2026లో సౌత్ సినిమాల OTT ట్రెండ్స్‌కు కొత్త దిశ.. ప్రేక్షకుల తీర్పు మారుతోందా?
ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు ఇప్పుడు సినిమాలకు రెండో అవకాశంగా మాత్రమే కాకుండా, సక్సెస్ కు మరో స్టేజ్ గా కూడా మారుతున్నాయి.
ఒకప్పుడు సినిమా సక్సెస్ అంటే మొదటి వీకెండ్ కలెక్షన్లు, థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులను మాత్రమే ప్రమాణాలుగా చెప్పుకునేవారు. కానీ 2026లో పరిస్థితి పూర్తిగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సౌత్ సినిమాల డిజిటల్ జర్నీ చూస్తే, థియేటర్లలో వచ్చిన రిజల్ట్ ఆడియన్స్ తుది తీర్పు కాదనే విషయం మరోసారి స్పష్టమవుతోంది. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు ఇప్పుడు సినిమాలకు రెండో అవకాశంగా మాత్రమే కాకుండా, సక్సెస్ కు మరో స్టేజ్ గా కూడా మారుతున్నాయి.
ఈ ఇయర్ రిలీజైన పలు సౌత్ సినిమాల డిజిటల్ పెర్ఫార్మెన్స్ ను పరిశీలిస్తే ఓ ఇంట్రెస్టింగ్ ధోరణి కనిపిస్తోంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఫలితాలని ఇవ్వని కొన్ని సినిమాలు ఓటీటీలో భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటుండగా, బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా డిజిటల్‌లో అదే జోరును కొనసాగిస్తున్నాయి. దీంతో బాక్సాఫీస్ రిజల్ట్స్, ఓటీటీ రెస్పాన్స్ మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఈ మార్పుకు ప్రేక్షకుల వీక్షణ అలవాట్లే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. థియేటర్‌కు వెళ్లలేకపోయిన ఫ్యామిలీ ఆడియన్స్ ఇంట్లోనే కలిసి సినిమాలను చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ఒకేసారి అందరికీ అందుబాటులో ఉండటం, టైమ్ కు అనుగుణంగా చూసే ఫ్రీడమ్, రీపీట్ వ్యూయింగ్ అవకాశం వంటి అంశాలు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌కు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. థియేటర్లలో మిస్ అయిన సినిమాలను కూడా ఓటీటీలో చూసి స్వయంగా అభిప్రాయం ఏర్పరుచుకోవాలనే ధోరణి పెరుగుతోంది.
మరో ఇంట్రెస్టింగ్ అంశం తెలుగు సినిమాల ప్రదర్శన. ఈ ఇయర్ ఎక్కువగా చూసిన సౌత్ సినిమాల లిస్ట్ లో తెలుగు సినిమాలు బలమైన స్థానాన్ని సంపాదించడం ఇండస్ట్రీకి సానుకూల సంకేతంగా చెప్పొచ్చు. రాజా సాబ్, అగ్లీ స్టోరీ, అఖండ2, అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలకు డిజిటల్ లో నెక్ట్స్ లెవెల్ రెస్పాన్స్ వస్తోంది. పాన్ ఇండియా హంగామా లేకపోయినా, కథలో ఉన్న ఎంటర్టైన్‌మెంట్, ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువయ్యే అంశాలు, స్టార్ ఎట్రాక్షన్ వంటి రీజన్స్ తో ఈ సినిమాలు డిజిటల్‌లో మంచి ఆదరణ పొందుతున్నాయి. అదే సమయంలో మలయాళ సినిమాలు కూడా స్ట్రాంగ్ కంటెంట్ డిజిటల్ మార్కెట్‌లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. దీంతో భాషల మధ్య పోటీ కంటే మంచి కథలకే ఆడియన్స్ ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది.
ఈ పరిణామాలు విమర్శకుల అభిప్రాయాలు ఒకవైపు ఉంటే, నార్మల్ ఆడియన్స్ ఛాయిస్ మరోవైపు సాగుతోందనే చర్చకు దారి తీస్తున్నాయి. రివ్యూలు ఆశించిన స్థాయిలో లేకపోయినా, ఓటీటీలో కొన్ని సినిమాలు భారీ వ్యూయర్‌షిప్ ను అందుకోవడం ఈ మార్పుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే, 2026లో సౌత్ సినిమాలు ఓటీటీ మార్కెట్‌కు కొత్త దిశను చూపిస్తున్నాయి. దీంతో సినిమా సక్సెస్ ను ఇకపై కేవలం థియేటర్ కలెక్షన్లతో మాత్రమే అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. డిజిటల్ వ్యూయర్‌షిప్ కూడా ఇప్పుడు సినిమా ప్రభావాన్ని కొలిచే కీలక ప్రమాణంగా మారుతోంది. రాబోయే రోజుల్లో దర్శకనిర్మాతలు తమ రిలీజ్ స్ట్రాటజీలను రూపొందించే సమయంలో ఓటీటీ ప్రభావాన్ని మరింత ప్రాధాన్యంగా పరిగణించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.