శంకర్ రెండేళ్ల అగ్రిమెంట్‌కు ఓకే చెప్పేదెవరు?
అంతా బాగానే ఉంది కానీ శంకర్ హీరోలకు పెడుతున్న కండీషన్సే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది.;
ఇండియన్ సినిమాల్లో టెక్నికాలిటీ పరంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన దర్శకుడు శంకర్. `జెంటిల్‌మెన్` నుంచి `గేమ్ ఛేంజర్` వరకు ఆయన కొత్త తరహా టెక్నాలజీని ఇండియన్ సినిమాకు పరిచయం చేశారు. పాటల్లోనూ కొత్తదనాన్ని, భారీ సెట్‌లని నిర్మించి అబ్బురపరిచేలా చిత్రీకరించడంలో శంకర్ సిద్ధహస్తులు. అలాంటి దర్శకుడు గత కొంత కాలంగా తన పట్టుని కోల్పోతున్నారు. భారీ స్థాయిలో శంకర్ చేసిన `ఇండియన్ 2`, `గేమ్ ఛేంజర్` చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర వైఫల్యాన్ని చవిచూశాయి. ఈ సినిమాల విషయంలో శంకర్ విమర్శలు ఎదుర్కోవడం తెలిసిందే.
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `3 ఇడియట్స్` ఆధారంగా రీమేక్ చేసిన `నన్బన్` తరువాత శంకర్ హిట్టు మాట వినలేదు. ఆయన సక్సెస్ అనే మాట విని పద్నాలుగేళ్లవుతోంది. ప్రస్తుతం `ఇండియన్ 3`ని పూర్తి చేసి రిలీజ్ కు సిద్ధం చేసే పనుల్లో ఉన్న ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు. గత కొన్నేళ్లుగా శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా `వేల్పరి`ని తెరపైకి తీసుకురావాలని విశ్వప్రయత్నాలు చేశారు. ఇన్నాళ్లకు అది కార్యరూపం దాల్చుతోంది. సు. వెంకటేశన్ పాపులర్ నవల `వీర యుగ నాయగన్ వేల్పరి` ఆధారంగా ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకురావాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారు.
చారిత్రక ఫాంటసీ స్టోరీగా దీన్ని మొత్తం మూడు భాగాలుగా రూపొందించాలని చర్చలు జరుపుతున్నారు. చేర, చోళ, పాండ్య రాజ్యాల నుంచి నరంబు నాడును రక్షించిన పురాణ తమిళ గిరిజన రాజు జీవితం ఆధారంగా దీన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు. శంకర్ రేంజ్ బడ్జెట్‌తో భారీ స్థాయిలో పాన్ ఇండియా వండర్‌గా దీన్ని రూపొందించడానికి అప్పుడే శంకర్ ప్లాన్ మొదలు పెట్టారరు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఫేమస్ తమిళ్ రైటర్ జయమోహన్ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.
అంతా బాగానే ఉంది కానీ శంకర్ హీరోలకు పెడుతున్న కండీషన్సే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ మూవీని మూడు భాగాలుగా చేయాలని ప్లాన్ చేస్తున్న శంకర్ ..జక్కన్న తరహాలో హీరోలని రెండేళ్లు డేట్స్ ఇచ్చి ఏ ప్రాజెక్ట్ చేయకూడదని కండీషన్ పెడుతున్నాడట. అదే ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన సమస్యగా మారిందని కోలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కీలక పాత్రల కోసం ఇంతకు ముందు రణ్‌వీర్ సింగ్‌ని అనుకున్న శంకర్ ఇప్పుడు ఆ ఆలోచన మార్చుకుని ధనుష్ వెంటపడుతున్నారట. ప్రస్తుతం ధనుష్‌తో శంకర్ చర్చలు జరుపుతున్నారని తెలిసింది.
ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్ ఛావా విక్కీ కౌశల్‌ని రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. విక్కీ కౌశల్‌తోనూ శంకర్ చర్చలు జరుపుతున్నారట. ఈ ఇద్దరు హీరోలు రెండేళ్లు ఈ ప్రాజెక్ట్ కోసం లాక్ అవ్వడానికి ఇష్టపడతారా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శంకర్ ప్రాజెక్ట్ కాబట్టి ఓకే అంటే మాత్రం వెండితెరపై మరో అద్భుతం ఆవిషృతం కావడం ఖాయమని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే ఇదే ఏడాది ఈ భారీ ఛారిత్రక మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.