ఆర్నెళ్లుగా ఇంట్లో లేక‌పోయినా సూప‌ర్‌స్టార్ కోసం ఫుడ్ ఆర్డ‌ర్?

ఇది చాలా విచిత్ర‌మైన‌ది. అత‌డు ఎలాగైనా కింగ్ ఖాన్ షారూఖ్‌ని క‌ల‌వాల‌నుకున్నాడు. నేరుగా ముంబైలోని `మ‌న్న‌త్` కి వెళ్లాడు. అయితే `మ‌న్న‌త్‌` లోనికి వెళ్లేందుకు ప్ర‌ధాన గేట్ వ‌ద్ద‌ సెక్యూరిటీ నిరాక‌రించారు.;

Update: 2025-08-20 15:30 GMT

ఇది చాలా విచిత్ర‌మైన‌ది. అత‌డు ఎలాగైనా కింగ్ ఖాన్ షారూఖ్‌ని క‌ల‌వాల‌నుకున్నాడు. నేరుగా ముంబైలోని `మ‌న్న‌త్` కి వెళ్లాడు. అయితే `మ‌న్న‌త్‌` లోనికి వెళ్లేందుకు ప్ర‌ధాన గేట్ వ‌ద్ద‌ సెక్యూరిటీ నిరాక‌రించారు. అయినా అత‌డు చాలా సేపు అక్క‌డే ఎదురు చూసాడు. వాళ్ల‌ను ఒప్పించి లోనికి వెళ్లాల‌నుకున్నాడు.. అయినా కుదర‌లేదు.

టైట్ సెక్యూరిటీ కార‌ణంగా.. త‌న ఫేవ‌రెట్ స్టార్ షారూఖ్‌ని క‌ల‌వ‌గ‌ల‌నా? లేదా? అని అత‌డు తీవ్ర‌ ఆందోళ‌న చెందాడు. చివ‌రికి ఒక బ్రిలియంట్ ఐడియా వ‌చ్చింది. ప్ర‌ధాన ద్వారం గుండా కాకుండా, దొడ్డి దారి గుండా లోనికి వెళ్లాలని నిశ్చ‌యించుకున్నాడు. మ‌న్న‌త్ ప్ర‌ధాన గేట్ వ‌ద్ద ఎవ‌రికీ క‌నిపించ‌కుండా భ‌వంతి వెన‌క వైపు గేట్ వ‌ద్ద‌కు వెళ్లాడు. అక్క‌డ కూడా చాలా ప్ర‌య‌త్నించి భంగ‌ప‌డ్డాడు. సెక్యూరిటీ స‌సేమిరా అంటూ గెంటేసారు!

బ్రిలియంట్ ఐడియా:

చివ‌రికి అత‌డికి మ‌రో బ్రిలియంట్ ఐడియా వ‌చ్చింది.. తాను వెంట‌నే ఫుడ్ డెలివ‌రీ బోయ్‌గా మారాడు. రెండు కోల్డ్ కాఫీ ఆన్ లైన్‌లో ఆర్డ‌ర్ ఇచ్చాడు. ఆన్‌లైన్ ఆర్డ‌ర్ తీసుకుని వ‌చ్చిన వ్య‌క్తి నుంచి బైక్ లాక్కుని వాటిని ఆ బైక్ పైనే తీసుకుని సెక్యూరిటీ ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు. వీటిని అర్జెంటుగా లోనికి డెలివ‌రీ ఇవ్వాల‌ని అన్నాడు. కానీ దానికి కూడా సెక్యూరిటీ స‌సేమిరా అన్నారు. చివ‌రికి అత‌డు ఫుడ్ డెలివ‌రీ ఇవ్వ‌లేక‌పోయాడు. ప‌దే ప‌దే అత‌డు ఏదో ఒక మిష‌తో వ‌స్తున్నందున సెక్యూరిటీ అత‌డిని అనుమానించి, అస‌లు `మ‌న్న‌త్‌`లో ఫుడ్ డెలివ‌రీ ఇచ్చిన వ్య‌క్తి ఎవ‌రు? అంటూ ఆరాలు తీసారు.

ఇవ‌న్నీ డ్రామాలా?

చివ‌రికి తేలింది ఏమిటి? అంటే అస‌లు మ‌న్న‌త్‌లో షారూఖ్ ఉంటే క‌దా? అత‌డు, అత‌డి కుటుంబీకులు ఇల్లు ఖాళీ చేసి అద్దె ఇంటికి వెళ్లిపోయి ఆర్నెళ్లు అయింది. ప్ర‌స్తుతం `మ‌న్న‌త్`ని పూర్తిగా రెనోవేష‌న్‌ చేస్తున్నారు. అడిష‌న‌ల్ గా కొన్ని ఎక‌రాల్లో భ‌వంతిని భారీగా విస్త‌రిస్తున్నారు. అయితే ఇదంతా తెలిసి కూడా అత‌డు డ్రామా ఆడాడా? లేక ఇదేమీ తెలియ‌న‌ట్టు సెక్యూరిటీ అధికారులు డ్రామాలాడారా? అన్న‌ది తేలాల్సి ఉంది. ప్ర‌స్తుతానికి ``ఫుడ్ డెలివ‌రీ`` ఆట‌ బాగానే ఆడుకున్నారు అంద‌రూ!!

ఖాన్‌కి ఇదే మొద‌టి సారి కాదు:

కింగ్ ఖాన్ షారూఖ్ త‌న ఐకానిక్ బిల్డింగ్ మ‌న్న‌త్ ని రెనోవేట్ చేసేందుకు ముంబై బీఎంసీ ప‌ర్మిష‌న్ తీసుకున్నారు. అయితే ఖాన్ నియ‌మాల్ని ఉల్లంఘించి మ‌న్న‌త్ ని విస్త‌రిస్తున్నార‌ని, సీఆర్‌జెడ్ ప‌రిధిలో ఇలాంటి విస్త‌ర‌ణ కుద‌ర‌ద‌ని ఇరుగు పొరుగు వ్య‌క్తులు ఫిర్యాదు చేయ‌డంతో అది కాస్తా ర‌చ్చ‌యింది. షారూఖ్ ప్ర‌స్తుతం ర‌కుల్ భ‌ర్త జాకీ భ‌గ్నానీ కుటుంబానికి చెందిన ఓ భ‌వంతిని అద్దెకు తీసుకుని అందులో కుటుంబంతో నివాసం ఉంటున్నారు.

సెల‌బ్రిటీలు త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

ముంబైలో సెల‌బ్రిటీల ఇండ్ల‌లో భ‌ద్ర‌తా ఉల్లంఘ‌న ప్ర‌తిసారీ స‌మ‌స్యాత్మ‌కంగా మారుతోంది. సైఫ్ అలీఖాన్ పొట్ట‌లో ఆరు క‌త్తి పోట్లు పొడిచిన వ్య‌క్తి క‌ఠిన‌మైన సెక్యూరిటీ భ‌ద్ర‌త‌ను సైతం దాటుకుని లోనికి ప్ర‌వేశించాడు. స‌ల్మాన్ ఖాన్ ఇంటికి ప్ర‌యివేట్ సెక్యూరిటీ ఎంత ఉన్నా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఎటాక్స్ నుంచి కాపాడుకోలేక‌పోతున్నాడు. అదృష్ట‌వ‌శాత్తూ అత‌డు ప‌లుమార్లు బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డాడు. అంతేకాదు.. షారూఖ్ ఖాన్ మ‌న్న‌త్‌లోకి ఇంత‌కుముందు కూడా ప‌లుమార్లు సెక్యూరిటీ క‌ళ్లు గ‌ప్పి చాలా మంది లోనికి ప్ర‌వేశించ‌డం సంచ‌ల‌న‌మే అయింది.

Tags:    

Similar News