అక్కడకు వెళ్లకుండా అసలు ఉండలేను
తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న శ్రీరామ్ వేణు సినిమాలు, ఫిల్మ్ మేకింగ్ మరియు తన వ్యక్తిగత విషయాల గురించి పలు ఇంట్రెస్టింగ్ అంశాలను వెల్లడిస్తున్నారు.;
ఓ మై ఫ్రెండ్, ఎంసీఏ, వకీల్‌సాబ్ సినిమాలతో మంచి అభిరుచి ఉన్న డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ వేణు ఇప్పుడు తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన తమ్ముడు జులై 4న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ఎంతో నమ్మకంగా చెప్తున్నారు శ్రీరామ్ వేణు.
తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న శ్రీరామ్ వేణు సినిమాలు, ఫిల్మ్ మేకింగ్ మరియు తన వ్యక్తిగత విషయాల గురించి పలు ఇంట్రెస్టింగ్ అంశాలను వెల్లడిస్తున్నారు. తనకు సినిమాతో ఎనలేని అనుబంధముందని, వారానికి ఒక్కసారైనా థియేటర్ కు వెళ్లకపోతే తాను అనారోగ్యానికి గురవుతానని, థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తే ఎంతో మనశ్శాంతిగా ఉంటుందని చెప్తున్నారు.
సిల్వర్ స్క్రీన్ పై సినిమాలు చూడటం కేవలం అలవాటు మాత్రమే కాదని, అది తన శరీరానికి ఎమోషనల్ అవసరంగా మారిపోయిందని, ఒక డైరెక్టర్ గా సినిమాలు తీయడం కంటే వాటిని థియేటర్లలో చూడటాన్నే తాను ఎక్కువగా ఇష్టపడతానని, సినిమాలను నెక్ట్స్ లెవెల్ లో ఎక్స్‌పీరియెన్స్ చేయడానికి, ఐమ్యాక్స్ రిలీజ్ ల కోసం తాను తరచూ చెన్నై, ముంబై వెళ్తూ ఉంటానని, తన వరకు థియేటర్ అనేది గుడి లాంటిదని, గుడికి ఎక్కువరోజులు దూరంగా ఉంటే మనశ్శాంతి ఉండదని అనిపిస్తుందని ఆయన అంటున్నారు.
తన సినిమాలు సక్సెస్ అయినప్పటికీ తన జర్నీ మాత్రం అంత ఈజీగా సాగలేదని, తన జర్నీలో ఎన్నో ఫెయిల్యూర్లను ఎదుర్కోవాల్సి వచ్చిందని, చాలా ప్రాజెక్టులు ముందుకు సాగకుండా మధ్యలోనే ఆగిపోయాయని, ఆ సినిమాలను తీయలేకపోయాననే బాధ తనకు ఇప్పటికీ ఉంటుందని శ్రీరామ్ వేణు అన్నారు. టాలీవుడ్ లో నిజాయితీ ఉన్న కథలు చెప్పడం చాలా కష్టమని, మనం తీసే సినిమాలు అందరికీ నచ్చేలా ఉండాలని హీరోలు, నిర్మాతలు రెగ్యులర్ గా ప్రెజర్ పెడుతుంటారని ఆయన అన్నారు. ఇలాంటి టార్గెట్ లు డైరెక్టర్లను, సినిమా కథలను వీక్ గా మారుస్తాయని, అందుకే డైరెక్టర్లు ఎలాంటి ఒత్తిడులకు లోనవకుండా తమ ప్యాషన్ ను ఫాలో అవాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా శ్రీరామ్ వేణు తన వ్యక్తిగత బాధ గురించి కూడా వెల్లడించారు. తన మొదటి సినిమా ఓ మై ఫ్రెండ్ రిలీజ్ రోజే తన తండ్రి చనిపోయారని చెప్పిన ఆయన, సినిమాకీ సినిమాకీ మధ్య ఎక్కువ గ్యాప్ వచ్చినా, ఎప్పుడూ కథలపై వర్క్ చేయడం మానేయలేదని, ఈ విషయంలో తన భార్య, కుటుంబం తనకు చాలా సపోర్ట్ గా ఉన్నారని చెప్పారు. డైరెక్టర్ గా మారడానికి తానేమీ ఫిల్మ్ స్కూల్ కు వెళ్లలేదని, సినిమాలు చూడటం, స్టార్ డైరెక్టర్ల రైటింగ్స్ ను ఫాలో అవడం ద్వారా తాను డైరెక్టర్ ను అయ్యానని చెప్పిన శ్రీరామ్ వేణు, రాజ్ కుమార్ హిరానీ, స్టీవెన్ స్పీల్బర్గ్ లాంటి డైరెక్టర్లను తానెంతగానో ఆరాధిస్తానని, బైసైకిల్ థీవ్స్, గుడ్ఫెల్లాస్, లగాన్, ది లాస్ట్ ఎంపరర్ తనకు ఇష్టమైన సినిమాలని ఆయన పేర్కొన్నారు.