'సలార్ 2' సీక్వెల్‌పై క్లారిటీ.. మళ్లీ ప్ర‌భాస్-నీల్ ర‌ణ‌రంగం!

ప్రస్తుతం ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో `డ్రాగన్` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Update: 2026-08-14 03:47 GMT

రెబల్ స్టార్ ప్రభాస్, సంచ‌ల‌న దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన `సలార్: పార్ట్ 1 - సీజ్‌ఫైర్` ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఈ మూవీ సీక్వెల్ `సలార్: పార్ట్ 2 – శౌర్యాంగ పర్వం` ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్ట్ వాయిదా పడిందని లేదా ఆగిపోయిందంటూ వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ మేకర్స్ సలార్-2 ప్రీ-ప్రొడక్షన్ పనులను అధికారికంగా స్టార్ట్ చేసారు.

గతంలో సలార్ సీక్వెల్ రద్దయిందంటూ సోషల్ మీడియాలో ర‌క‌రకాల రూమర్లు చక్కర్లు కొట్టాయి. అయితే హోంబలే ఫిల్మ్స్ సంస్థ జనవరిలోనే ప్రభాస్- శ్రుతి హాసన్ క‌లిసి ఉన్న‌ సెట్స్ లోని ఫోటోను షేర్ చేస్తూ ఆ వార్తలను ఖండించింది. తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్- నిర్మాత విజయ్ కిరగందూర్ ప్రత్యేకంగా సమావేశమై.. సీక్వెల్ నిర్మాణ షెడ్యూల్స్- తుది స్క్రిప్ట్‌పై చర్చలు జరిపారు. ఈ ప్రాజెక్ట్‌ను మొదటి భాగం కంటే అత్యంత భారీ స్థాయిలో ఒక అద్భుతమైన సినిమాటిక్ వండర్‌గా తెరకెక్కించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో `డ్రాగన్` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇటీవల ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స జరగడంతో ఆయన తిరిగి షూటింగ్ సెట్స్‌లో అడుగుపెట్టడానికి రెండు నుండి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ... ప్రశాంత్ నీల్ `డ్రాగన్`'లో హీరో లేని సన్నివేశాలను చిత్రీకరిస్తూనే... మరోవైపు `సలార్-2` ప్రీ-ప్రొడక్షన్- స్క్రిప్ట్ వర్క్ పై పూర్తి దృష్టి సారించినట్లు సమాచారం.

మొదటి భాగం చివర్లో దేవా (ప్రభాస్) ఖాన్సార్ రాజ్యాధిపత్యానికి అసలైన వారసుడని... ఆయన శౌర్యాంగ తెగకు చెందినవాడని సంచలన నిజం వెల్లడైన సంగతి తెలిసిందే. బాల్య మిత్రులైన దేవా... వరదరాజ మన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) మధ్య ఏర్పడే విభేదాలు... శౌర్యాంగ తెగ ఉనికి కోసం జరిగే సుదీర్ఘ పోరాటమే `శౌర్యాంగ పర్వం` కథాంశం. ఈ సీక్వెల్‌లో ఖాన్సార్ రాజ్యంలో అధికారం కోసం సాగే రక్తపాతం.. నమ్మకద్రోహం... బంధాల మధ్య నడిచే ఉత్కంఠభరిత నాటకాన్ని మరింత తీవ్రమైన యాక్షన్ సీక్వెన్స్‌లతో చూపించనున్నారు.

మొదటి భాగంలో అలరించిన ప్రథమ శ్రేణి నటీనటులు ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు, శ్రీయా రెడ్డి ఈ సీక్వెల్‌లో కూడా తమ పాత్రలను పునరావృతం చేయనున్నారు. నిర్మాత విజయ్ కిరగందూర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ చిత్రం సాంకేతిక ప్రమాణాల పరంగా... మేకింగ్ పరంగా సరికొత్త అధ్యాయాన్ని సృష్టించబోతోంది. ప్రస్తుతానికి అధికారిక విడుదల తేదీని ప్రకటించకపోయినా ప్రశాంత్ నీల్ పక్కా ప్రణాళికతో `సలార్-2`ను త్వరలోనే పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.

Tags:    

Similar News