కింగ్ ఎప్పుడూ దారి చూపించాలి కానీ..!

అందుకే ఇటీవ‌లి కాలంలో అత‌డు ఉగ్ర‌వాదం నేప‌థ్యంలో పూర్తిగా భార‌త‌దేశానికి మ‌ద్ధ‌తు ప‌లికే ఎలాంటి సినిమాలోను న‌టించ‌లేదు.;

Update: 2026-01-08 23:30 GMT

`మై నేమ్ ఈజ్ ఖాన్`.. ఐ యామ్ నాట్ ఏ టెర్ర‌రిస్ట్.. షారూఖ్ ఖాన్ డైలాగ్ ఇది. కింగ్ ఖాన్ డైలాగ్ భార‌త‌దేశంలోనే కాదు ప్ర‌పంచ దేశాలలో చాలా ప్ర‌శ్న‌ల్ని లేవనెత్తింది. ఉగ్ర‌వాదం నేప‌థ్యంలో క‌థ పుట్టుక, ఆ క‌థ‌తో ముడిప‌డి ఎలాంటి మ‌నోవేద‌న దాగి ఉందో, దానిని ప్రేక్ష‌కులు అనుభ‌వించేంతగా ఎమోష‌న‌ల్ డెప్త్ తో న‌టించి ప్ర‌జ‌లను మెప్పించ‌డం ఎలానో షారూఖ్ నే అడగాలి. ఒక ముస్లిమ్‌గా పుట్ట‌డ‌మే పాప‌మా? ముస్లిములు అయినంత మాత్రాన వారిని తీవ్ర‌వాదుల్లా చూడాల్సిందేనా? అంటే .. అమెరికా స‌హా ప్ర‌పంచ దేశాలు ఉగ్ర‌వాదుల్లో ముస్లిముల‌ను ప్ర‌త్యేకంగా చూస్తున్నాయి అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాతుకుపోయిన ఐసిస్ ఉగ్ర‌వాదం, అల్ ఖైదా వంటివి నిజానికి ముస్లిముల‌పై ఇలాంటి భ‌యాన‌క‌మైన అభిప్రాయాన్ని రుద్దాయి అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే మ‌తం ఏదైనా ఒక అమాయ‌కుడు లేదా అమాయ‌కుడి కుటుంబం బ‌లి అయిపోవ‌డం అనేది స‌హేతుక‌మైన‌ది కాదు. కుల‌మ‌తాల ప్రాతిపాదిక‌న ప్ర‌జ‌ల్ని విడ‌దీయ‌డం నిజంగా స‌హించ‌లేనిది. ఒక ముస్లిమ్ ని పెళ్లాడినందున హిందూ అమ్మాయి వార‌సుల‌ను ప్ర‌పంచం తీవ్ర‌వాదులుగా ప‌రిగ‌ణిస్తే, దానిని ఏమ‌నాలి? అస‌లు నేను ముస్లిమ్ అనేవాడినే పెళ్లాడాల్సింది కాదు! అంటూ త‌న పిల్ల‌ల్ని త‌ల‌చుకుని భ‌ర్త‌ను అస‌హ్యించుకునే, ఆవేద‌న చెందే ఒక హిందూ త‌ల్లి మ‌నోవేద‌న‌ను మై నేమ్ ఈజ్ ఖాన్ లో చూపించిన తీరు హృద్యంగా ఆక‌ట్టుకుంటుంది. బాలీవుడ్ హిస్ట‌రీలో క్లాసిక్ ని అందించాడు షారూఖ్. కానీ అదే స‌మ‌యంలో అత‌డు హిందువుల వ్య‌తిరేక‌త‌ను కూడా ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.

అందుకే ఇటీవ‌లి కాలంలో అత‌డు ఉగ్ర‌వాదం నేప‌థ్యంలో పూర్తిగా భార‌త‌దేశానికి మ‌ద్ధ‌తు ప‌లికే ఎలాంటి సినిమాలోను న‌టించ‌లేదు. కొన్నేళ్ల క్రితం క‌శ్మీర్ ఉగ్ర‌వాదం నేప‌థ్యంలో దిల్ సే లాంటి ప్రేమ‌క‌థా చిత్రంలో న‌టించాడు. మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన ఈ క్లాసిక్ ఫ్లాప్ గా మిగిలినా కానీ, యూనిక్ విజువ‌ల్స్ తో ర‌క్తి క‌ట్టిస్తుంది.

