వెండి తెర‌పై సరికొత్త జోడీ!

బాలీవుడ్ లో మ‌రో క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందా? అంటే అవుననే తెలుస్తోంది. షాహిద్ కపూర్ - జాన్వీ కపూర్ తొలిసారి వెండితెరపై జ‌త క‌డుతున్న‌ట్లు వార్తలొస్తున్నాయి.;

Update: 2026-05-07 00:30 GMT

బాలీవుడ్ లో మ‌రో క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందా? అంటే అవుననే తెలుస్తోంది. షాహిద్ కపూర్ - జాన్వీ కపూర్ తొలిసారి వెండితెరపై జ‌త క‌డుతున్న‌ట్లు వార్తలొస్తున్నాయి. `బధాయి హో` , `మైదాన్` వంటి హిట్ చిత్రాలను తెర‌కెక్కించిన అమిత్ శర్మ ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఇద్దరు టాలెంటెడ్ నటీనటులు ఒకే ఫ్రేమ్‌లో సెట్ అవ్వ‌డంతో? సినిమాపై అప్పుడే చర్చ మొదలైంది. ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీ గా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఆధునిక సంబంధాలు, ప్రేమ , వినోదం కలగలిసిన ఓ ఫ్రెష్ కథాంశంతో అమిత్ శర్మ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట.

అమిత్ శర్మ సినిమాల్లో ఎమోషన్స్ ,హ్యూమర్ తీర్చిదిద్ద‌డంలో దిట్ట‌. ఈ సినిమాలో కూడా ఆయన తనదైన శైలిని కొనసాగిస్తూనే యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలను ఎక్కువగా జోడించబోతున్నారట. బాలీవుడ్‌లో రొటీన్ కథలకు భిన్నంగా ఒక రిలేటబుల్ రిలేషన్ షిప్ జర్నీని చిత్రం లో ఆవిష్కరించబోతున్నారుట‌. ఇందులోని సంభాషణలు ,సన్నివేశాలు ఎంతో సరదాగా సాగిపోతాయని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ లో ప్రారంభం కానుందని స‌మాచారం. ప్రస్తుతం షాహిద్ కపూర్ ఇతర సినిమాలు, వెబ్ సిరీస్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

అవ‌న్నీ అక్టోబ‌ర్ క‌ల్లా పూర్త‌వుతాయ‌ని తెలుస్తోంది. అనంత‌రం అమిత్ శర్మ ప్రాజెక్ట్ ను ప‌ట్టాలెక్కించ‌నున్నారు. 2027లో సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. షాహిద్ కపూర్ -జాన్వీ కపూర్ కాంబినేషన్ బాలీవుడ్‌లో ఓ కొత్త వైబ్ తీసుకురావడం ఖాయం. ప్రతిభావంతుడైన దర్శకుడి చేతిలో సరికొత్త జోడీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

అలాగే షాహిద్ కపూర్ కొంత కాలంగా సీరియస్ పాత్ర‌ల్లోనే క‌నిపిస్తున్నారు. దీంతో చాలా కాలం తర్వాత మళ్ళీ పూర్తి స్థాయి కామెడీ జోనర్‌లోకి వస్తుండటంతో ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం జాన్వీ క‌పూర్ కూడా `పెద్ది` సినిమాతో బిజీగా ఉంది. జూన్ లో రిలీజ్ కు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అనంత‌ర‌మే త‌దుప‌రి ప్రాజెక్ట్ ల‌ను అమ్మ‌డు అధికారికంగా ప్ర‌క‌టించ‌నుంది. బాలీవుడ్ కంటే అమ్మ‌డు సౌత్ సినిమాల్నే టార్గెట్ చేసింది. `పెద్ది` త‌ర్వాత మ‌రో పెద్ద స్టార్ తో ఇక్క‌డే సినిమా చేయాల‌ని ఆశ ప‌డుతోంది. అలాగే కోలీవుడ్లో కూడా వీలైనంత త్వ‌ర‌గా లాంచ్ అవ్వాల‌ని ఎదురు చూస్తోంది. ఇప్ప‌టికే ఆ ర‌కంగా ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. మ‌రో వైపు చెల్లెలు ఖుషీ క‌పూర్ ఎంట్రీ విష‌యంలోనూ డాడ్ బోనీ క‌పూర్ తో క‌లిసి ముందుకెళ్తోంది.

Tags:    

Similar News