నెట్ ఫ్లిక్స్ లో శివాజీ మూవీ.. ట్విస్టా?
సీనియర్ నటుడు శివాజీ లీడ్ రోల్ లో రూపొందిన సాంప్రదాయిని సుద్దపూసని సినిమా చుట్టూ ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.;
సీనియర్ నటుడు శివాజీ లీడ్ రోల్ లో రూపొందిన సాంప్రదాయిని సుద్దపూసని సినిమా చుట్టూ ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆ చిత్రాన్ని మొదటగా ఈటీవీ విన్ కోసం ప్రత్యేకంగా నిర్మించినట్లు సమాచారం. నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేశారట. కానీ సినిమాపై నమ్మకం పెరగడంతో థియేటర్లలో విడుదల చేస్తే మంచి ఫలితం వస్తుందని భావించి రిలీజ్ చేశారని వినికిడి.
అయితే అనుకున్నట్టుగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల నుంచి ఆశించిన రెస్పాన్స్ రాకపోవడంతో ఫ్లాప్ గా మిగిలింది. దీంతో మళ్లీ ఆ సినిమా ఓటీటీ దిశగా వెళ్లడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు సిద్ధమవుతున్నట్లు తాజాగా అనౌన్స్మెంట్ వచ్చింది.
దీంతో ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈటీవీ విన్ ఇప్పటికే ఆ సినిమాను ఫండ్ చేసినప్పటికీ, ఎందుకు నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతోంది? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఈటీవీ విన్ నుంచి పూర్తి చెల్లింపులు జరగలేదని, అందుకే సినిమా నెట్ ఫ్లిక్స్ కు వెళ్లిందని ప్రచారం జరుగుతోంది. ఆ డీల్ ద్వారా మరింత ఆదాయం పొందేందుకు నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
అయితే మరో యాంగిల్ లో చూస్తే అది సింపుల్ విషయం కాదని తెలుస్తోంది. ఈటీవీ విన్ కు నెట్ ఫ్లిక్స్ తో బ్యాక్ ఎండ్ ఒప్పందం ఉందని ఇండస్ట్రీలో ఇప్పటికే చర్చ ఉంది. ఆ ఒప్పందం ప్రకారం కొన్ని మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ చేసే అవకాశం ఉంటుంది. గతంలో విడుదలైన #90s సిరీస్ కూడా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. అందువల్ల సాంప్రదాయిని సుద్దపూసని కూడా ప్లాన్ లో భాగంగా నెట్ ఫ్లిక్స్ కు వెళ్లి ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది.
అంటే ఇది చీటింగ్ కాదని, ముందు ఉన్న ఒప్పందం ప్రకారం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం కావచ్చని అంటున్నారు. ఇక ప్రేక్షకుల యాంగిల్ లో చూస్తే, థియేటర్లలో ఫెయిలైన సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే చాలాసార్లు థియేటర్లలో ఆడని సినిమాలు ఓటీటీలో మంచి స్పందన పొందిన సందర్భాలు ఉన్నాయి. కంటెంట్ బాగుంటే ప్లాట్ ఫామ్ మారినా ప్రేక్షకులు ఆదరిస్తారని గత అనుభవాలు చెబుతున్నాయి.
మొత్తానికి శివాజీ సినిమా నెట్ ఫ్లిక్స్ కు వెళ్లడం వెనుక నిజంగా ఆర్థిక సమస్యలున్నాయా? లేక ముందు ఉన్న డిజిటల్ వ్యూహంలో భాగమా? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంపై శివాజీ లేదా ఈటీవీ విన్ నుంచి అధికారికంగా స్పందన వస్తేనే పూర్తి నిజం బయటపడే అవకాశం ఉంది. అప్పటివరకు ఇది ట్విస్టా? లేక చీటింగా? అన్న చర్చ కొనసాగుతూనే ఉంటుంది.