ఇదేనా అంత పెద్ద స్టార్ ప్రవర్తించే తీరు? నిలదీసిన నటి!
అతడు దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న ప్రముఖ కథానాయకుడు. కానీ అతడి ప్రవర్తన ఒక్కోసారి విచిత్రంగా ఉంటుంది.;
అతడు దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న ప్రముఖ కథానాయకుడు. కానీ అతడి ప్రవర్తన ఒక్కోసారి విచిత్రంగా ఉంటుంది. ఆశ్చర్యం కలిగిస్తుంది. సెట్లో ఊహించని ఏదైనా సంఘటనకు అతడు స్పందించే తీరు తీవ్రంగా ఉంటుంది. ఆ సమయంలో అతడు రుసరుసలాడుతాడు. సెట్లో లైట్ మేన్ లేదా ఇంకెవరైనా కార్మికుడిపైనా విరుచుకుపడతాడు. చివరికి ఒకసారి సెట్ నుంచి అతడి కార్ వేగంగా దూసుకెళ్లింది. అతడు పూర్తిగా ఆ రోజు షూటింగ్ మొత్తం వదిలేసి వెళ్లిపోయాడు. అతడి ప్రవర్తనకు సెట్లో వారంతా నిర్ఘాంతపోయారు. అది అక్కడితో ముగియలేదు. అతడిని బుజ్జగించేందుకు చాలా ప్రయత్నాలు సాగాయి. ముందుగా దర్శక నిర్మాతలు చాలా కూల్ గా అతడిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.
కోపంలో ఉన్నప్పుడు చాలాసార్లు చూసాను:
అసలే భారీ సెట్లు నిర్మించి, వందలాది ఆర్టిస్టులతో షూటింగ్ జరుగుతుంటే సదరు హీరోగారు అలిగి అలా వెళ్లిపోవడంతో అందరూ ఖంగు తిన్నారు. ఎలాగైనా పరిస్థితిని సద్ధుమణిగేలా చేయాలనుకున్నారు. కానీ ఆ హీరో ససేమిరా అంటూ భీష్మించుకు కూచున్నాడు. పరిస్థితిని అదుపు చేయడానికి చాలా సమయం పట్టింది. అయితే ఇలాంటి సన్నివేశాలెన్నో తాను చూసానని, సల్మాన్ ని కోపంగా ఉన్నప్పుడు చూసానని చెబుతోంది ప్రముఖ క్యారెక్టర్ నటి షీబా చద్దా. ప్రస్తుతం నితీష్ తివారీ - రణబీర్ కపూర్ లతో రామాయణం చిత్రంలో నటిస్తున్న షీబా గతంలో భన్సాలీ తెరకెక్కించిన డెబ్యూ సినిమా `హమ్ దిల్ దే చుకే సనమ్`లో నటించింది. ఇందులో సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించాడు. సినిమా పెద్ద హిట్టయింది. క్లాసిక్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
భన్సాలీ కోపిష్ఠి అని అనుకుంటారు..
నిజానికి ఒక సినిమా సెట్లో సల్మాన్ అలా కోపంగా ప్రవర్తించాడు. కోపంగా ఉన్న సమయంలో స్టార్స్ ఇలాగే ప్రవర్తిస్తారా? అని ఆశ్చర్యపరిచిందని షీబా చద్దా గుర్తుచేసుకుంది. సిద్ధార్థ్ కన్నన్‌తో తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్థావించినట్టు హిందూస్తాన్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. నిజానికి భన్సాలీ కోపిష్ఠి అని ప్రచారం ఉంది. కానీ తాను అతడిని ఎప్పుడూ సెట్లో కోపంగా ఉండటం చూడలేదని కూడా షీబా వెల్లడించింది. ఆరోజు ఎక్కడ వ్యవహారం చెడిందో కానీ సల్మాన్ కోపంతో ఊగిపోయాడని గుర్తు చేసుకుంది.
రేర్ గానే ఉంటారు:
ఒక క్యారెక్టర్ నటి ఇంత బహిరంగంగా ఒక స్టార్ హీరో గురించి వ్యాఖ్యానించడం చాలా అరుదు. బాలీవుడ్ లో కంగన రనౌత్ స్టార్ హీరోలు, దర్శకనిర్మాతల గురించి బహిరంగంగా కామెంట్ చేస్తుంది. కొందరు సహాయనటీమణులు మాత్రమే షీబా తరహాలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడగలరు. ప్రస్తుతం సల్మాన్ పై షీబా కామెంట్లు ఇంటర్నెట్ లో దుమారం రేపుతున్నాయి.
తదుపరి ప్రాజెక్టులు ..
షీబా చద్దా ప్రస్తుతం రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ వంటి స్టార్లతో కలిసి నితేష్ తివారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `రామాయణం`లో నటిస్తోంది. తదుపరి వెబ్ షో `బకైతి` ఓటీటీలో విడుదల కానుంది. ప్రస్తుతం రణబీర్-విక్కీ కౌశల్- ఆలియా భట్ లతో లవ్ అండ్ వార్ చిత్రాన్ని తెరకెక్కిస్తూ భన్సాలీ బీజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.