హీరోగా కూడా ఓ సినిమా నిర్మిస్తున్నారు. తెలంగాణ నేపథ్య్ంలో సాగే చిత్రమిది. బన్నీ వాసుతో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఇవిగాక మరో రెండు..మూడు చిత్రాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఓ స్టార్ డైరెక్టర్ నిర్మాతగా ఇంత బిజీగా ఉండటం అన్నది సుకుమార్ కే చెల్లింది. `పుష్ప 2` రిలీజ్ అయిన దగ్గర నుంచి సుకుమార్ నిర్మాణంలోనే బిజీగా ఉంటున్నారు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. `పెద్ది` రిలీజ్ అనంతరం చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు.