ఎదురు చూపులు: 15 ఏళ్లుగా ఆది.. 20 ఏళ్లుగా నందు!

గ్లామ‌ర్ రంగంలో స‌క్సెస్ లేక‌పోతే ఎదుర‌య్యే అవ‌మానాలు అన్నీ ఇన్నీ కావు. ప‌రిశ్ర‌మ చిన్న చూపు చూస్తుంది. చుట్టూ జ‌నం త‌క్కువ చేసి మాట్లాడ‌తారు.;

Update: 2025-12-30 19:29 GMT

గ్లామ‌ర్ రంగంలో స‌క్సెస్ లేక‌పోతే ఎదుర‌య్యే అవ‌మానాలు అన్నీ ఇన్నీ కావు. ప‌రిశ్ర‌మ చిన్న చూపు చూస్తుంది. చుట్టూ జ‌నం త‌క్కువ చేసి మాట్లాడ‌తారు. చేత‌కాలేదంటారు.. విష‌యం లేదు కాబ‌ట్టి ఎద‌గ‌లేక‌పోయాడ‌ని దెప్పి పొడుస్తారు. కాకుల్లా పొడుచుకు తింటారు.

అలాంటి అవ‌మానాలెన్నో దిగ‌మింగుకున్న త‌ర్వాతే చాలా మంది పెద్ద స్టార్లు అయ్యారు. ఇటీవ‌ల ఆది సాయికుమార్ న‌టించిన `శంబాల` రిలీజై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవ‌డంతో అత‌డి కుటుంబంలో ఎంతో ఆనందం చూసాం. ముఖ్యంగా డైలాగ్ కింగ్ సాయికుమార్ వార‌సుడు ఆది హిట్టు కొట్టాడు! అంటూ ప‌రిశ్ర‌మ సెల‌బ్రేట్ చేసుకుంది. ఇండ‌స్ట్రీలో పెద్ద హీరోలతో పాటు చిన్న హీరోలు, ఇత‌ర ప్ర‌ముఖులు కూడా ఆది సాయికుమార్ మంచి సినిమాలో న‌టించాడు! అంటూ ప్ర‌శంసించారు. ఇదే విష‌యాన్ని వేదిక‌పై చెబుతూ సాయికుమార్ ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యారు. అంతేకాదు ఆదికి స‌రైన స‌క్సెస్ లేక అత‌డి భార్య అరుణ ఎంత‌గా ఆవేద‌న చెందారో కూడా సాయికుమార్ ఒక్క మాట‌లో చెప్పారు. అరుణ‌ను వేదిక‌పైకి పిలుస్తూ, ఈ ఒక్క స‌క్సెస్ కోసం ఎంత‌గానో ఎదురు చూసావు! అంటూ సాయికుమార్ ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యారు. ఇక సాయికుమార్ సోద‌రులు అయ్య‌ప్ప శ‌ర్మ‌, ర‌విశంక‌ర్ సైతం ఎంతో ఎమోష‌న‌ల్ గా మాట్లాడారు. అన్న కొడుకు ఇంత పెద్ద విజ‌యం అందుకోవ‌డంతో వారంతా ఒకే వేదిక‌పైకి వ‌చ్చారు. ఫ్యామిలీ ఫ్యామిలీ స‌క్సెస్ మీట్ లో ఎమోష‌న‌ల్ అయిన తీరు హృద‌యాల‌ను తాకింది.

`ప్రేమ‌కావాలి` సినిమాతో దాదాపు 15ఏళ్ల క్రితం హీరో అయ్యాడు ఆది సాయికుమార్. కెరీర్ లో ఓ ఇర‌వై సినిమాలు చేసి ఉంటే అందులో నాలుగైదు హిట్లు కూడా లేవు. చాలా ఫ్లాపులొచ్చాయి. అయినా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాడు. కుటుంబంలో అంద‌రూ స్టార్లు కావ‌డంతో ఆదికి కావాల్సినంత అండ‌దండ‌లు ఇచ్చారు. ఎట్ట‌కేల‌కు శంబాల‌తో హిట్టు కొట్టాడు ఆది. అత‌డు ఇన్నాళ్లు ఎదురైన ఎన్నో అవ‌మానాల‌ను దిగ‌మింగుకుని ఇప్పుడు ఈ విజ‌యాన్ని అందుకున్నాడు. అందుకే వేదిక‌పై ఆది సాయికుమార్ ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యాడు.

ఇక ఇదే స‌మ‌యంలో మ‌రో యువ‌హీరో నందు గురించి గుర్తు చేసుకోవాలి. ప్ర‌ముఖ గాయ‌ని గీతా మాధురి భ‌ర్త నందు. అత‌డు ఒక చిన్న న‌టుడిగా మొద‌లై, హీరో అయ్యాక‌, ఎదిగేందుకు చాలా ప్ర‌య‌త్నించాడు. కొన్నేళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అర‌కొర విజ‌య‌లు త‌ప్ప పెద్ద‌ హిట్టు రాలేదు. చూస్తుండ‌గానే 20 సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయ‌ని త‌న‌ను ఎవ‌రో గేలి చేసార‌ని త‌లుచుకుని వేదిక‌పైనే ఏడ్చేసాడు నందు. నందు న‌టించిన `సైక్ సిద్ధార్థ‌` జ‌న‌వ‌రి 1న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సినిమా కంటెంట్ న‌చ్చి డి.సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాత‌, పంపిణీదారు అండ‌గా నిలిచి రిలీజ్ చేస్తుండ‌డంతో టీమ్‌లో ఉత్సాహం నెల‌కొంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌చార వేదిక‌పై నందు చాలా సేపు ఎమోష‌న్‌ని, ఉబికి వ‌స్తున్న క‌న్నీళ్ల‌ను ఆపుకోలేక‌పోయాడు. కొన్ని సంవ‌త్స‌రాల పాటు స‌రైన స‌క్సెస్ లేక‌పోతే, దానిని త‌ట్టుకుని నిల‌బ‌డాలంటే సామాన్యుడి వ‌ల్ల కానే కాదు. కానీ నందు లాంటి చిన్న హీరో కూడా అన్నిటినీ త‌ట్టుకుని నిల‌బ‌డ్డాడు. భార్య తిట్లు కూడా భ‌రించాన‌ని అంగీక‌రించే ప‌రిస్థితి ఉందంటే అర్థం చేసుకోవాలి.

`యానిమ‌ల్` సినిమాలో అబ్రార్ పాత్ర‌తో ప్రాణం లేచొచ్చింది బాబి డియోల్‌కి.. అలాంటి గొప్ప అవ‌కాశం ఇచ్చిన దేవుడు సందీప్ వంగా. ఈ స‌క్సెస్ త‌ర్వాత అత‌డు ఎంత బిజీ అయ్యాడో చూస్తూనే ఉన్నాం. భార్య తిండి పెడుతుంటే అది తిని బ‌తికేస్తున్నావ‌ని అంద‌రూ గేలి చేసార‌ని, అవ‌మాన‌క‌రంగా మాట్లాడార‌ని కూడా బాబి డియోల్ గుర్తు చేసుకున్నాడు. త‌న ఇంట్లో పిల్ల‌లు కూడా నాన్న ప‌నికి వెళ్ల‌డా? అని ప్ర‌శ్నిస్తే చ‌చ్చిపోయిన‌ట్టు అయింద‌ని బాబి ఎమోష‌న‌ల్ అయ్యాడు. ఇక బాబి డియోల్ అన్న‌గారైన స‌న్నీడియోల్ కూడా గ‌ద‌ర్ 2 తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాక‌ గ్రేట్ కంబ్యాక్ అయ్యాడు. అత‌డు స‌క్సెస్ వేదిక‌ల‌పై ఆల్మోస్ట్ క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. డియోల్ బ్ర‌ద‌ర్స్ క‌న్నీళ్లు, ఎమోష‌న్స్ ని కొన్ని వారాల పాటు మీడియా స‌మావేశాల‌లో ప్ర‌జ‌లు చూసారు. స‌క్సెస్ లేక‌పోతే, ఆర్టిస్టు క‌ష్టం, బాధ ఎలా ఉంటాయో వీళ్లంతా లైవ్ ఎగ్జాంపుల్. కానీ ఎంత క‌ష్టం ఉన్నా, ఒక్క స‌క్సెస్ అన్నిటినీ తుడిచేస్తుంది. ఇప్పుడు ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నారు.

Tags:    

Similar News