అయితే ఇప్పుడు కింగ్ ఖాన్ షారూఖ్ మ‌న‌సు ఉగ్ర‌వాదం - వార్ బ్యాక్ డ్రాప్ సినిమాల‌పైకి మ‌ళ్లింద‌ని చెబుతున్నారు. మై నేమ్ ఈజ్ ఖాన్ తర‌హా కాదు కానీ, ఈసారి భారీ వార్ బ్యాక్ డ్రాప్ తో ఉగ్ర‌వాదాన్ని మిళితం చేసి సినిమా తీయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. బ‌హుశా ర‌ణ్ వీర్ సింగ్ `దురంధ‌ర్`, విక్కీ కౌశ‌ల్ `యూరి` చిత్రాలు నింపిన స్ఫూర్తితో అత‌డు అలాంటి ఒక ప్ర‌య‌త్నం చేస్తారా? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్ గా ఉంది. ఇక షారూఖ్‌తో `క‌ల్ హో న‌హో` లాంటి హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన నిఖిల్ అద్వానీ షారూఖ్‌తో తీవ్ర‌వాదం- వార్ నేప‌థ్యంలో సినిమా తీసేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఖాన్‌తో అలాంటి ఒక సినిమా తీయాల‌నే త‌న కోరిక‌ను వ్య‌క్త‌ప‌రిచిన ఒక పాత ఇంట‌ర్వ్యూ ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ గా మారుతోంది.

అయితే దురంధ‌ర్ స‌క్సెస్ నేప‌థ్యంలో దీనిని మ‌ళ్లీ వైర‌ల్ చేస్తున్నారు మిన‌హా షారూఖ్ కానీ, నిఖిల్ అద్వాణీ కానీ దీనిని ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. క‌నీసం స్క్రిప్టు గురించిన చ‌ర్చ‌లు కూడా వారి మ‌ధ్య లేవు. అయితే షారూఖ్ అలాంటి ఒక చిత్రంలో న‌టించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. మై నేమ్ ఈజ్ ఖాన్‌లో అతడి అద్భుత‌ నటనను ఇంకా ఎవ‌రూ మ‌ర్చిపోలేదు. అందుకే తీవ్ర‌వాద నేప‌థ్యం, వార్ బ్యాక్ డ్రాప్ కి అత‌డు స‌రిపోతాడని అభిమానులు బ‌లంగా న‌మ్ముతున్నారు.

కానీ కింగ్ ఖాన్ ఉగ్ర‌వాదం నేప‌థ్యంలో న‌టిస్తే దానిని ఆద‌రించ‌డానికి అన్ని వ‌ర్గాల‌ ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారా? అత‌డు తన ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ కోసం బంగ్లాదేశ్ ఆటగాడిని నియమించుకోవ‌డాన్ని కూడా స‌హించ‌లేక‌పోయారు ఒక వ‌ర్గం ప్ర‌జ‌లు. ఖాన్‌లపై ఎటాక్ చేసే ఒక వ‌ర్గం ఎప్పుడూ ఉంది. పాకిస్తాన్ లేదా గ‌ల్ఫ్ దేశాల్లోని త‌న అభిమానుల హృద‌యాల‌ను గాయ‌ప‌ర‌చ‌కుండా `దురంధ‌ర్` లాంటి స్క్రిప్టుతో షారూఖ్ సాహ‌సం చేయ‌గ‌ల‌డా? ర‌ణ్ వీర్ ఇమేజ్‌తో పోలిస్తే షారూఖ్ కి ఉన్న ఇమేజ్ వేరు. హిందూ- ముస్లిమ్ ఘ‌ర్ష‌ణ‌ల‌ను ప్రేరేపించే అంశాల‌కు తావు ఉంటుంది. ఖాన్‌లు ద‌శాబ్ధాలుగా ఎదుర్కొంటున్న చాలా విమ‌ర్శ‌లు వారిని వెంబ‌డిస్తూనే ఉంటాయి. కొత్త స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడ‌తాయి. ఒక‌వేళ షారూఖ్ కాకుండా ఉగ్ర‌వాదం- వార్ బ్యాక్ డ్రాప్ లో అల్లు అర్జున్ లాంటి స్టార్ న‌టిస్తే, దానిని హిందీ బెల్ట్ కూడా ఎలాంటి భేష‌జం లేకుండా ఆద‌రించ‌డానికి సిద్ధంగా ఉంటుంది. దురంధ‌రుడిగా న‌టించిన ర‌ణ్ వీర్ కి ఎలాంటి ఆద‌ర‌ణ ద‌క్కిందో అదే త‌ర‌హా ఆద‌ర‌ణ అల్లు అర్జున్ కి ద‌క్కుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయినా ర‌ణ్ వీర్ చూపించిన దారిలో కింగ్ వెళ‌తాడా? కింగ్ ఎప్పుడూ దారి చూపాలి కానీ.. వేరొక‌రి దారిలోకి వెళితే ఎలా?

Tags:    

Similar News