క్షణక్షణం నాటి చేదు జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్న చాల్‌బాజ్ డైరెక్టర్!

పంకజ్ పరాశర్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీదేవితో రామ్ గోపాల్ వర్మ `క్షణక్షణం` సినిమా తీస్తున్న సమయంలో ఆమెను బరువు తగ్గాలని కోరారు.

Update: 2026-10-01 16:30 GMT

అతిలోక సుంద‌రి, దివంగత నటి శ్రీదేవి గ్లామర్ వెనుక ఉన్న కొన్ని చేదు నిజాలు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. గ్లామర్ ఇండస్ట్రీలో అందంగా, స్లిమ్‌గా కనిపించాలనే ఒత్తిడి కథానాయికలపై ఏ స్థాయిలో ఉంటుందో? వివరించే ఓ పాత సంఘటనను `చాల్‌బాజ్` చిత్ర దర్శకుడు పంకజ్ పరాశర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దశాబ్దాల క్రితం రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన సలహా వల్ల శ్రీదేవి తీవ్ర అనారోగ్యానికి గురైన వైనాన్ని పంక‌జ్ గుర్తు చేసుకున్నారు.

పంకజ్ పరాశర్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీదేవితో రామ్ గోపాల్ వర్మ `క్షణక్షణం` సినిమా తీస్తున్న సమయంలో ఆమెను బరువు తగ్గాలని కోరారు. ఆ ఒత్తిడితో శ్రీదేవి క్రాష్ డైటింగ్ (అత్యంత కఠినమైన ఆహార నియమాలు) ప్రారంభించారు. శరీరంలో ఉప్పు శాతాన్ని పూర్తిగా తగ్గించడంతో ఆమె బ్లడ్ ప్రెజర్ (బిపి) ఒక్కసారిగా పడిపోయింది. ఈ క్రమంలో షూటింగ్ సెట్స్‌లోనే స్పృహతప్పి పడిపోయిన శ్రీదేవి ఎదురుగా ఉన్న టేబుల్‌ను బలంగా ఢీకొట్టడంతో 20 నిమిషాల పాటు అచేతనంగా ఉండిపోయారు.

ఈ ప్రమాదంలో శ్రీదేవి తలకు తీవ్ర గాయమవ్వడమే కాకుండా ముఖానికి దెబ్బ తగిలి ఒక పన్ను కూడా ఊడిపోయిందని పంకజ్ పరాశర్ పేర్కొన్నారు. ముఖంపై పడిన గాయాల కారణంగా ఆమె కొన్ని రోజుల పాటు షూటింగ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ అకస్మాత్తు పరిణామంతో శ్రీదేవి నటిస్తున్న `మేరీ బీవీ కా జవాబ్ నహీ` అనే చిత్రం తీవ్రంగా ప్రభావితమైందని, ఆ తర్వాత తలెత్తిన ఆర్థిక కారణాలు, నిర్మాత మరణం వంటి పరిణామాలతో ఆ సినిమా నిర్మాణం నిలిచిపోయిందని గుర్తు చేసుకున్నారు.

అలా నిలిచిపోయిన `మేరీ బీవీ కా జవాబ్ నహీ` చిత్రాన్ని చాలా ఏళ్ల తర్వాత (2004లో) పూర్తిస్థాయి క్లైమాక్స్ లేకుండానే అరకొరగా విడుదల చేశారని పంకజ్ తెలిపారు. ఈ సినిమాలో శ్రీదేవి సరసన నటించిన అక్షయ్ కుమార్ కూడా గతంలో టాక్ షోలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. సినిమా ముగింపు సీన్ షూట్ చేయలేకపోవడంతో, కథానాయకుడు, కథానాయకి చివరకు పగ తీర్చుకున్నారు` అని స్క్రీన్ పై రాసి సినిమాను ముగించాల్సి వచ్చిందని వెల్లడించారు.

శ్రీదేవి కఠినమైన డైటింగ్ నియమాల వల్ల ఎదుర్కొన్న సమస్యల గురించి ఆమె భర్త బోనీ కపూర్ కూడా గతంలో పలుమార్లు మాట్లాడారు. శ్రీదేవికి తరచూ లో-బీపీ సమస్య ఉండేదని అయినా? తెరపై మరింత సన్నగా కనిపించడానికి ఆహారంలో ఉప్పును పూర్తిగా నివారించేవారని తెలిపారు. శ్రీదేవి మరణం తర్వాత నాగార్జున కూడా బోనీ కపూర్‌ను పరామర్శించినప్పుడు.. ఒక సినిమా షూటింగ్ సమయంలో డైటింగ్ వల్ల ఆమె బాత్‌రూమ్‌లో స్పృహతప్పి పడిపోయి పన్ను విరగ్గొట్టుకున్న సంఘటనను గుర్తు చేసుకున్నారని బోనీ పేర్కొన్నారు.

తెరపై నటనతో, అందంతో కోట్లాది మంది అభిమానులను మైమరపించిన శ్రీదేవి జీవితంలో.. పరిశ్రమ నిర్దేశించిన సౌందర్య ప్రమాణాలను అందుకోవడానికి పడిన శ్రమ, ఎదుర్కొన్న శారీరక ఇబ్బందులు ఈ సంఘటనల ద్వారా స్పష్టమవుతున్నాయి. ఒక నటిగా అగ్రస్థానంలో కొనసాగుతున్న సమయంలోనూ సన్నగా కనిపించాలనే ఒత్తిడి ఆమె ఆరోగ్యంతో పాటు అనేక సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపిందో? పంకజ్ పరాశర్ వ్యాఖ్యలతో మ‌రోసారి తేట తెల్ల‌మ‌వుతోంది.

Tags:    

Similar News