డ్రగ్స్ దొరక్కపోయినా నటుడు పారిపోవడానికి కారణం?
తాజాగా విన్సీ అలోసియస్ అనే నటి సెట్లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, ఆ సమయంలో డ్రగ్స మత్తులో ఉన్నాడని మలయాళ సినీపరిశ్రమ కీలక శాఖలన్నిటికీ ఫిర్యాదులు చేసింది.;
వరుసగా తెలుగు చిత్రాల్లో నటిస్తూ వైవిధ్యం ఉన్న నటుడిగా మెప్పించాడు షైన్ టామ్ చాకో. దేవర, డాకు మహారాజ్, రాబిన్ హుడ్ లాంటి చిత్రాల్లో తనదైన విలక్షణ నటనతో మెప్పించిన ఈ నటుడికి మంచి భవిష్యత్ ఉందన్న ప్రశంసలు కురిసాయి. కానీ అతడు ఇటీవల ఎక్కువగా వివాదాల్లో నలుగుతున్నాడు. 2018లో అతడి పేరు డ్రగ్స్ తో ముడి పెట్టి కథనాలొచ్చాయి. కానీ అది నిరూపణ కాలేదు. ఆ తర్వాత కూడా పలు వివాదాల్లో అతడి పేరు వినిపించింది. సెట్లో డ్రగ్స్ సేవిస్తున్నాడని, డ్రగ్స్ మత్తులో తప్పుగా ప్రవర్తిస్తున్నాడని కూడా కొన్ని ఫిర్యాదులు అందాయి.
తాజాగా విన్సీ అలోసియస్ అనే నటి సెట్లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, ఆ సమయంలో డ్రగ్స మత్తులో ఉన్నాడని మలయాళ సినీపరిశ్రమ కీలక శాఖలన్నిటికీ ఫిర్యాదులు చేసింది. దీనిపై ప్రస్తుతం అంతర్గతంగా దర్యాప్తు సాగుతోంది. టామ్ షైన్ చాకోపై పోలీసులకు ఫిర్యాదు చేసే ఆలోచన లేదని కూడా విన్సీ చెప్పినా పోలీసులు, నార్కోటిక్స్ బ్యూరో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
అతడిపై నటి ఆరోపించిన సమయంలో కొచ్చిలోని ఓ హోటల్ రూమ్‌లో బస చేసి ఉన్నాడు. అక్కడ అతడిని పట్టుకునేందుకు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు వలపన్నారు. కానీ టామ్ కి ఈ విషయం ముందే తెలియడంతో రూమ్ లోని కిటికీ గుండా బయటకు దూకి తప్పించున్నాడు. అయితే హోటల్ నుంచి పారిపోతున్న వీడియోలు సీసీటీవీలో రికార్డ్ కావడంతో పోలీసులకు సిసలైన ఆధారం లభించింది. ఈ ఆధారంతో అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
తాజాగా అతడికి పోలీసులు నోటీసులు పంపేందుకు సిద్ధంగా ఉన్నారని మీడియాలో కథనాలొస్తున్నాయి. అలాగే నార్కోటిక్స్ అధికారుల రైడ్స్ సమయంలో టామ్ ఎందుకు పారిపోయాడు? అనేది ప్రశ్నించనున్నట్టు తెలిసింది. నిజానికి హోటల్ రూమ్ లో ఎలాంటి డ్రగ్స్ కనుగొనలేదు. కానీ అతడు సడెన్ గా పారిపోడం వెనక కారణమేమిటో తెలియని కన్ఫ్యూజన్ నెలకొంది. టామ్ సెట్లో హైపర్ యాక్టివ్ గా ఉంటాడు. అది కొందరిని గతంలో ఇబ్బంది పెట్టింది. వేదికలపైనా అతడి ప్రవర్తన అలానే ఉంటుంది. ఇవన్నీ రూపం మార్చుకుని ఇప్పుడు అతడి మెడకు చుట్టుకుంటున్నాయి.