ఔత్సాహిక ఫిలింమేకర్స్ చూడాల్సిన బయోపిక్
భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో దిగ్గజ ఫిలింమేకర్ గా, రచయితగా పాపులరైన ప్రముఖుడు వి.శాంతారామ్ బయోపిక్ లో నటించే అవకాశం అతడిని వరించింది.;
గల్లీబోయ్, గెహ్రయాన్ లాంటి చిత్రాల్లో అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు సిద్ధాంత్ చతుర్వేది. గల్లీబోయ్ చిత్రంలో రణ్ వీర్ సింగ్ లాంటి ఎనర్జిటిక్ హీరోతో పోటీపడుతూ సిద్ధాంత్ ఒక ర్యాపర్‌గా మెరుపులు మెరిపించాడు. జోయా అక్తర్ తెరకెక్కించిన ఈ పోయెటిక్ డ్రామా చిత్రంలో సిద్ధాంత్ అత్యంత ఆకర్షణీయమైన నటుడిగా కనిపించాడు.
ఆల్ రౌండర్ గా సుప్రసిద్ధుడు:
ఇటీవల కరణ్ జోహార్ నిర్మించిన `ధడక్ 2`లో నటించి మరోసారి అద్భుత ప్రదర్శనతో మెప్పించాడు.
ఇప్పుడు అతడి నట ప్రతిభ ఆధారంగా అతడిని వెతుక్కుంటూ ఓ బయోపిక్ ఆఫర్ వచ్చింది. భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో దిగ్గజ ఫిలింమేకర్ గా, రచయితగా పాపులరైన ప్రముఖుడు వి.శాంతారామ్ బయోపిక్ లో నటించే అవకాశం అతడిని వరించింది. ఈ బయోపిక్ కి `చిత్రపతి వి శాంతారామ్` అని టైటిల్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే సిద్ధాంత్ తన పనిని ప్రారంభించాడు. ఇది అతడి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రంగా రికార్డులకెక్కనుంది.
ట్రెండ్ సెట్టర్ ఆయన:
వి.శాంతారామ్ గొప్ప ప్రయోగశీలి. వెండితెరపై మహిళా నటీమణిని ఎంపిక చేసుకున్న మొదటి తరం ఫిలింమేకర్ గా ఆయన పేరు మార్మోగింది. అలాగే సినిమా సంగీతం హక్కులను విక్రయించాలని ప్రయత్నించిన మొదటి ఫిలింమేకర్ గాను ఆయన రికార్డులకెక్కారు. అతడు ఉత్తరాది ప్రాంతం కొల్హాపూర్‌లో కడు పేదరికంలో జన్మించాడు. పూణేలోని బాబూరావు (పెయింటర్) వద్ద ఫిలింమేకింగ్ నేర్చుకున్నారు. జనకార్ జనకార్ పాల్ బాజజ్ (1955), దో ఆంఖేన్ బరా హాత్ (1957) వంటి బాలీవుడ్ చిత్రాలలోను తనదైన ముద్ర వేసారు. శాంతారామ్ తెరకెక్కించిన చాలా సినిమాలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శితమయ్యాయి. పాప్ రారాజు చార్లీ చాప్లిన్ సైతం అతడిని ప్రశంసించాడని కొన్ని టాబ్లాయిడ్లు ప్రచురించాయి. అలాగే నేటితరం ఔత్సాహిక ఫిలింమేకర్స్ నేర్చుకోవడానికి అతడు ఒక గ్రంధం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రముఖులతో వైరం:
ఇక బొంబాయిలోని ప్రముఖులతో అతడికి వైరం ఉన్న విషయం కొద్దిమందికి మాత్రమే తెలుసు. మొత్తానికి ఆయన జీవితం అంతా ఎమోషన్స్ తో ముడిపడినది. ప్రతిరోజూ జీవనగమనంలో పోరాటాలు చేసిన యోధుడిగాను శాంతారామ్ గురించి చెబుతారు. ఇప్పుడు ఇలాంటి జీవితకథలో సిద్ధాంత్ నటించే అవకాశం దక్కించుకున్నాడు.