భాగ్యశ్రీని పొగడండి.. శ్రీలీలను తిట్టడమెందుకు?

ఒక సినిమాకు ముందో హీరోయిన్ని అనుకుని తర్వాత ఇంకో కథానాయికను తీసుకోవడం ఫిలిం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు.

Update: 2026-07-12 03:15 GMT

ఒక సినిమాకు ముందో హీరోయిన్ని అనుకుని తర్వాత ఇంకో కథానాయికను తీసుకోవడం ఫిలిం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. ఆ పాత్ర క్లిక్ అయితే, ఆ సినిమా బాగా ఆడితే ముందు అవకాశాన్ని వదులుకున్న హీరోయిన్ అన్ లక్కీ అనుకుంటారు. అంతకుమించి పెద్దగా డిస్కషన్ ఉండదు. కానీ ఇలా ఛాన్స్ మిస్సయిన హీరోయిన్ని అదే పనిగా టార్గెట్ చేస్తూ నెగెటివ్ కామెంట్లు చేస్తుండడమే విడ్డూరం.

‘లెనిన్’ సినిమాకు ముందు కథానాయికగా ఎంపికై, తర్వాత ఏవో కారణాలతో తప్పుకున్న శ్రీలీల గురించి ఇలాంటి డిస్కషనే నడుస్తోంది సోషల్ మీడియాలో. శ్రీలీల స్థానంలోకి వచ్చిన భాగ్యశ్రీ బోర్సే ఈ అవకాశాన్ని గొప్పగా ఉపయోగించుకుంది. ప్రోమోల్లోనే అందరి దృష్టినీ ఆకర్షించిన భాగ్యశ్రీ.. సినిమాలోనూ ఆకట్టుకుంది. పాటల్లో అందచందలు, డ్యాన్సులతో అదరగొట్టిన భాగ్యశ్రీ.. నటనలోనూ మెప్పించింది. ఓవరాల్‌గా తన పెర్ఫామెన్స్‌కు మంచి స్పందన వస్తోంది. ఇప్పటిదాకా ఒక్క హిట్టూ కొట్టని భాగ్యశ్రీకి ‘లెనిన్’ ఒక మోస్తరు విజయాన్నందించేలా కనిపిస్తోంది.

ఐతే ‘లెనిన్’ చూసిన వాళ్లు భాగ్యశ్రీని కొనియాడడం వరకు పరిమితం అయితే పర్వాలేదు. కానీ ఇదే సమయంలో శ్రీలీలను టార్గెట్ చేస్తున్నారు. ఆమె భారతి పాత్రను చేసి ఉంటే అది పాడైపోయేదని.. భాగ్యశ్రీలా ఆ పాత్రను పండించేది కాదని.. కీలక సన్నివేశాల్లో తేలిపోయేదని కామెంట్లు చేస్తున్నారు. శ్రీలీలను తప్పించి మంచి పని చేశారంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఐతే శ్రీలీల ఎంత కమిటెడ్ యాక్ట్రెస్, ఎంత ప్రొఫెషనల్‌గా, ఉంటుంది, ఎంత అణకువతో వ్యవహరిస్తుంది అన్నది అందరికీ తెలుసు. ఎప్పుడూ యాటిట్యూడ్ చూపించింది లేదు. అణకువతో ఉంటుంది. తాను పని చేసే చిత్రాలకు ప్రమోషన్ల దగ్గర్నుంచి అన్ని విషయాల్లో పూర్తిగా సహకరిస్తుంది.

నటిగా శ్రీలీలకు కొన్ని పరిమితులుండొచ్చు. కానీ మంచి పాత్ర పడితే ఎలా పెర్ఫామ్ చేయగలదో ‘పరాశక్తి’ చిత్రంలో చూడొచ్చు. ఆమెకు మంచి పాత్రలు ఇవ్వకపోవడం, పెర్ఫామెన్స్ రాబట్టుకోలేకపోవడంలో దర్శకుల తప్పూ ఉందన్నది వాస్తవం. ఆమె నటించిన పాత్రల్లో విషయం లేకపోవడం, తన సినిమాలు చాలా వరకు ఫెయిలవడంలో తన ప్రమేయం ఏముంది? ఎప్పుడో తాను తప్పుకున్న ఓ సినిమాకు సంబంధించి ఇప్పుడు తనను టార్గెట్ చేయడం ఎంతమాత్రం సమంజసం కాదు.

Tags:    

Similar News