స్టార్ హీరో అహంకారంపై జర్నలిస్టు షాకింగ్ కామెంట్
తనదైన అందం, ఛరిష్మా, ఛమత్కారంతో ఎప్పుడూ అందరినీ ఆకర్షించే ఈ హీరో కెరీర్ తొలి నాళ్లలో ఒక ప్రముఖ పత్రిక ఎడిటర్ తో ఘర్షణ పడ్డాడు.;
బాలీవుడ్ స్టార్ హీరో అహంకారం ఒకప్పుడు పరిశ్రమలో పెద్ద చర్చగా మారేది. అతడు ఎవరినీ క్షమించడు. ఓపెన్ గా మాట్లాడుతాడు. గొడవ పడతాడు. చైన్ స్మోకర్.. ఎప్పుడూ సిగరెట్లు తాగుతూనే ఉంటాడు. యాటిట్యూడ్ గురించి చెప్పాల్సిన పని లేదు. అయితే ఇదంతా అతడి కెరీర్ తొలి నాళ్లలో చాలా చిక్కులు తెచ్చి పెట్టేది. శత్రువులను పెంచి పోషించేది. అయితే అతడు కాల క్రమంలో చాలా మారాడు. పరిణతి చెందాడు. ఇప్పుడు అతడు పూర్తిగా ఎదిగిన మనిషి. డౌన్ టు ఎర్త్ ఉంటూ అందరినీ దరి చేరనిస్తున్నాడు. సహనటులతో ఎంతో చనువుగా ఉంటాడు. ఇప్పుడు వేల కోట్ల సామ్రాజ్యాన్ని విస్తరించిన తర్వాతా అతడు అందరివాడుగా ఉన్నాడు. దానధర్మాలు, సామాజిక సేవలోను ముందున్నాడు.
తనదైన అందం, ఛరిష్మా, ఛమత్కారంతో ఎప్పుడూ అందరినీ ఆకర్షించే ఈ హీరో కెరీర్ తొలి నాళ్లలో ఒక ప్రముఖ పత్రిక ఎడిటర్ తో ఘర్షణ పడ్డాడు. తన గురించి చెడుగా రాస్తున్నారని తీవ్ర అసహనంతో రగిలిపోయాడు. ఆ పత్రిక నుంచి తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన జర్నలిస్టును చాలా తిట్టాడు. భయపెట్టాడు. వెంటనే ఎడిటర్ ని పిలవాల్సిందిగా ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో చాలా కంగారు పడిపోయిన మహిళా జర్నలిస్ట్ వెంటనే తన ఎడిటర్ ని ఇంటర్వ్యూ స్పాట్ కి పిలిచి మాట్లాడారు. ఆరంభం వారి మధ్య వాదన నడిచింది. చివరికి ఎడిటర్ ప్రశాంతంగా సమస్యను పరిష్కరించుకోగలిగాడు. ఆ తర్వాత మాత్రమే షారూఖ్ ఆ జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. కింగ్ ఖాన్ పరిణతి చెందని రోజుల్లో ఇలాంటి అహంకారం ప్రదర్శించారని, కానీ అతడు ఆ తర్వాత తనకు ఎంతో గొప్ప స్నేహితుడు అయ్యారని చెప్పిన ఆ జర్నలిస్టు పేరు పూజా సామంత్.
ఆరంభం ఆ జర్నలిస్టుతో మాట్లాడటానికి కూడా ఇష్టపడని షారూఖ్, ఆ తర్వాత మారాడు. ఈ ఘటన `యే కాలి కాలి ఆంఖెయిన్` పాటను చిత్రీకరిస్తున్నప్పుడు బాజీగర్ సెట్‌లో అతడిని కలవడానికి వెళ్లినప్పటి ఘటన ఇది అని పూజా గుర్తు చేసుకున్నారు. అప్పుడు షారుఖ్ చైన్ స్మోకర్, అతను అక్కడ కూర్చుని ధూమపానం చేస్తున్నాడు. నేను తలుపు తట్టి ఫలానా పత్రిక నుండి వచ్చిన వ్యక్తిగా పరిచయం చేసుకున్నాను. ఆ క్షణం అతడు ఫైరయ్యాడు.
``మీ పత్రిక నా గురించి ఏం రాస్తుందో తెలుసా? మీ ముఖం నాకు చూపించవద్దు`` అని సీరియస్ అయ్యాడు. అతడు నన్ను తిట్టాడు. నన్ను ఇంటర్వ్యూ అడగడానికి ఎంత ధైర్యం? మీరు ఎప్పుడైనా నా గురించి ఏదైనా మంచిగా రాశారా? మీకు ధైర్యం ఉంటే, మీ ఎడిటర్‌ను ఇక్కడికి తీసుకురండి. ఈ రోజు అన్నిటినీ క్లియర్ చేస్తే, నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తాను అని ధుమధుమలాడాడని ఖాన్ స్వభావం గురించి చెప్పారు పూజా.
ఇదే ఇంటర్వ్యూలో ఖాన్ గొప్పతనం గురించి కూడా పూజా వివరించారు. అతడు అన్నివేళలా మాట్లాడటానికి చాలా ఆసక్తికరమైన వ్యక్తి. చాలా జ్ఞానవంతుడు. చాలా చదువుతాడు. బైబిల్, ఖురాన్, గీత అన్నీ అతడికి తెలుసు. అతని బంగ్లా మన్నత్‌లో ఒక పెద్ద లైబ్రరీ ఉంది. నిజానికి అతడు అంత చదవడానికి సమయం ఎలా దొరుకుతుందో నాకు ఇప్పటికీ తెలియదు! అని జర్నలిస్ట్ పూజా చెప్పారు. నా ఆత్మగౌరవాన్ని అహంకారం అని పిలిస్తే, అవును నేను వంద శాతం అహంకారిని.. అని ఖాన్ అంగీకరించిన సందర్భాలున్నాయి.
అయితే గతం గతహః. ఖాన్ తన కెరీర్ లో జీవితంలో చాలా దూరం ప్రయాణించారు. సామ్రాజ్యాలను సృష్టించారు. ప్రస్తుతం కింగ్ అనే చిత్రంలో తన కుమార్తె సుహానా ఖాన్ తో కలిసి నటిస్తుండడం అభిమానుల్లో ఉత్సాహం పెంచుతోంది. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.