సిద్ధుకు పెద్ద ముప్పే పొంచి ఉంది!

దీంతో తర్వాతి చిత్రంతో మళ్లీ తనేంటో రుజువు చేసుకోవాల్సిన స్థితిలో పడ్డాడు. స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా మారి రూపొందిస్తున్న ‘తెలుసు కదా’ మీద అతను భారీ ఆశలతో ఉన్నాడు.;

Update: 2025-06-02 17:30 GMT

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో బంపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. ‘టిల్లు స్క్వేర్’ ఏకంగా రూ.130 కోట్ల వసూళ్లు సాధించడంతో తన స్థాయే మారిపోయింది. మిడ్ రేంజ్ స్టార్‌గా అవతరించాడు. కానీ తన తర్వాతి చిత్రం ‘జాక్’ డిజాస్టర్ కావడంతో ఎంతో ఎత్తు నుంచి దబేల్‌మని కింద పడ్డట్లయింది. తన ఇమేజ్‌కు ఏమాత్రం సెట్ కాని సినిమా చేసి చేదు అనుభవం ఎదుర్కొన్నాడు సిద్ధు.

దీంతో తర్వాతి చిత్రంతో మళ్లీ తనేంటో రుజువు చేసుకోవాల్సిన స్థితిలో పడ్డాడు. స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా మారి రూపొందిస్తున్న ‘తెలుసు కదా’ మీద అతను భారీ ఆశలతో ఉన్నాడు. ఈ రోజే ఒక ఇంట్రెస్టింగ్ ప్రోమో ద్వారా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఆ ప్రోమో చూస్తే సినిమా కూడా సరదాగానే సాగబోతోందనే సంకేతాలు కనిపించాయి. దీపావళి పండక్కి లాంగ్ వీకెండ్ కలిసొచ్చేలా అక్టోబరు 17న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి నిర్ణయించారు.

టాలీవుడ్ కోణంలో చూస్తే దీపావళి అంత కలిసొచ్చే సీజన్ కాదు. దసరా కోసం ఎగబడ్డట్లు దీపావళి వీకెండ్ కోసం మన నిర్మాతలు ఎగబడరు. అమావాస్య టైం కాబట్టి దాన్ని మన వాళ్లు నెగెటివ్‌‌గా చూస్తారు. కానీ తమిళ ఫిలిం ఇండస్ట్రీకి మాత్రం దీపావళి చాలా స్పెషల్. ఆ టైంలో పెద్ద పెద్ద సినిమాలు రిలీజవుతుంటాయి. అవి తెలుగు ప్రేక్షకులనూ పలకరిస్తాయి. ఈసారి దీపావళికి తమిళంలో క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. ‘సర్దార్-2’ గురించి. కార్తికి తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. పైగా ‘సర్దార్’ లాంటి హిట్ మూవీకి సీక్వెల్ కావడంతో దీనికి ఇక్కడా మంచి బజ్‌యే ఉంది.

మరోవైపు ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్ కొత్త చిత్రం ‘ఎల్‌ఐకే’ కూడా దీపావళికే రాబోతోంది. సూర్య కొత్త చిత్రాన్ని కూడా దీపావళికే అనుకున్నారు కానీ.. తమ్ముడు సినిమా వస్తే అన్న చిత్రం రాకపోవచ్చు. ఏది వచ్చినా తెలుగులో హైప్ బాగానే ఉంటుంది. సిద్ధు సినిమాకు గట్టి పోటీ తప్పదు. దీనికి తోడు ‘ఎల్ఐకే’తోనూ ముప్పు పొంచి ఉంది. గత ఏడాది దీపావళికి ‘అమరన్’ ఎలా వసూళ్ల మోత మోగించిందో గుర్తుండే ఉంటుంది. కాబట్టి సిద్ధు సినిమాకు తమిళ చిత్రాలతో పోటీ అంత తేలికేం కాదు.

Tags:    

Similar News