స్పెషల్ 'ఓపీఎస్ 2' - టాక్ ఎలా ఉందంటే?
వెబ్ సిరీస్ స్టోరీ లైన్ అండ్ స్టోరీ చాలా బాగుందని కొనియాడుతున్నారు. ఆకర్షణీయంగా ఉందని చెబుతున్నారు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందని అంటున్నారు.;
ఓటీటీల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెబ్ సిరీసుల్లో స్పెషల్ ఓపీఎస్ ఒకటి. స్పై యాక్షన్ జానర్ లో రూపొందిన ఫస్ట్ సీజన్ ఎంతగానో థ్రిల్ పంచింది. ఆ తర్వాత అందులో అంతర్భాగంగా స్పెషల్ ఓపీఎస్ 1.5: ది హిమ్మత్ స్టోరీ పేరుతో వచ్చిన 4 ఎపిసోడ్స్‌లు కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు స్పెషల్ ఓపీఎస్ 2 స్ట్రీమింగ్ అవుతోంది.
ఉగ్రవాదుల పని పట్టడానికి రా (RAW), ఇంటెలిజెన్స్ వర్గాలు ఎలాంటి సీక్రెట్ ఆపరేషన్లు నిర్వహిస్తాయన్నది స్పెషల్ ఓపీఎస్ లో చూపించారు. ఆ తర్వాత రా ఉన్నతాధికారి అయిన హిమ్మత్ సింగ్ (కేకే మేనన్) తొలి రోజుల్లో ఎదుర్కొన్న సవాళ్లను స్పెషల్ ఓపీఎస్ 1.5లో కళ్లకు కట్టినట్లు చూపించి అందరినీ ఆకట్టుకున్నారు.
ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ క్రైమ్ నుంచి వచ్చే సవాళ్లతో తీర్చిదిద్దిన స్పెషల్ ఓపీఎస్ 2ను తీసుకొచ్చారు. హిమ్మత్ సింగ్, ఆయన టీమ్ ఏఐ, సైబర్ క్రైమ్ నుంచి భారత్ కు ఎదురయ్యే సవాళ్లతో పోరాటాన్ని చూపించారు. స్పెషల్ ఓపీఎస్ లో 2లో అనేక మంది కొత్త నటీనటులు కూడా కనిపించడం విశేషం.
తాహిర్ రాజ్ బాసిన్, సయామీఖేర్, ముజామిల్ ఇబ్రహీం, టోటా రాయ్ చౌదరితో పాటు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటించారు. నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తూ నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే సిరీస్ చూసిన ఓటీటీ లవర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రివ్యూస్ ఇస్తున్నారు. అవి కాస్త వైరల్ గా మారాయి.
వెబ్ సిరీస్ స్టోరీ లైన్ అండ్ స్టోరీ చాలా బాగుందని కొనియాడుతున్నారు. ఆకర్షణీయంగా ఉందని చెబుతున్నారు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందని అంటున్నారు. క్యాస్టింగ్ అంతా మంచి ప్రదర్శనలు ఇచ్చారని కామెంట్లు పెడుతున్నారు. ప్రకాష్ రాజ్ రోల్ కాస్త సెట్ అవ్వలేదని, విలన్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీ బాలేదని అంటున్నారు.
కేకే మేనన్ ఎప్పటిలానే తన పాత్రలాగే సిరీస్ ను ముందుండి నడిపించారని, కీలకమైన సీన్స్ లో అద్భుతంగా నటించారని కొనియాడుతున్నారు. ఆయన టీమ్ లోని వారంతా బాగా నటించారని అంటున్నారు. తాహిర్ రాజ్ భాసిన్ తన వైరుధ్య నటనతో మెప్పించారని చెబుతున్నారు. గౌతమి కపూర్ తన పాత్ర పరిమిత పరిధిలో ఆకట్టుకున్నారని, అద్వైత్ నెమ్లేకర్ సంగీతం స్టోరీ పాయింట్ కు దగ్గరగా ఉందని చెబుతున్నారు.
సినిమాటోగ్రాఫర్స్ అరవింద్ సింగ్, డిమో పోపోవ్ వర్క్ అద్భుతంగా ఉందని, అబ్బాస్ అలీ మొఘుల్, లాస్లో కోజా, ఇరాక్లి సబానోజ్‌ల యాక్షన్ కొరియోగ్రఫీ అత్యున్నతమైనదిగా చెబుతున్నారు. నీరజ్ పాండే, దీపక్ కింగ్‌రానీ, బెనజీర్ అలీ ఫిదా రాసిన రచన చాలా స్పష్టంగా, వివరంగా ఉందని అంటున్నారు. ఓవరాల్ గా సిరీస్ బాగుందని కొనియాడుతున్నారు.