మమిత పారితోషికం పుకార్లు నిజమేనా?
కేరళ కుట్టి మమిత బైజు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అనడంలో సందేహం లేదు. ఇటీవల ఆమె నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్, బెత్లెహెం కుటుంబ యూనిట్ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి
కేరళ కుట్టి మమిత బైజు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అనడంలో సందేహం లేదు. ఇటీవల ఆమె నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్, బెత్లెహెం కుటుంబ యూనిట్ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా మలయాళ మూవీ బెత్లెహెం కుటుంబ యూనిట్ ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఓటీటీలోనూ సినిమా గురించి చర్చ జరుగుతోంది. సినిమాలో ఆమె పాత్రపై ప్రశంసలు కురుస్తున్నాయి. అంతకు ముందు వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్‌లో మమిత యాక్టింగ్‌కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అప్పుడెప్పుడో బొమ్మరిల్లు సినిమాలో హాసిని ని చూశాం, మళ్లీ ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో మ్యాడీని చూశాం అనే కామెంట్స్ వినిపించాయి. చాలా యాక్టివ్ అమ్మాయి పాత్రల్లో మమిత బైజు నటిస్తే ఆ పాత్రకే గుర్తింపు తీసుకు వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
మమిత బైజు పారితోషికం రూమర్స్...
సాధారణంగా ఏ హీరో అయినా ఏ హీరోయిన్ అయినా ఈ స్థాయిలో గుర్తింపు, బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్స్ పడితే ఆగుతారా... పారితోషికం పెంచేస్తారు. అందరిలాగే మమిత బైజు తన పారితోషికంను పెంచేసింది అంటూ మలయాళం మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ మధ్య తెలుగు మీడియాలోనూ ఒక టాలీవుడ్ మూవీ కోసం మమిత బైజు భారీ పారితోషికం డిమాండ్ చేసింది అంటూ వార్తలు వచ్చాయి. తమిళ్‌లోనూ ఈమె పారితోషికం గురించి కథనాలు వచ్చినట్లు సమాచారం. మీడియం రేంజ్ నిర్మాతలకు అందనంత ఎత్తులో మమిత బైజు నిల్చుందని, ఆమెను అందుకోవాలంటే పెద్ద నిర్మాతలు, పెద్ద హీరోలకు మాత్రమే సాధ్యం అన్నట్లుగా మమిత గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అవన్నీ వాస్తవం కాదని, మీడియాలో వస్తున్న మమిత పారితోషికం వార్తలు కేవలం పుకార్లే అని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
జన నాయగన్ సినిమాతో మమిత...
మమిత ఈ ఏడాది రెండు భారీ కమర్షియల్ హిట్స్ ను అందుకుంది. అంతే కాకుండా విజయ్‌తో కలిసి నటించిన జననాయగన్ సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొత్తంగా ఈ ఏడాదిలో మమిత నుంచి ఇప్పటి వరకు నాలుగు సినిమాలు వచ్చాయి. నాలుగు సినిమాలు ఆమె క్రేజ్ ను పెంచాయి. అయినా కూడా మమిత తన పారితోషికంను భారీగా పెంచిన మాట వాస్తవం కాదని, ఈమధ్య కాలంలో ఆమె కొత్తగా కమిట్ అయిన సినిమాలే లేవు అనేది ఆమె సన్నిహితుల మాట. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల పారితోషికం ఇంతకు ముందు చేసిన సినిమాల పారితోషికం మాదిరిగానే ఉందని, కోట్ల రూపాయలు తీసుకుని మమిత సినిమాలు ఏమీ చేయడం లేదని వారు అంటున్నారు. ముఖ్యంగా రూ.15 కోట్ల పారితోషికం వార్తలను ఇప్పటికే మమిత బైజు సైతం కొట్టి పారేసిన విషయం తెల్సిందే. తన కెరీర్‌లో అతి పెద్ద పుకారు ఇదే అంటూ మమిత సరదాగా చెప్పుకొచ్చింది.
టాలీవుడ్‌లో మమిత మూవీ ఎప్పుడు..
వరుస విజయాలు సొంతం అయ్యాయి కనుక మమిత కొత్త సినిమాలకు రెండున్నర నుంచి మూడు కోట్ల రూపాయల పారితోషికంను డిమాండ్ చేయవచ్చు అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మమిత బైజు పారితోషికం భారీగా పెంచింది అంటూ వస్తున్న పుకార్ల కారణంగా కొందరు నిర్మాతలు ఆమెతో చర్చలు జరిపేందుకు కూడా భయపడుతున్నారట. అందుకే ఆమె టీం మెంబర్స్ పనిగట్టుకుని మరీ పారితోషికం విషయమై వస్తున్న వార్తలను కొట్టిపారేస్తున్నారు. పారితోషికం గురించి ఇప్పటి వరకు మీడియాలో వచ్చిన వార్తలు అన్నీ పుకార్లే అని, ఆమె ఇప్పటి వరకు తన తోటి హీరోయిన్స్ తీసుకుంటున్న పారితోషికం కంటే తక్కువే తీసుకుందని వారు వాదిస్తున్నారు. ఇక ముందు కూడా తనకు ఉన్న ఇమేజ్, మార్కెట్‌ను బట్టి పారితోషికం తీసుకుంటుందట. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు రూ.5 కోట్లు, రూ.10 కోట్ల పారితోషికంను మమిత డిమాండ్ చేయడం లేదని క్లారిటీ వచ్చినట్లే. మమిత తెలుగులో చేయబోతున్న సినిమా ఏంటా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.