ఇలాంటి కండీషన్స్‌ మరే సినిమాకు పెట్టలేదు..!

సింగిల్‌ స్క్రీన్‌లో అన్ని షోలను వేయాల్సిందే అని, పరిమిత షోలు మాత్రమే వేయకూడదని పేర్కొన్నారు.;

Update: 2025-06-18 08:30 GMT
ఇలాంటి కండీషన్స్‌ మరే సినిమాకు పెట్టలేదు..!

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఫిల్మ్‌ మేకింగ్‌ మారుతూ వచ్చింది, అలాగే స్క్రీనింగ్‌ విషయంలోనూ చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు కేవలం సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు మాత్రమే ఉండేవి. రెండు దశాబ్దాల ముందు వరకు మల్టీప్లెక్స్ లు చాలా చాలా తక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు చిన్న చిన్న మున్సిపాలిటీల్లో కూడా మల్టీప్లెక్స్‌లు వెలిశాయి. మల్టీప్లెక్స్‌ల్లో ఒక సినిమాను ఒకటి లేదా రెండు షోలు మాత్రమే వేస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలు అయితే ఎక్కువ షో లు పడుతున్నాయి. కానీ చిన్న హీరోల షోలు మాత్రం రోజులో ఒకటి లేదా రెండు షో లు మాత్రమే వేయడం వల్ల నిర్మాతలు నష్టపోతున్నారు అనే విమర్శలు ఉన్నాయి.

మల్టీప్లెక్స్‌ల్లో అమలు అవుతున్న విధానం ఈ మధ్య కాలంలో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లలో కూడా అమలు అవుతుంది. కొన్ని సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు చిన్న హీరోల సినిమాలను తీసుకుని రోజులో రెండు లేదా మూడు షో లు మాత్రమే వేస్తున్నాయి. అంటే మరో షో కి జనాలు వస్తారా అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. అలా కూడా నిర్మాతకు నష్టం కలుగుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా థియేటర్ల వారు, మల్టీప్లెక్స్‌ల మార్కెట్‌ నేపథ్యంలో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమీర్‌ ఖాన్‌ నటించిన సితారే జమీన్‌ పర్‌ సినిమా మేకర్స్ ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు. ముందస్తుగానే థియేటర్ల యాజమాన్యంతో, మల్టీప్లెక్స్ ల యాజమాన్యాలతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

సింగిల్‌ స్క్రీన్‌లో అన్ని షోలను వేయాల్సిందే అని, పరిమిత షోలు మాత్రమే వేయకూడదని పేర్కొన్నారు. ఈ కఠినమైన నిర్ణయాన్ని పాటించాల్సిందే అని, అలా పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక మల్టీప్లెక్స్‌ల్లో 2 స్క్రీన్‌లు ఉంటే రోజులో 8 షో లు, 3 స్క్రీన్‌లు ఉంటే రోజులో 11 షో లు, 4 స్క్రీన్‌ లు ఉంటే రోజులో 14 షో లు, 5 స్క్రీన్‌లు ఉంటే రోజులో 16 షోలు, 6 స్క్రీన్‌లు ఉంటే రోజులో 19 షోలు, 7 స్క్రీన్స్‌ ఉంటే రోజులో 22 షోలు, 8 స్క్రీన్‌లు ఉంటే రోజులో 25 షోలు, 9 స్క్రీన్‌లు ఉంటే రోజులో 28 షోలు, 10 స్క్రీన్‌లు, అంతకు మించి ఉంటే రోజులో 31 షోలు కచ్చితంగా తమ సినిమాను ప్రదర్శించాల్సిందే అని ఒప్పందం చేసుకున్నారు. ఇలా మరే సినిమాకు కండిషన్ పెట్టలేదని టాక్.

ఈ ఒప్పందం మీరితే సినిమా ప్రదర్శన హక్కులను ఆ థియేటర్‌కు లేదా మల్టీప్లెక్స్‌కు ఇవ్వమని, ముందు ముందు కూడా తమ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే సినిమాలను ఆయా థియేటర్లకు, మల్టీప్లెక్స్‌లకు ఇవ్వబోమని నిర్మాతలు హెచ్చరించారు. ఆమీర్‌ ఖాన్ సినిమాలు గత దశాబ్ద కాలంగా బాక్సాఫీస్‌ వద్ద తీవ్రంగా నిరాశ పరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంటుందో అనేది అనుమానంగానే ఉంది. ఒక ఆర్ట్‌ ఫిల్మ్‌గా ఇది ఉంటుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కమర్షియల్‌ యాంగిల్‌ ఉందని మేకర్స్ చెబుతున్నారు. మొత్తానికి సినిమా విడుదలకు ముందు డౌటే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్ల వారితో, మల్టీప్లెక్స్‌ వారితో ఇలా కండీషన్స్ పెట్టడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News