కలెక్షన్ల కోసం కాదు.. కొత్త చరిత్ర రాయ‌డానికి జక్కన్న మిషన్!

భారతీయ సినీ చరిత్రలో భారీ బడ్జెట్ సినిమాలు కొత్త విషయం కాదు. అయితే ఒక సినిమా కోసం ఏకంగా రూ.1300 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారనే వార్త బయటకు వచ్చినప్పుడల్లా సినీ వర్గాల్లో చర్చ మొదలవుతుంది

Update: 2026-06-06 03:00 GMT

భారతీయ సినీ చరిత్రలో భారీ బడ్జెట్ సినిమాలు కొత్త విషయం కాదు. అయితే ఒక సినిమా కోసం ఏకంగా రూ.1300 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారనే వార్త బయటకు వచ్చినప్పుడల్లా సినీ వర్గాల్లో చర్చ మొదలవుతుంది. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసి ప్రాజెక్ట్ చుట్టూ అలాంటి చర్చలే జరుగుతున్నాయి. ఇది కేవలం మరో పాన్ ఇండియా సినిమా కాదని, భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించే ప్రయత్నమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ భారీ బడ్జెట్ వెనుక కూడా స్పష్టమైన వ్యూహమే కనిపిస్తోంది. ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, విదేశీ లొకేషన్లలో షూటింగ్, అత్యాధునిక టెక్నికల్ టీమ్, అంతర్జాతీయ ప్రమాణాల నిర్మాణ విలువలు వంటి అంశాల కోసం నిర్మాతలు భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో భారతీయ సినిమాను ప్రపంచ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లిన రాజమౌళి, ఈసారి మరింత పెద్ద స్థాయిని టార్గెట్‌గా పెట్టుకున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే షూటింగ్ షెడ్యూల్స్‌లో ఎలాంటి బ్రేక్‌లు లేకుండా, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా సమాంతరంగా నిర్వహిస్తూ ప్రాజెక్ట్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా మరో ప్రత్యేకత మహేష్ బాబు. దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న మహేష్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్‌లో ఆయనను పూర్తిస్థాయిలో పరిచయం చేసే సినిమా ఇప్పటివరకు రాలేదు. వార‌ణాసి ఆ లోటును తీర్చే ప్రాజెక్ట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. హాలీవుడ్ అడ్వెంచర్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని కథ, విజువల్స్, ప్రెజెంటేషన్‌తో మహేష్‌ను ప్రపంచ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు రాజమౌళి స్పెష‌ల్ ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారని సమాచారం. దీంతో ఈ సినిమా మహేష్ కెరీర్‌లోనే కాకుండా భారతీయ సినిమా చరిత్రలో కూడా కీలక మైలురాయిగా నిలిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ తర్వాత ఆస్కార్ వేదికపై భారతీయ సినిమా ప్రతిష్టను పెంచిన రాజమౌళి, ఇప్పుడు కేవలం బాక్సాఫీస్ స‌క్సెస్‌ను మాత్రమే టార్గెట్ గాపెట్టుకోలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచ మార్కెట్‌లో భారతీయ సినిమా సామర్థ్యాన్ని మరోసారి నిరూపించాలనే టార్గెట్ తోనే ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోందని భావిస్తున్నారు. అందుకే ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమాను సాధారణ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా కాకుండా, ఇండియన్ సినిమా బాక్సాఫీస్ పరిమితులను మళ్లీ నిర్వచించే ప్రయత్నంగా చూస్తున్నాయి. బాహుబలి2 తర్వాత మరోసారి చరిత్ర సృష్టించే అవకాశం ఉన్న ప్రాజెక్ట్ ఇదేనని, రాబోయే రోజుల్లో ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమకు కొత్త బెంచ్‌మార్క్‌గా మారవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News