అప్పట్లో పుష్పకవిమానం.. ఇప్పుడిది
94 ఏళ్ల వయసులో జీవించి ఉండడం.. రోజు వారీ కార్యకలాపాలు చేసుకోవడమే గొప్ప.;
94 ఏళ్ల వయసులో జీవించి ఉండడం.. రోజు వారీ కార్యకలాపాలు చేసుకోవడమే గొప్ప. అలాంటిది ఈ వయసులో ఒక సినిమాకు దర్శకత్వం వహించడం అంటే సామాన్యమైన విషయమా? లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ అద్భుతమే చేస్తున్నారు. బహుశా ఇండియాలో ఈ వయసులో మెయిన్ స్ట్రీమ్ మూవీ తీస్తున్న తొలి దర్శకుడు ఈయనే కావచ్చు.
పుష్పక విమానం, విచిత్ర సోదరులు, ఆదిత్య 369, భైరవద్వీపం.. ఇలా ఎన్నో అద్భుతమైన ప్రయోాగాత్మక చిత్రాలతో ముందు తరం ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచిన ఈ సెల్యులాయిడ్ సైంటిస్ట్.. సినిమా తీయడం అసాధ్యం అనిపించే వయసులోనూ ఒక ప్రాజెక్టును నెత్తికెత్తుకున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రయత్నానికి యువ దర్శకుడు నాగ్ అశ్విన్, సీనియర్ నిర్మాత అశ్వినీదత్ అండగా నిలుస్తున్నారు. సింగీతం దర్శకత్వం వహిస్తున్న 61వ చిత్రమిది.
ఈ రోజే ఈ మూవీ టైటిల్, టీజర్ లాంచ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి ‘సింగ్ గీతం’ అంటూ సింగీతం పేరు కలిసొచ్చే టైటిల్ పెట్టినట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా కాన్సెప్ట్ గురించి కూడా ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ వయసులోనూ తనదైన శైలిలో మరో ప్రయోగమే చేస్తున్నారట సింగీతం. ఒకప్పడు మాటలు లేకుండా తీసిన ‘పుష్పకవిమానం’ తరహా ప్రయోగమేనట ఈ చిత్రం కూడా. ఐతే ఇందులో మాటలు ఉండవు కానీ.. పాటలు ఉంటాయట. ఇందులో పాత్రలేవీ మాట్లాడుకోవు. కానీ తమ భావాలను పాటల రూపంలో వ్యక్తం చేస్తాయి. పాటలతో కథను చెప్పడమే ఈసారి సింగీతం చేస్తున్న ప్రయోగం. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక మ్యూజికల్ ఫిలిం అన్నమాట.
మరి ఈ రూపంలో కథను సింగీతం ఎలా కథను చెబుతారన్నది ఆసక్తికరం. ఇది ఎన్నో ఏళ్ల ముందు అనుకున్న కథ అని.. చివరికి నాగ్ అశ్విన్ ఈ కథకు మద్దతుగా నిలిచాడని సింగీతం ఇంతకుముందే చెప్పారు. తాను ‘కల్కి’ లాంటి మెగా మూవీ చేయడానికి కూడా సింగీతం స్ఫూర్తి అని చెప్పే నాగ్ అశ్విన్.. ఆయన సినీ రంగానికి చేసిన సేవకు బదులుగా చూపిస్తున్న కృతజ్ఞతలా ఈ సినిమా అనిపిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. సంగీతానికి అంత ప్రాధాన్యం ఉందంటే దేవిశ్రీ కూడా ఈ చిత్రాన్ని ఎంతో ప్రత్యేకంగా భావించి గొప్ప ఔట్ పుట్ ఇస్తాడని ఆశించవచ్చు.