60 కోట్ల మోసం కేసు: శిల్పాశెట్టి-కుంద్రాకు కోర్టులో చుక్కెదురు
తమపై విధించిన లుకౌట్ నోటీస్‌ని ఎత్తివేయాలని శిల్పాశెట్టి - రాజ్ కుంద్రా జంట కోర్టులో పోరాడుతున్న సంగతి తెలిసిందే.;
తమపై విధించిన లుకౌట్ నోటీస్‌ని ఎత్తివేయాలని శిల్పాశెట్టి - రాజ్ కుంద్రా జంట కోర్టులో పోరాడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లుకౌట్ ని ఎత్తివేయాలంటే 60కోట్లు చెల్లించాలని, లేదా బ్యాంకు నిరంతర పర్యవేక్షణలోని పూచీకత్తు ఇవ్వాలని అలా చేయలేని పక్షంలో లుకౌట్‌ని ఎత్తివేయలేమని కోర్టు పేర్కొంది.
లుకౌట్ సర్క్యులర్ ఎత్తివేయడానికి శిల్పా శెట్టి - రాజ్ కుంద్రా దంపతులు రూ. 60 కోట్లు డిపాజిట్ చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. అయితే లుకౌట్ ని ఎత్తివేయడానికి కోర్టుకు రాజ్ కుంద్రా చెబుతున్న కారణం ఏమిటి? అంటే...అనారోగ్యంతో ఉన్న తండ్రిని సంరక్షించుకోవడానికి ఈ జంట లండన్ వెళ్లాలని కోరుతున్నారు. వృద్ధ తండ్రికి తమ అవసరం ఉంది. అతడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని కోర్టులో వాదిస్తున్నారు.
తన తండ్రికి దీర్ఘకాలికమైన, వివరించలేని ఐరన్-అమ్మోనియా లోపం ఉన్నట్లు నిర్ధారణ అయిందని, దీని ఫలితంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తాయని కుంద్రా తెలిపారు. రక్త నష్టం , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అతనికి రిపీట్ క్యాప్సూల్ ఎండోస్కోపీ లేదా డబుల్-బెలూన్ ఎంటరోస్కోపీ చేయించుకోవాలని సూచించినట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని శిల్పా-కుంద్రా జంట 20 జనవరి 2026 కంటే ముందు ప్రయాణించడానికి కోర్టు అనుమతి కోరింది. 60కోట్ల మోసం కేవలం సివిల్ కేసు మాత్రమే క్రిమినల్ కేసు కాదని కుంద్రా తరపు సీనియర్ న్యాయవాది అబాద్ పోండా వాదిస్తున్నారు. డిపాజిట్ మొత్తాన్ని సవరించాలని కూడా ఆయన కోర్టులో వాదిస్తున్నారు.
అయితే కోర్టు తాజా తీర్పు ప్రకారం... కుంద్రా 60 కోట్లు చెల్లించాక మాత్రమే లుకౌట్ సర్క్యులర్ ని ఎత్తివేయాల్సి ఉంటుందని పేర్కొంది. నిజానికి తమ కంపెనీ నుంచి తప్పుడు విధానంలో డబ్బును దారి మరల్చలేదు. సహజ ప్రక్రియలోనే టీవీ వ్యాపారం నష్టపోయిందని కూడా కుంద్రా తరపు న్యాయవాది వాదించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీనిని కోర్టు నమ్మడం లేదు. 2015 నుండి 2023 వరకు తమ కంపెనీ అయిన బెస్ట్ డీల్ టీవీ ప్రై.లిమిటెడ్‌లో రూ.60 కోట్లు పెట్టుబడి పెట్టమని తనను ప్రేరేపించారని, కానీ ఆ మొత్తాన్ని శిల్పాశెట్టి-కుంద్రా తమ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించారని ఆరోపిస్తూ దీపక్ కొఠారి అనే వ్యాపార భాగస్వామి ఆరోపించారు. ఆ తర్వాత ఈ సెలబ్రిటీ జంటపై ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. ప్రస్తుతం కోర్టుల పరిధిలో విచారణ కొనసాగుతోంది. శెట్టి-కుంద్రా దంపతుల అభ్యర్థనను కోర్టు నిర్ధ్వంద్వంగా తిరస్కరించింది. ఈ కేసు కొనసాగుతోంది.. తుది తీర్పు ఇంకా రాలేదు. అయితే శిల్పాశెట్టి- కుంద్రా దంపతులపై దీపక్ కొఠారి ఆరోపణలు నిజమని కూడా ఇంకా నిరూపణ కాలేదు.