ఆ రెండు పదాలు తప్పు.. ఇంటెన్షన్ మంచిదే: క్షమాపణలు చెప్పిన శివాజీ!
అయితే ఆ ఫ్లోలో రెండు అన్ పార్లమెంటరీ పదాలు వాడటం జరిగిందని శివాజీ అంగీకరించారు.;
'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సీనియర్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద దుమారం రేపాయో అందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో విమర్శలు, ప్రముఖ సినీ మహిళల లేఖల తర్వాత శివాజీ ఎట్టకేలకు దీనిపై స్పందించారు. ఈ వివాదంపై క్లారిటీ ఇస్తూ, జరిగిన దానికి వివరణ ఇస్తూ ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. అందులో ఆయన ఏమన్నారనే వివరాల్లోకి వెళితే..
నిన్న సాయంత్రం జరిగిన ఈవెంట్ లో తాను మాట్లాడిన సందర్భాన్ని శివాజీ గుర్తుచేసుకున్నారు. ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ బయటకి వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్న సంఘటనలు చూసి, నాలుగు మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతోనే అలా మాట్లాడానని అన్నారు. బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమోనమ్మ అనే ఉద్దేశం తప్ప, ఎవరినీ అవమానించాలనే ఉద్దేశం తనకు లేదని క్లారిటీ ఇచ్చారు.
అయితే ఆ ఫ్లోలో రెండు అన్ పార్లమెంటరీ పదాలు వాడటం జరిగిందని శివాజీ అంగీకరించారు. మంచి చెప్పాలనే ప్రయత్నంలో ఒక ఊరి భాష మాట్లాడానని, అది చాలా తప్పని ఆయన ఒప్పుకున్నారు. ఆ పదాల వల్ల ఎవరికైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే డెఫినెట్ గా తన సిన్సియర్ అపాలజీస్ తెలియజేస్తున్నట్లు వీడియోలో పేర్కొన్నారు.
తనకు స్త్రీ అంటే ఎప్పుడూ ఒక మహాశక్తి, ఒక అమ్మవారు అనే భావనే ఉంటుందని శివాజీ చెప్పుకొచ్చారు. ఇవాళ సమాజంలో స్త్రీని అందరూ ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నామని, అందుకే మనమే ఆ అవకాశం ఇవ్వకూడదు అని చెప్పే ఇంటెన్షన్ లో ఆ మాటలు వచ్చాయే తప్ప, ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.
తన ఇంటెన్షన్ మంచిదే కానీ, ఆ రెండు పదాలు దొర్లకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం హీరోయిన్స్ ని మాత్రమే కాకుండా, బయట తిరిగే అమ్మాయిలకు కూడా రక్షణగా ఉండాలనే ఉద్దేశంతోనే చెప్పానని అన్నారు. అవమానపరచాలనే ఆలోచన తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని తెలిపారు. ఫైనల్ గా ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే వాళ్ళందరికీ తన క్షమాపణలు అంటూ శివాజీ వీడియోను ముగించారు. ఇది కేవలం మంచి చెప్పాలనే ప్రయత్నంలో జరిగిన పొరపాటని ఆయన క్లారిటీ ఇచ్చారు.