సల్మాన్ ఓటమి ఈ సౌత్ స్టార్ చేతిలో ఖాయం?
ఖాన్‌లను రేసులో వెనక్కి నెట్టే సత్తా ఇప్పుడు సౌత్ బిగ్గెస్ట్ స్టార్లకు ఉందా? అంటే.. ఈ ప్రశ్నకు సమాధానం స్పష్ఠంగా `అవును` అనే వినిపిస్తోంది.;
ఖాన్‌లను రేసులో వెనక్కి నెట్టే సత్తా ఇప్పుడు సౌత్ బిగ్గెస్ట్ స్టార్లకు ఉందా? అంటే.. ఈ ప్రశ్నకు సమాధానం స్పష్ఠంగా `అవును` అనే వినిపిస్తోంది. సౌతిండియా నుంచి ప్రభాస్, యష్, ఎన్టీఆర్, చరణ్ లాంటి స్టార్లు పాన్ ఇండియా స్టార్లుగా నిరూపించుకున్నారు. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లలో నిరూపించుకునేందుకు ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. అదే సమయంలో 60 ప్లస్ ఖాన్ ల త్రయం రేసులో వెనకబడటం ప్రధానంగా చర్చకు వస్తోంది. ఖాన్‌ల త్రయం అంటే ఒకప్పుడు అనే భావన ప్రజల్లో పాదుకుంది. ముఖ్యంగా ఖాన్ లు ఉత్తరాదిన హవా చాటగలిగినా, ఇప్పటికీ సౌత్ లో ఒక ముద్ర వేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. అందువల్ల భవిష్యత్ లో వారికి సౌత్ వసూళ్లు అందని మావి లాంటివి.
సరిగ్గా అదే సమయంలో సౌత్ స్టార్లు సౌత్ వసూళ్లను మించి, ఉత్తరాది మార్కెట్లో బాక్సాఫీస్ వద్ద హవా సాగిస్తున్నారు. సౌతిండియా వసూళ్లకు మూడు నాలుగు రెట్లు అదనంగా ఉత్తరాది మార్కెట్ నుంచి కొల్లగొడుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. అందువల్ల త్వరలో విడుదలకు వస్తున్న యష్ - టాక్సిక్, సల్మాన్ - ది బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ చిత్రాలలో హైప్ దేనికి ఎక్కువ? అనేది చర్చగా మారింది.
ఈసారి కూడా రాకింగ్ స్టార్ యష్ హవా సాగేందుకు ఆస్కారం ఉంది. అతడికి ఉత్తరాదిన మాస్ లో మ్యాసివ్ ఫాలోయింగ్ ఉంది గనుక `టాక్సిక్` ఓపెనింగులు అసాధారణంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 తర్వాత యష్ చాలా గ్యాప్ తీసుకుని మహిళా దర్శకురాలు గీతూ మోహన్ దర్శకత్వంలో టాక్సిక్ అనే ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి రాజీ అన్నదే లేకుండా బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారు. ఇది యష్ స్థాయిని మరో లెవల్ కి తీసుకెళుతుందని అభిమానులు భావిస్తున్నారు.
అదే సమయంలో సల్మాన్ ఖాన్ రెండు వరుస పరాజయాల తర్వాత యుద్ధభూమిలో దిగుతున్నాడు. అతడు నటించిన టైగర్ 3, సికందర్ భారీ డిజాస్టర్లుగా మారాయి. ఆ తర్వాత అతడు నటిస్తున్న ది బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ పై అతడి ఆశలన్నీ ఉన్నాయి. ఇది దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న సినిమా. ఇండో చైనా బార్డర్ నేపథ్యంలో కథాంశం సాగనుంది. ఈ చిత్రానికి అత్యంత భారీ బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారు. అయితే సల్మాన్ ఖాన్ ఎంపిక సరైనదే అయినా టీజర్లు, ట్రైలర్ తో ఈ చిత్రం అందరినీ ఆకట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే యష్ నటించిన టాక్సిక్ టీజర్ ఆకట్టుకుంది. దానిని మించేలా ఖాన్ తన ప్రచార వీడియోలను బరిలోకి దించాలి. 2026 వేసవిలో మాస్ జాతరకు తెర తీయాలంటే ఆ ఇద్దరూ భారీగా ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రేసులో ఎవరు విజేతగా నిలుస్తారు? ఎవరు వెనకబడతారు? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ రెండు సినిమాలు ఒకదానితో ఒకటి సంబంధం లేని కథలతో వస్తున్నాయి గనుక ప్రజల ప్రాధాన్యత దేనికి ఎక్కువ? అన్నది కూడా వేచి చూడాలి. అంతిమంగా ప్రేక్షకులను కుర్చీ అంచుపైకి లాగే, ఎమోషన్ కి గురి చేసే కథాంశం, గ్రిప్పింగ్ స్టోరి టెల్లింగ్ బాక్సాఫీస్ వద్ద గెలిపిస్తాయనడంలో సందేహం లేదు.
ఈ రెండు సినిమాలు అత్యంత భారీ బడ్జెట్లతో రూపొందుతున్నందున కనీసం 500 కోట్ల నికర వసూళ్లను సాధిస్తేనే ఇవి విజయం సాధించినట్టు. మారిన ట్రెండ్ లో పాన్ ఇండియాలో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారో అలాంటి హీరోలకు మాత్రమే విజయం దక్కినట్టు భావించాలి.