శ్రేయోఘాష‌ల్ స్పెష‌ల్ రూల్ ఇప్ప‌టికీ ఆచ‌ర‌ణ‌లోనే!

చాలా సందర్భాల్లో వచ్చిన కొన్ని పాటల్లోని సాహిత్యం సమస్యాత్మకంగా, పురుషాధిక్య ధోరణిని.. మహిళలను తక్కువ చేసి చూపేలా ఉండ‌టంతో కొన్ని అవ‌కాశాలు వ‌దులుకున్నాన‌న్నారు.

Update: 2026-09-06 04:30 GMT

సంగీత ప్రపంచంలో మధురమైన గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న గాయని శ్రేయా ఘోషాల్. తాజాగా శ్రేయ పాటల ఎంపిక -సాహిత్యంపై చేసిన వ్యాఖ్యలు సంగీత వర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. అర్థరహితమైన.. అసభ్యకరమైన పదాలు .. లింగవివక్షను ప్రోత్సహించే ధోరణి ఉన్న పాటల ఆఫర్లు వచ్చినప్పుడు నిర్మోహమాటంగా తిరస్కరించానని వెల్లడించారు. చాలా సందర్భాల్లో వచ్చిన కొన్ని పాటల్లోని సాహిత్యం సమస్యాత్మకంగా, పురుషాధిక్య ధోరణిని.. మహిళలను తక్కువ చేసి చూపేలా ఉండ‌టంతో కొన్ని అవ‌కాశాలు వ‌దులుకున్నాన‌న్నారు.

శ్రోతలకు మంచి సంగీతాన్ని అందించడమే కాదు. వారి మనస్సులపై ప్రతికూల ప్రభావం చూపని సాహిత్యాన్ని ఎంచుకోవడం ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఆ కార‌ణంగానే హిట్ అవుతాయని తెలిసినా? భావజాలపరంగా సరిపడని పాటలకు దూరంగా ఉన్నానన్నారు. ఈ రకమైన పాటలను తిరస్కరించడం కెరీర్ ఆరంభం నుంచి పాటిస్తున్న సూత్రమని శ్రేయా స్పష్టం చేశారు. `పాట హిట్ అవ్వడం ఒక్కటే ముఖ్యం కాదు. ఆ పాట ద్వారా సమాజంలోకి ఎలాంటి సందేశం వెళ్తుందనేది ముఖ్య‌మేన‌ని పేర్కొన్నారు.

ఈ విష‌యంలో నిర్మాతలు ..సంగీత దర్శకులు ఎంత ఒత్తిడి చేసినా? మనస్సాక్షికి నచ్చని అసభ్యకరమైన పదబంధాలు ఉన్న పాటలను పాడటానికి ఎప్పుడూ అంగీకరించలేదన్నారు. సంగీత రంగంలో ప్రయోగాలు, వైవిధ్యం అవసరమే అయినా? పాటల్లో ఉపయోగించే భాష , భావాలు బాధ్యతా యుతంగా ఉండాలని శ్రేయ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మహిళా గాయకులు, నటీమణులు పాత్రలు లేదా పాటల ద్వారా ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

కళ అనేది సమాజ ప్రతిబింబం. దానిని గౌరవప్రదంగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. రెండు దశాబ్దాలకు పైగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సహా అనేక భాషల్లో వేలాది సూపర్ హిట్ పాటలను ఆలపించిన శ్రేయా ఘోషాల్ క్రమశిక్షణ , నాణ్యమైన పాటల ఎంపికతోనే ఇన్నేళ్లుగా అగ్ర గాయనిగా కొన సాగుతున్నారు. ఎలాంటి వివాదాల‌కు వెళ్ల‌కుండా తన గాత్రం .. సంగీత ప్రతిభతో మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారన్న‌ది కాద‌న‌లేని నిజం.

సాహిత్యంలో నాణ్యత తగ్గిపోతోందనే విమర్శలు వస్తున్న కాలంలో శ్రేయా ఘోషాల్ వంటి దిగ్గజ గాయని ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విశేషం. కళాకారులు ప్రాచుర్యం కోసమే కాకుండా నైతిక విలువలకు పెద్దపీట వేయాలని సందేశమిచ్చారు. శ్రేయా ఘోషాల్ తీసుకున్న నిర్ణయం ఇతర గాయకులకు ..యువ కళాకారులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని సంగీత ప్రియులు కొనియాడుతున్నారు.

Tags:    

Similar News