జక్కన్నకు భీమ్‌ బర్త్‌డే స్పెషల్‌..!

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకి సంబంధించిన వర్కింగ్‌ స్టిల్‌ను షేర్ చేసిన ఎన్టీఆర్‌ తనకు జక్కన్నపై ఉన్న అభిమానంను ఇలా చూపించాడు.;

Update: 2025-10-10 05:25 GMT

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట హ్యాపీ బర్త్‌డే రాజమౌళి అంటూ ట్రెండ్‌ అవుతోంది. ప్రస్తుతం రాజమౌళి తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. మహేష్‌ బాబుతో రాజమౌళి సినిమా రూపొందిస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రెండు పార్ట్‌లను ఒక్క పార్ట్‌గా రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకు సంబంధించిన పనులను సైతం పర్యవేక్షిస్తూ ఉన్నాడు. బాహుబలి ది ఎపిక్‌ అనే టైటిల్‌ తో ఒక్క పార్ట్‌గా రాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్‌ 31న బాహుబలి ది ఎపిక్‌ను రాజమౌళి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు చేశారని సమాచారం అందుతోంది.

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

రాజమౌళి పుట్టిన రోజు సందర్భంగా బాహుబలి ది ఎపిక్‌ సినిమా ట్రైలర్‌ విడుదల చేస్తే బాగుండేది అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో మహేష్‌ బాబుతో రాజమౌళి రూపొందిస్తున్న సినిమా నుంచి అప్‌డేట్‌ వస్తుందనే వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. జక్కన్న బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు ఈ విషయాన్ని స్వయంగా చిత్ర యూనిట్‌ సభ్యులు లీక్ చేసి ఉంటారు అనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి రాజమౌళి బర్త్‌డే సందర్భంగా సోషల్‌ మీడియాలో తెగ హడావిడి ఉంది. ఇలాంటి సమయంలో యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ సైతం రాజమౌళి బర్త్‌ డే సందర్భంగా సోషల్ మీడియాలో షేర్‌ చేసిన ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాజమౌళికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్టీఆర్‌ ఎక్స్‌ లో ట్వీట్‌ చేశాడు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వర్కింగ్‌ స్టిల్‌

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకి సంబంధించిన వర్కింగ్‌ స్టిల్‌ను షేర్ చేసిన ఎన్టీఆర్‌ తనకు జక్కన్నపై ఉన్న అభిమానంను ఇలా చూపించాడు. హ్యాపీ బర్త్‌డే జక్కన్న అంటూ ఎన్టీఆర్‌ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్‌, రాజమౌళి కెరీర్‌ మొదటి నుంచి పలు సినిమాలు చేశారు. వీరి కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. స్టూడెంట్‌ నెం.1 సినిమాతో రాజమౌళి దర్శకుడిగా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఎన్టీఆర్‌ను టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ గా నిలబెట్టిన సింహాద్రి సినిమాకి సైతం రాజమౌళి దర్శకుడు అనే విషయం తెల్సిందే. వీరిద్దరూ కెరీర్‌ లో ఒకరికి ఒకరు అన్నట్లుగా నిలబడ్డారు. అందుకే వీరిద్దరి మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గానూ రాజమౌళి, ఎన్టీఆర్‌ కొనసాగుతారు అనే విషయం తెల్సిందే.

ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ

ఎన్టీఆర్‌ దేవర, వార్‌ 2 సినిమాలతో అభిమానులను నిరాశ పరిచిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో రూపొందుతున్న సినిమాకు డ్రాగన్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 2026 సమ్మర్‌ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఎన్టీఆర్‌ ప్రస్తుతం చేస్తున్న డ్రాగన్‌ సినిమా తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుందని తెలుస్తోంది. అంతే కాకుండా మరో ఇద్దరు ముగ్గురు దర్శకులు చెప్పిన కథలకు సైతం ఎన్టీఆర్ ఓకే చెప్పాడు. రాబోయే రెండు మూడు సంవత్సరాలకు గాను ఎన్టీఆర్‌ ప్రాజెక్ట్‌లను సెట్‌ చేసి పెట్టాడట. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్‌ నటించిన సినిమాలు ఏడాదికి రెండు చొప్పున ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News