ఆత్మహత్య అని కేస్ క్లోజ్ చేసినా స్టార్ హీరోని హత్య చేసారని నమ్ముతోంది!
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇక లేకపోయినా.. తన దైనందిన జీవితంలో అతడి ఉనికిని ఎల్లప్పుడూ అనుభవిస్తూనే ఉంటానని శ్వేత తెలిపారు.
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకస్మిక మరణం కేవలం ఆత్మహత్య అని పోలీస్ వర్గాలు, ప్రత్యేక సిట్ బృందాలు డిక్లేర్ చేసాయి. ఆరేళ్లు గడుస్తున్నా ఆ విషాదాన్ని అతడి కుటుంబ సభ్యులు, అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీసులు ఈ కేసును ఆత్మహత్యగా భావించి ముగించినా.. సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ రాజ్‌పుత్ మాత్రం అది ముమ్మాటికీ `హత్యే`నని బలంగా నమ్ముతున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో సంభవించిన ఈ ఘోర ఉదంతం.. ఆ కుటుంబాన్ని తీవ్ర కల్లోలంలోకి నెట్టివేసింది. నేటికీ యువహీరో మరణం చుట్టూ ఉన్న అనేక ప్రశ్నలు అభిమానుల మదిలో మెదులుతూనే ఉన్నాయి.
ఇటీవల `సూపర్ టాక్స్ బై దిమూవింగ్ షిప్` అనే పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న శ్వేతా సింగ్ రాజ్‌పుత్.. తన సోదరుడితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సుశాంత్ మరణ వార్త తెలిసిన సమయంలో తాను కాలిఫోర్నియాలో ఉన్నానని.. ఆ వార్త వినగానే తన శరీరం మొద్దుబారిపోయిందని తెలిపారు. కరోనా నిబంధనలు, ప్రయాణ ఆంక్షల కారణంగా తాను వెంటనే భారత్‌కు రాలేకపోయానని...చివరికి తన తమ్ముడికి ఆఖరి వీడ్కోలు కూడా చెప్పలేకపోయానని ఆ రాత్రంతా కన్నీరుమున్నీరయ్యానని శ్వేత ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం సుశాంత్ అస్థికల నిమజ్జనం కోసం పాట్నా వెళ్లినప్పటి అనుభవాలను శ్వేత షేర్ చేసారు. తాను బస చేసిన గదిలోనే అస్థికలను ఉంచారని.. ఆ సమయంలో ధ్యానం - కలల స్థితిలో తమ్ముడి ఉనికిని స్పష్టంగా అనుభవించినట్లు చెప్పారు. రాత్రి వేళల్లో సుశాంత్ తన కలలోకి వచ్చి గంటల తరబడి మాట్లాడేవాడని.. తన మనసులోని సందేహాలన్నింటికీ సమాధానాలు ఇచ్చేవాడని వెల్లడించారు. అతడు వచ్చి తనను కౌగిలించుకుని.. బుగ్గపై ముద్దు పెట్టుకునేవాడని.. అతడి శ్వాసను కూడా తాను ప్రత్యక్షంగా అనుభవించానని శ్వేత పేర్కొన్నారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇక లేకపోయినా.. తన దైనందిన జీవితంలో అతడి ఉనికిని ఎల్లప్పుడూ అనుభవిస్తూనే ఉంటానని శ్వేత తెలిపారు. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా సోదరుడి పాత జ్ఞాపకాలను, ఫోటోలను షేర్ చేస్తూ అక్కాచెల్లెళ్ల బంధానికి ఉన్న నిజమైన అర్థాన్ని చాటుతున్నారు. సోదరుడు లేడనే చేదు నిజం ఒకవైపు వేధిస్తున్నా... కలలోనైనా అతడితో మాట్లాడటం తనకు కాస్త ఊరటనిస్తుందని భావోద్వేగంగా వెల్లడించారు.
ఇదే ఇంటర్వ్యూలో శ్వేత మరొక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సుశాంత్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన `ఎం.ఎస్. ధోనీ - ది అన్‌టోల్డ్ స్టోరీ` చిత్రం ఘనవిజయం సాధించి.. అతడికి సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే సుశాంత్ దురదృష్టవశాత్తూ మరణించిన తర్వాత క్రికెటర్ ఎం.ఎస్. ధోనీ తమ కుటుంబాన్ని పరామర్శించడానికి లేదా సంప్రదించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని శ్వేతా సింగ్ ఈ పాడ్‌కాస్ట్‌లో స్పష్టం చేశారు. మరణించిన ఆరేళ్ల తర్వాత ఇప్పటికీ ఇది హత్యేనని వాదిస్తున్న శ్వేతాసింగ్ ఆవేదనను వినేవాళ్లు ఎవరు? అనేదే పెద్ద ప్రశ్న.