పాపులర్ గాయకుడి హత్య వెనక కఠోర నిజం
ఇక సిద్ధూ మూసేవాలా చేసిన అతి పెద్ద తప్పిదం.. అతడు ఓవైపు లారెన్స్ గ్యాంగ్ తో స్నేహంగా ఉంటూనే, లారెన్స్ కి ప్రత్యర్థులు అయిన బింబిహా గ్యాంగ్ తోను సన్నిహితంగా ఉండటం.;
అనుమానం పెనుభూతం.. అనుమానం రావణ కాష్ఠం. స్నేహితులు, హితులు అనే తేడా దీనికి లేదు. అనుమానం పెనుభూతమై కుటుంబాల్లో కల్లోలం నింపుతుంది. స్నేహితుల మధ్య మంటలు పుట్టిస్తుంది. అలాంటి ఒక మంట ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా ముగింపు కథలో ఉందా? అంటే అవుననే బిబీసీ డాక్యు సిరీస్ చెబుతోంది.
ఈ కథ పూర్వాపరాల్లోకి వెళితే.. రెండేళ్ల క్రితం ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా దారుణ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ హత్యకు లారెన్స్ బిష్ణోయ్- గోల్డీ బ్రార్ గ్యాంగ్ బాధ్యత వహించింది. అయితే సిద్ధూ మూసేవాలా హత్యకు కారణమేమిటో ఇప్పటికీ మాకు అంతు చిక్కడం లేదని భావించే వారికి దాని వెనక అసలు కథలు ఏమిటన్నది బీబీసీ లోతుగా అధ్యయనం చేసి డాక్యు సిరీస్ ని రూపొందించింది.
ఇక సిద్ధూ మూసేవాలా చేసిన అతి పెద్ద తప్పిదం.. అతడు ఓవైపు లారెన్స్ గ్యాంగ్ తో స్నేహంగా ఉంటూనే, లారెన్స్ కి ప్రత్యర్థులు అయిన బింబిహా గ్యాంగ్ తోను సన్నిహితంగా ఉండటం. పైగా లారెన్స్, గోల్డీ బ్రార్ గురువుగా భావించే విక్కీ మిద్ధుఖేరా హత్యకు ప్లాన్ చేసిన గూండా షగన్ ప్రీత్ సింగ్‌తో సిద్ధూ సన్నిహితంగా ఉండటం కూడా తనను ప్రమాదంలో పడేసింది. తాము అత్యంత ఆరాధించే అభిమానించే గురువుగా చూసే వ్యక్తి మరణం వెనక సిద్ధూ మూసేవాలా కూడా ఒకడు అని భావించిన లారెన్స్ గ్యాంగ్ అతడిని తుదముట్టించారు.
''పోలీసులు షగన్ ప్రీత్ తో పాటు సిద్ధూ మూసేవాలా పేరును కూడా హత్యలో భాగస్తుడు!'' అని ఛార్జ్ షీట్ లో పేర్కొనడంతో ఇక లారెన్స్ గ్యాంగ్ వెనుదిరిగి చూడలేదు. తమకు సన్నిహితుడే అయినా కానీ సిద్ధూ ప్రత్యర్థి గ్యాంగ్ తో కలిసి తమకు అత్యంత ప్రీతిపాత్రుడు, కావాల్సిన వ్యక్తిని హత్య చేసాడని భావించడంతో ఇక ఆగలేదు. సిద్ధూను చంపేందుకు తుపాకీ గుళ్లు వర్షించాయి. లారెన్స్ గ్యాంగ్ దానికి ఎంత మాత్రం కలత చెందలేదు. అతడి హత్యకు తామే బాధ్యత వహిస్తున్నామని ప్రకటించింది. సిద్ధూ చావుకు కారణమేంటో పోలీసులు, జర్నలిస్టులు సహా ప్రజలందరికీ తెలుసు అంటూ గోల్డీ బ్రార్ వాయిస్ లను కూడా బీబీసీ స్టోరీలో వేసారు. మొత్తానికి పంజాబీ ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా దారుణ హత్యోదంతం వెనక కారణమేంటో ఈ డాక్యు సిరీస్ చూడటంతో క్లారిటీ వచ్చినట్టయింది. ఇంతకీ ఈ డ్యాక్యు సిరీస్ టైటిల్ ఏంటో తెలుసా? ''ది కిల్లింగ్ కాల్''. టైటిల్ కి తగ్గట్టే హత్య చుట్టూ జరిగిన స్టోరీని ఆధారాలతో బీబీసీ టీమ్ అద్భుతంగా చిత్రీకరించింది.