చాకో వల్లే లొకేషన్స్ దొరికాయట.. శ్రీవిష్ణు అలా అన్నారేంటి?
టాలీవుడ్ లో ప్రత్యేకమైన కథలు, వినూత్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న శ్రీవిష్ణు ప్రస్తుతం కామ్రేడ్ కళ్యాణ్ సినిమాతో బిజీగా ఉన్నారు.
టాలీవుడ్ లో ప్రత్యేకమైన కథలు, వినూత్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న శ్రీవిష్ణు ప్రస్తుతం కామ్రేడ్ కళ్యాణ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ మూవీలో మాలీవుడ్ యాక్టర్ షైన్ టామ్ చాకో విలన్ గా యాక్ట్ చేస్తున్నారు. తాజాగా సినిమా ఫస్ట్ సింగిల్ ఒరియా పిల్లా రిలీజ్ ఈవెంట్ లో శ్రీవిష్ణు చేసిన కామెంట్స్ అందరినీ నవ్వించాయి. ముఖ్యంగా చాకో గురించి ఆయన చెప్పిన సరదా సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
షూటింగ్ సమయంలో చాకో బిహేవియర్ చాలా భిన్నంగా ఉండేదని శ్రీవిష్ణు తెలిపారు. ముఖ్యంగా అడవి ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు దర్శకుడు కట్ చెప్పగానే చాకో అక్కడి నుంచి కనిపించకుండా వెళ్లిపోయేవారని చెప్పారు. ఆయన ఎటు వెళ్లారో తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా నలుగురు అసిస్టెంట్ డైరెక్టర్లను కూడా నియమించాల్సి వచ్చిందంటూ ఫన్ చేశారు.
"చాకో గారి కాళ్లకు స్టెబిలిటీ ఉండదేమో. కట్ చెప్పగానే ఎక్కడికో వెళ్లిపోయేవారు. కొన్నిసార్లు రెండు, మూడు కిలోమీటర్ల దూరం వరకు వెళ్లేవారు. ఆయనను వెతకడానికి మేమంతా వెళ్లాల్సి వచ్చేది. అయితే ఆ వెతుకులాటలోనే చాలా అందమైన ప్రదేశాలు కనిపించాయి. నిజంగా మంచి లొకేషన్లు దొరకడానికి చాకో గారే కారణం. అందుకే ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి" అంటూ శ్రీవిష్ణు చేసిన కామెంట్స్ ఈవెంట్ కు స్పెషల్ అట్రాక్షన్ గా మారాయి.
శ్రీవిష్ణు కామెంట్స్ ను స్టేజ్ పై ఉన్న సినిమా టీమ్ మెంబర్స్ కూడా ఆసక్తిగా విన్నారు. ఆయన చెప్పిన తీరు చూస్తే షూటింగ్ సమయంలో మూవీ యూనిట్ మెంబర్స్ మధ్య ఎంత మంచి రిలేషన్ ఏర్పడిందో అర్థమవుతోందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా వచ్చిన ఆ సరదా సంఘటన ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
ఇదిలా ఉండగా, షైన్ టామ్ చాకోకు తెలుగులో ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. మొదట డబ్బింగ్ సినిమాల ద్వారా పరిచయమైన ఆయన, నాని నటించిన దసరా చిత్రంలో చిన్న నంబి పాత్రతో నేరుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఆ సినిమాలో ఆయన నటనకు మంచి ప్రశంసలు లభించాయి. అనంతరం రంగబలి, దేవర, డాకు మహారాజ్, రాబిన్ హుడ్ వంటి పలు చిత్రాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.
ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న చాకోమ కామ్రేడ్ కళ్యాణ్ లో విలర్ రోల్ లో కనిపించనున్నారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్ గా నటిస్తున్నారు. విలేజ్ లవ్ స్టోరీకి భిన్నమైన బ్యాక్ డ్రాప్ యాడ్ చేస్తూ రూపొందిస్తున్న ఆ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.
ఇటీవల విడుదలైన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఒరియా పిల్లా పాట కూడా ఆకట్టుకుంటుండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఏదేమైనా షైన్ టామ్ చాకోతో వర్క్ ఎక్స్పీరియన్స్ ను శ్రీవిష్ణు సరదాగా పంచుకోవడం మాత్రమే కాకుండా, ఆయన వల్లే అందమైన లొకేషన్లు కూడా దొరికాయని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రమోషన్స్ పరంగా కూడా ప్లస్ అయింది.