స్టార్ కపుల్‌కి లుకౌట్ నోటీస్.. నో ఫారిన్ ట్రిప్!
గడిచిన కొన్నేళ్లుగా బాలీవుడ్ ప్రముఖ జంట శిల్పాశెట్టి- రాజ్ కుంద్రా నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.;
గడిచిన కొన్నేళ్లుగా బాలీవుడ్ ప్రముఖ జంట శిల్పాశెట్టి- రాజ్ కుంద్రా నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు నీలి చిత్రాల యాప్ ల కేసులో రాజ్ కుంద్రా అరెస్టయి, తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. ఆ తర్వాత శిల్పాశెట్టి-కుంద్రా దంపతులు 60 కోట్ల మేర ఒక ప్రముఖ వ్యాపారిని మోసం చేసారని కూడా ఫిర్యాదులు అందాయి.
గతం ఇప్పటికీ కుంద్రా దంపతులను విడిచిపెట్టడం లేదు. ఇప్పుడు చీటింగ్ కేసు మరింత ఉచ్చు బిగుస్తోంది. తాజాగా అందిన సమాచారం మేరకు... రూ.60 కోట్ల చీటింగ్ కేసులో శిల్పా శెట్టి -రాజ్ కుంద్రాపై లుకౌట్ నోటీసు జారీ అయ్యాయని ఇండియా టుడే తన కథనంలో పేర్కొంది. ఈ కేసు 2015 నాటిది. ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి ప్రారంభించిన బెస్ట్ డీల్ టీవీ చానెల్ అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టాల్సిందిగా తనను ప్రేరేపించారని, దానికోసం 60.48 కోట్లు పెట్టుబడి పెట్టానని దీపక్ కొఠారి అనే వ్యాపారి ఆరోపించారు.
తన నుంచి నిధులను దండుకుని తర్వాత తిరిగి ఇవ్వలేదని సదరు వ్యాపారవేత్త లబోదిబోమన్నాడు. 2015 నుంచి ఈ కేసు కోర్టులో నడుస్తోంది. 2016లో శిల్పాశెట్టి డైరెక్టర్ పదవికి రాజీనామా చేసి, 2017లో దివాలాను ప్రకటించారు. ఈ కేసులో ఇప్పటివరకూ దీపక్ కొఠారికి తిరిగి డబ్బు చెల్లించలేదు. బెస్ట్ డీల్ టీవీ కేసు రన్ అవుతుండగానే, 2025 ఆరంభం మరొక పెట్టుబడిదారుడిని బంగారం పథకంలో పెట్టుబడి పేరుతో మోసం చేసినట్టు కూడా కథనాలొచ్చాయి. ఇలాంటి ఆర్థిక నేరాల కారణంగా శిల్పాశెట్టి- రాజ్ కుంద్రా దంపతులకు లుకౌట్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఈ జంట ఇకపై దేశం విడిచి వెళ్లాలంటే కండీషన్స్ అప్లయ్ కానున్నాయి.