సిద్ధార్థ్‌కు కార్గిల్ హీరో భార్య నుంచి స్పెషల్ రివ్యూ!
ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ సమయంలో సిరీస్ ఇంకా చూడలేదు అని చెప్పిన అల్కా అహూజా ఇటీవల సిరీస్ పూర్తిగా చూసిన తర్వాత నేరుగా సిద్ధార్థ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు.
ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై విశేష ఆదరణ పొందుతున్న వార్ డ్రామా వెబ్ సిరీస్ `ఆపరేషన్ సేఫ్ద్ సాగర్`.1999 కార్గిల్ యుద్ధంలో భారత వైమానిక దళం ప్రదర్శించిన సాహసాల నేపథ్యంలో తెరకెక్కిన సిరీస్‌లో స్క్వాడ్రన్ లీడర్ అమరవీరుడు అజయ్ అహూజా పాత్రలో నటుడు సిద్ధార్థ్ జీవించి ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే ఈ సిరీస్ విడుదలయ్యాక సిద్ధార్థ్‌కు ఎంతోమంది నుంచి ప్రశంసలు వచ్చినా? ఆయన హృదయానికి అత్యంత దగ్గరైన రివ్యూ మాత్రం అజయ్ అహూజా భార్య అల్కా అహూజా నుంచి లభించడం విశేషం.
ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ సమయంలో సిరీస్ ఇంకా చూడలేదు అని చెప్పిన అల్కా అహూజా ఇటీవల సిరీస్ పూర్తిగా చూసిన తర్వాత నేరుగా సిద్ధార్థ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఆ సంభాషణలో ఆమె సిద్ధార్థ్, అజయ్ సరిగ్గా నీలాగే ఉండేవాడు అని చెప్పిన మాటలు తన కెరీర్‌లోనే లభించిన అత్యుత్తమ రివ్యూగా భావిస్తున్నానని సిద్ధార్థ్ ఎంతో భావోద్వేగంతో వెల్లడించారు. తెరపై తన భర్త రూపాన్ని, వ్యక్తిత్వాన్ని సరిగ్గా ఆవిష్కరించారని సిద్ధార్థ్‌ను మనసారా అభినందించారు.
అజయ్ అహూజా వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకుంటూ అల్కా.. `ఆయన చాలా సరదాగా, జోవియల్‌గా ఉండేవాడు. కానీ విధి నిర్వహణకు వచ్చేసరికి ఎంతో సీరియస్‌గా, ఫోకస్డ్‌గా పనిచేసేవాడు. నువ్వు కూడా అలాగే అనిపించావు` అని సిద్ధార్థ్‌తో అన్నారట. నిజమైన వీరుడి జీవితాన్ని, ఆయనలోని మానవీయ కోణాన్ని ప్రేక్షకులకు సరిగ్గా చూపించాలనే బాధ్యతను తాను విజయవంతంగా నెరవేర్చాననే సంతృప్తి ఈ మాటలతో లభించిందని సిద్ధార్థ్ తెలిపారు.
సిరీస్ నిర్మాణ సమయంలో అల్కా అహూజాతో ఏర్పడిన అనుబంధం గురించి సిద్దార్డ్ స్పందించారు. `అజయ్ అహూజా భౌతికంగా దూరమై 27 ఏళ్లు గడుస్తున్నా? అల్కా ఇప్పటికీ ఆయన జ్ఞాపకాలతోనే జీవిస్తున్నారు. వారిది కేవలం గతానికి సంబంధించిన ప్రేమ కథ కాదని ఇప్పటికీ సజీవంగా ఉన్న అమర ప్రేమకథ అని సిద్దార్ద్ కొనియాడారు. ఆల్కాను వీర్ నారి గా చూడటం, ఆమెతో సమయం గడపడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా సిద్ధార్థ్ అభివర్ణించారు.
నెట్‌ఫ్లిక్స్‌లో ఓనీ సేన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌లో సిద్ధార్థ్‌తో పాటు జిమ్మీ షేర్ గిల్ కూడా కీలక పాత్రలో నటించారు. 18 వేల అడుగుల ఎత్తులో ఐఏఎఫ్ పైలట్లు చేసిన సాహసోపేతమైన పోరాటం, అజయ్ అహూజా త్యాగం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆకాశంలో భారత వైమానిక దళం సాధించిన విజయాన్ని ఈ సిరీస్ చాటి చెబుతోంది. మొత్తానికి వీర జవాను భార్య నుంచి లభించిన ప్రశంస సిద్ధార్థ్ నటనా ప్రయాణంలో ప్రత్యేకంగా నిలిచిపోయింది. దేశం కోసం ప్రాణాలర్పించిన అజయ్ అహూజా జ్ఞాపకాలను ఆవిష్కరించిన `ఆపరేషన్ సేఫ్ద్ సాగర్` ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.