ఒక్క కామెంట్ తో వారి పెళ్లి పై పెరిగిన బ‌జ్

అమెరికా పాప్ సింగ‌ర్‌, న‌టి, నిర్మాత సెలెనా గోమెజ్ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనుంద‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.;

Update: 2025-08-18 00:30 GMT

అమెరికా పాప్ సింగ‌ర్‌, న‌టి, నిర్మాత సెలెనా గోమెజ్ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనుంద‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ 33 ఏళ్ల అందాల భామ గ‌తంలో ప్ర‌ముఖ పాప్ సింగ‌ర్ జ‌స్టిన్ బీబ‌ర్‌తో కొంత‌కాలం డేటింగ్ చేసింది. అత‌డితో క‌లిసి ప‌లు ఆల్బ‌మ్‌లు చేయ‌డంతో పాటు అనేక ఈవెంట్ల‌కు, వెకేష‌న్ల‌కు ఈ ఇరువురు చెట్టాప‌ట్టాలు వేసుకొని తిరిగిన ఫొటోలు, వీడియోలు అప్పట్లో వైర‌ల‌వ‌డం తెలిసిందే. కొంత‌కాలానికి సెలెనాకు జ‌స్టిన్ అనూహ్యంగా బ్రేక‌ప్ చెప్ప‌డంతో ఆమె డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయింది.

గ‌తేడాది డిసెంబ‌ర్ లో ఎంగేజ్‌మెంట్

డిప్రెష‌న్‌లో నుంచి బ‌య‌ట‌ప‌డిన కొంత కాలం త‌ర్వాత అమెరికాకే చెందిన సాంగ్‌రైట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ అయిన బెన్నీ బ్లాంకోతో గోమెజ్ డేటింగ్ ప్రారంభించింది. గ‌త డిసెంబ‌ర్‌లో వీరిద్ద‌రికి ఎంగేజ్‌మెంట్ కూడా అయింది. అప్ప‌టి నుంచి ఈ ఇరువురు స‌న్నిహితంగా ఉన్న ప‌లు ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో త‌ర‌చూ ద‌ర్శ‌న‌మిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ ఇరువురు క‌లిసి దిగిన కొన్ని ఫొటోల‌ను గోమెజ్ త‌న ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఆ పోస్టుకి బెన్నీ కొంచెం ఆగు నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని కామెంట్ చేశాడు.

ఈనెల 9వ తేదీన బ్లాంకో చిర‌కాల ఫ్రెండ్ లిల్ డిక్కీ-క్రిస్టిన్ పెళ్లి వేడుక‌లో గోమెజ్ జంట సంద‌డి చేసింది. ఈ వేడుక‌కు సంబంధించి అనేక ఫొటోల‌ను గోమెజ్ త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. దీనికి ముందు కూడా బ్లాంకోకు గోమెజ్ ముద్దు పెడుతున్న ఫొటోల‌తో పాటు ఆమె కోసం అత‌డు ప్ర‌త్యేకంగా చేసిన వంట‌కాల ఫొటోల‌ను త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన‌దిగా వ‌ర్ణిస్తూ గోమెజ్ పోస్టులు చేయ‌డం తెలిసిందే.

త‌ల్లిని కాలేన‌ని బాధ‌ప‌డిన గోమెజ్

ఇక‌, గోమెజ్ త‌నకున్న ఆరోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా పిల్ల‌ల‌ను క‌నే అవ‌కాశం లేద‌ని గ‌తంలో వాపోవ‌డం తెలిసిందే. త‌ను ఎంత పెద్ద స్టార్ అయినా త‌న ఆరోగ్య ప‌రిస్థితుల కార‌ణంగా త‌ల్లిని కాలేన‌ని, పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకోవ‌డమో లేదా స‌రోగ‌సి ద్వారా పొంద‌డ‌మే త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని బాధ‌ప‌డ‌డం తెలిసిందే.

Tags:    

Similar News