60 దేశాలు తిరిగాను.. నా దేశ‌మే బెస్ట్.. కొంద‌రి త‌ప్పుడు ప‌నుల‌ వ‌ల్ల సిగ్గుప‌డాలా? హీరో సిద్ధార్థ్ ఎమోష‌న‌ల్!

విలక్షణ నటన- స్పష్టమైన భావజాలంతో నిత్యం వార్తల్లో నిలిచే నటుడు సిద్ధార్థ్ భారతదేశంపైనా, దేశభక్తిపైనా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Update: 2026-09-10 16:05 GMT

విలక్షణ నటన- స్పష్టమైన భావజాలంతో నిత్యం వార్తల్లో నిలిచే నటుడు సిద్ధార్థ్ భారతదేశంపైనా, దేశభక్తిపైనా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'ఆపరేషన్ సేఫ్డ్ సాగర్' వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక అంతర్జాతీయ ఇంటర్వ్యూలో అత‌డు మాట్లాడుతూ.. మన దేశ గొప్పతనాన్ని.. పౌరులకు ఉండాల్సిన అసలైన దేశభక్తి భావనను ఎంతో భావోద్వేగంగా ఆవిష్కరించారు.

తన సుదీర్ఘ సినీ - వ్యక్తిగత ప్రయాణంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60కి పైగా దేశాలను సందర్శించానని సిద్ధార్థ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. నేను దాదాపు 60 దేశాలు తిరిగి చూశాను.. కానీ భారతదేశం లాంటి గొప్ప దేశం ప్రపంచంలోనే మరెక్కడా లేదు. భారత్ ప్రపంచంలోనే అత్యంత గొప్ప దేశం! అని ఆయన ఎంతో గర్వంగా ప్రకటించారు. ప్రపంచంలో ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలను చూసినా.. మన దేశ సంస్కృతి, అనుబంధాలు .. ఇక్కడి వైవిధ్యమైన ఆతిథ్యం ఏ దేశంలోనూ లభించదని ఆయన స్పష్టం చేశారు.

దేశంలో ఉన్న లోపాలు, రాజకీయనాయకులపై వస్తున్న విమర్శల గురించి మాట్లాడుతూ ఒక విప్లవాత్మకమైన కోణాన్ని సిద్ధార్థ్ మాట్లాడారు. ''మన దేశంలో చెడు వ్యక్తులు ఉండవచ్చు... చెడు ప్రభుత్వాలు లేదా చెడు రాజకీయ నాయకులు ఉండవచ్చు.. అంతేకాకుండా కొన్ని అవాంఛనీయమైన సంఘటనలు కూడా జరగవచ్చు. అంతమాత్రాన నా దేశం చెడ్డది అయిపోదు. ఎక్కడో ఉన్న కొందరు చెడు వ్యక్తులు చేసే పనుల వల్ల నేను నా దేశాన్ని చూసి ఎందుకు సిగ్గుపడాలి?'' అని సిధ్ ప్రశ్నించారు.

ప్రభుత్వాలు- రాజకీయాలతో క‌లప‌కుండా దేశాన్ని వేరుగా చూడాలని.. తప్పు చేసే అధికారులను లేదా నాయకులను నిలదీసి బాధ్యులను చేయాలే తప్ప.. ఆ తప్పుల కారణంగా మాతృభూమి ఆత్మను తక్కువ చేసి చూడకూడదని సిద్ధార్థ్ అభిప్రాయపడ్డారు. నాయకులు లేదా తాత్కాలిక రాజకీయ పరిణామాలు ఎంత మారినా.. దేశం -దేశభక్తి అనేది అందరికంటే చాలా పెద్దదని తెలిపారు. నిజమైన పౌరుడిగా దేశాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించడం.. దాని అసలైన ఉనికికి మద్దతుగా నిలవడమే అసలైన దేశభక్తి అని పేర్కొన్నారు.

సిద్ధార్థ్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు, సినీ ప్రియులు, దేశభక్తులు విపరీతంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. దేశంలోని వ్యవస్థలను విమ‌ర్శించిన వారికి.. దేశభక్తికి - ప్రభుత్వ విమర్శలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎంతో చక్కగా వివరించారంటూ ఆయన మాటలను రీ-షేర్ చేస్తున్నారు. `ఆపరేషన్ సేఫ్డ్ సాగర్` ప్రమోషన్ల సందర్భంలో సిద్ధార్థ్ చూపించిన ఈ జాతీయ భావన.. భారతదేశం ప్రాముఖ్యతను.. అంతర్జాతీయంగా దానికున్న ప్రతిష్టను మరోసారి ఎలుగెత్తి చాటింది. `ఆప‌రేష‌న్ సేఫ్డ్ సాగ‌ర్` చిత్రంలో సిద్ధార్థ్ న‌ట‌న‌కు గొప్ప ప్ర‌శంసలు ద‌క్కిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News