కనిపించకుండా వినిపించనున్న 'శక్తిమాన్'..!
ఈతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా శక్తిమాన్‌ను తీసుకు వస్తే తప్పకుండా మంచి స్పందన దక్కుతుంది అనేది విశ్లేషకుల, ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం.;
1980 కిడ్స్‌కి శక్తిమాన్ ఒక ఎమోషన్. అప్పట్లో దూరదర్శన్ లో శక్తిమాన్ సీరియల్‌ను చూసి ఎంజాయ్ చేసిన వారు కోట్లల్లో ఉంటారు. అప్పుడు ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని అద్భుతమైన విజువల్స్‌ను క్రియేట్ చేసి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసిన శక్తిమాన్ సీరియల్‌ను ఇప్పటికీ చాలా మంది గుర్తు చేసుకుంటూ ఉంటారు. 1997 నుంచి 2005 వరకు దూరదర్శిన్‌లో ప్రసారం అయిన శక్తిమాన్ ను తిరిగి మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తుంది. ఈతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా శక్తిమాన్‌ను తీసుకు వస్తే తప్పకుండా మంచి స్పందన దక్కుతుంది అనేది విశ్లేషకుల, ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం.
శక్తిమాన్ సీరియల్‌లో ముఖేష్ ఖన్నా టైటిల్ రోల్‌లో నటించారు. ఇండియాలో మొదటి సూపర్ హీరో సిరీస్‌గా శక్తిమాన్ చరిత్రలో నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. అప్పటి పిల్లలకు, పెద్దలకు శక్తిమాన్ ఒక ఎమోషన్‌గా నిలిచి పోతుంది. ఇప్పుడు కూడా శక్తిమాన్‌ను అభిమానించే వారు చాలా మంది ఉంటారు. 1990 కిడ్స్ సైతం శక్తిమాన్‌ను ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత తరాల వారు శక్తిమాన్ జ్ఞాపకాలు వింటూ వస్తున్నారు. ఇప్పుడు వారు శక్తిమాన్‌ను వినే అవకాశం రాబోతుంది. శక్తిమాన్ సిరీస్‌ను పాకెట్ ఎఫ్ఎం ద్వారా ఆడియో ఫార్మట్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకోసం మేకర్స్ ప్రత్యేక కసరత్తులు చేస్తున్నారు.
ముఖేష్ ఖన్నా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... శక్తిమాన్ సిరీస్ అనేది ఒక సీరియల్ మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకునే శక్తిమాన్ ను మరోసారి జనాల మధ్యకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యాం. నేటి తరం ప్రేక్షకులకు పాకెట్ ఎఫ్ఎం ద్వారా ఆడియో సిరీస్‌ను తీసుకు వస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్నాను. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని శక్తిమాన్ ఇయర్ ఫోన్స్ ద్వారా కొత్తతరం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వారు అద్భుతమైన సౌండ్ క్వాలిటీతో శక్తిమాన్ సిరీస్‌ను ఎంజాయ్ చేసే విధంగా పాకెట్ ఎఫ్‌ఎం వారు సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించుకుని తీసుకురాబోతున్నారు అన్నారు.
శక్తిమాన్ సిరీస్‌తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ మరోసారి పాకెట్ ఎఫ్ఎం ద్వారా శక్తిమాన్‌ను వింటారని ఆశిస్తున్నాను అని ఆయన అన్నారు. ఎన్నో కొత్త కథలను శక్తిమాన్ శ్రోతలకు వినిపించబోతున్నారు. తన వాయిస్ సైతం అందులో ఉంటుందని ముఖేష్ ఖన్నా చెప్పుకొచ్చారు. ప్రస్తుత కాలంలో విజువల్‌గా శక్తిమాన్‌ను తీసుకు రావడం అనేది అంత ఈజీ విషయం కాదు. అందుకే ఇలా పాకెట్ ఎఫ్ఎం ద్వారా తీసుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. ఆడియో స్టోరీస్‌కి మంచి స్పందన వస్తే ముందు ముందు మరిన్ని ఎపిసోడ్స్‌ను తీసుకు వచ్చినా ఆశ్చర్యం లేదు. శక్తిమాన్ సిరీస్‌ను ఈతరం ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో మేకర్స్ చేస్తున్న పని అభినందనీయం అంటూ శక్తిమాన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.