వివాదాస్పద నటి బయోపిక్.. ప్రముఖ గాయకుడి కుమారుడితో గొడవ హైలైట్‌గా?!
అప్పట్లో కోలీవుడ్‌లో పెను సంచలనం సృష్టించిన ఈ గొడవ గురించి సోనా ఏవిధంగా తెరపై చూపించబోతోందో అనే చర్చ సాగుతోంది.;
తమిళ నటి సోనా హైడెన్ బయోపిక్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. 'స్మోక్' పేరుతో రూపొందుతున్న ఈ బయోపిక్ ని సోనా స్వయంగా దర్శకత్వం వహిస్తుండగా, ఈ జీవితకథలో దివంగత లెజెండరీ గాయకుడి కుమారుడు కం ప్రముఖ గాయకుడి మధ్య జరిగిన వివాదం కూడా హైలైట్ గా ఉండబోతోందా? అంటూ టాలీవుడ్ కోలీవుడ్ లో గుసగుస మొదలైంది. అప్పట్లో కోలీవుడ్‌లో పెను సంచలనం సృష్టించిన ఈ గొడవ గురించి సోనా ఏవిధంగా తెరపై చూపించబోతోందో అనే చర్చ సాగుతోంది.
2011లో ఒక సినిమా సక్సెస్ పార్టీలో జరిగిన ఈ ఘటన అప్పట్లో మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఒక పబ్లిక్ ఈవెంట్‌లో సదరు గాయకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించారని.. తనను వేధించారని సోనా హైడెన్ బహిరంగంగా ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మొదలైంది.
ఈ ఘటనపై సోనా హైడెన్ తీవ్రంగా స్పందిస్తూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అతడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని.. ఆ సమయంలో ఆయన మద్యం మత్తులో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. తన ఆత్మగౌరవానికి భంగం కలిగిందని.. తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం కారణంగా అప్పట్లో సదరు గాయకుడి ప్రతిష్టకు తీవ్రమైన భంగం వాటిల్లింది. చిత్ర పరిశ్రమలోని పెద్దలు కూడా ఈ విషయంలో తలదూర్చాల్సి వచ్చింది.
అయితే ఈ కేసు పోలీసుల వరకు వెళ్లినా కానీ.. కొన్ని రోజుల తర్వాత అనూహ్యంగా సద్దుమణిగింది. సినీ పెద్దలు .. కామన్ స్నేహితుల సమక్షంలో జరిగిన చర్చల అనంతరం సోనా తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. అతడు తనకు క్షమాపణలు చెప్పారని.. అందుకే తాను కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన తండ్రి, దివంగత గాయకుడిపై ఉన్న గౌరవంతోనే సోనా ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని నిర్ణయించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
వివాదాల కారణంగా కెరీర్ ఖతమ్:
చాలా కాలం తర్వాత మళ్ళీ సోనా తన ఇంటర్వ్యూలలో తన కెరీర్ దెబ్బతినడానికి ఇలాంటి వివాదాలే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో తనకు సరైన మద్దతు లభించలేదని.. ఒంటరిగా పోరాడాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం తన జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న `స్మోక్` వెబ్ సిరీస్‌లో ఇలాంటి కొన్ని సంచలన నిజాలను చూపే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
సోనా తెలుగులో ఆంధ్రావాలా (ఎన్టీఆర్) చిత్రంలో నటించారు. తమిళంలో తళా అజిత్ సినిమాతో తెరంగేట్రం చేసారు. ఈ భామ పలు వివాదాల కారణంగా ఎప్పుడూ మీడియా హెడ్ లైన్స్ లో నిలిచారు. నటి సోనా హైడెన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ముఖ్యంగా తమిళ స్టార్ కమెడియన్ వడివేలు ప్రవర్తన కారణంగా తాను కెరీర్‌లో భారీగా నష్టపోయానని సోనా ఆవేదన వ్యక్తం చేశారు. వడివేలు కారణంగా 16 అవకాశాలు వదులుకున్నానని సోనా బహిరంగంగా వెల్లడించారు.