సినిమా ఆలోచన నాదే.. కానీ క్రెడిట్ అంతా నాగ్ అశ్విన్‌దే!
నిజానికి నాగ్ అశ్విన్‌కు సింగీతం శ్రీనివాసరావు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉందన్న విషయం ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు.
దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాస రావు జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ రూపొందిన సింగ్ గీతం సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతున్న వేళ, ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న అసలు శక్తి ఎవరు అనే ప్రశ్నకు స్వయంగా సింగీతం శ్రీనివాసరావే సమాధానం ఇచ్చారు. సినిమా ఆలోచన మొదటి నుంచి తనదేనని చెప్పిన ఆయన, ఆ ఆలోచనను తెరపైకి తీసుకురావడంలో పూర్తి బాధ్యతను డైరెక్టర్ నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ భుజాన వేసుకున్నారని వెల్లడించారు. అంతేకాదు, ఈ సినిమా విజయానికి లేదా రూపకల్పనకు సంబంధించిన క్రెడిట్ మొత్తం నాగ్ అశ్విన్‌కే చెందుతుందని ఆయన స్పష్టంగా పేర్కొనడం విశేషం.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన సింగీతం శ్రీనివాసరావు ఎమోషన్ తో చేసిన కామెంట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. సింగ్ గీతం సినిమా ఆలోచన మొదటి నుంచి తనదేనని, కానీ ఈ సినిమాకు సంబంధించిన మొత్తం బాధ్యత నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ తీసుకున్నారని, నాగ్ అశ్విన్ సినిమా కంటే తనను ఎక్కువగా ప్రేమించే వ్యక్తి అని చెప్పారు. ఎంతో గౌరవంతో, ఎంతో అభిమానంతో తనతో నాగి ఈ సినిమాను చేయించారని, ఈ సినిమా మొత్తం నాగ్ అశ్విన్ క్రెడిటే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నాగ్ అశ్విన్‌పై ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబించాయి.
నిజానికి నాగ్ అశ్విన్‌కు సింగీతం శ్రీనివాసరావు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉందన్న విషయం ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. తన సినీ ప్రయాణంలో సింగీతం ప్రభావం ఎంత ఉందో నాగ్ అశ్విన్ గతంలో కూడా పలుమార్లు చెప్పుకొచ్చారు. అయితే ఆ అభిమానం కేవలం మాటల్లోనే కాదు, ఆయన ప్రవర్తనలో కూడా కనిపిస్తుందని తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మరోసారి నిరూపించింది. వేదికపై సింగీతం ప్రసంగిస్తున్న సమయంలో ఆయనకు ఏమైనా అవసరమేమో అన్న ఆలోచనతో నాగ్ అశ్విన్ స్టేజ్‌పైకి వెళ్లి మంచి నీళ్లు తాగమని సూచించడం అక్కడున్న వారందరి దృష్టిని ఆకర్షించింది. అది పెద్ద సంఘటన కాకపోయినా, ఒక గురువు పట్ల ఆయనకు ఉన్న గౌరవం, ప్రేమ, శ్రద్ధను స్పష్టంగా చూపించింది.
సినిమా నిర్మాణంలో ఆర్థిక బాధ్యతలు తీసుకోవడం ఒక విషయం అయితే, ఒక వ్యక్తి వారసత్వాన్ని కాపాడుతూ ఆయన కథను సరైన రీతిలో ప్రపంచానికి అందించడం మరో విషయం. సింగ్ గీతం విషయంలో నాగ్ అశ్విన్ ఈ రెండు బాధ్యతలను సమానంగా నిర్వహించినట్లు కనిపిస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడినప్పుడు సింగీతం శ్రీనివాసరావు తన గురించి కాకుండా నాగ్ అశ్విన్ గురించి ఎక్కువగా మాట్లాడటం విశేషం. సింగీతం లాంటి ఒక లెజెండ్ స్వయంగా ఈ సినిమా మొత్తం నాగ్ అశ్విన్ క్రెడిటే అని చెప్పడం చిన్న విషయం కాదు. సింగ్ గీతం తెరపై కనిపించేది సింగీతం కథ అయినా, ఆ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ప్రధాన శక్తిగా నాగ్ అశ్విన్ పేరు నిలిచిపోతుందనే అభిప్రాయం ఇప్పుడు సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.