మర్చిపోయిన క్రూయిజ్ షిప్ పార్టీని గుర్తు చేసాడు!
అయితే ఇది అందరూ మర్చిపోయిన ముంబై క్రూయిజ్ షిప్ పార్టీ గురించేనా? డ్రగ్స్ తీసుకున్నాడంటూ ఆర్యన్ ని అధికారులు అరెస్ట్ చేసిన ఘటనపై సెటైరికల్ గా స్పందించడమేనా? అంటూ చర్చ సాగుతోంది.;
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఆరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అతడు తన తొలి వెబ్ సిరీస్ కోసం ఎంచుకున్న కథాంశం ఆసక్తిని కలిగిస్తోంది. ఖాన్ ఇంటికి రెగ్యులర్ గా వచ్చి వెళ్లే సెలబ్రిటీలందరిపైనా ఆర్యన్ సెటైరికల్ స్టోరీతో వెబ్ సిరీస్ తెరకెక్కించి ఓటీటీలో రిలీజ్ చేయడం సర్వత్రా చర్చగా మారింది. బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్ పేరుతో ఈ సిరీస్ ఈ బుధవారం (సెప్టెంబర్ 17) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ముంబైలో జరిగిన ప్రీమియర్ కి బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు అటెండయ్యారు. అయితే ఈ పార్టీలో ప్రత్యేక ప్రదర్శనకు స్టాండ్-అప్ కమెడియన్ సమయ్ రైనా హాజరవ్వడం ఆసక్తిని కలిగించింది. పార్టీ ఆద్యంతం కళ్లన్నీ ఆర్యన్ బదులుగా సమయ్ ధరించిన దుస్తులపైనే నిలిచాయి. డెబ్యూ దర్శకుడు ఆర్యన్ ని కూడా మర్చిపోయిన జనం, సమయ్ టీషర్ట్ పై ఉన్న కొటేషన్ ని చదవటానికి ఆసక్తిని కనబరిచారు. అంతగా ఆకర్షించిన ఆ కొటేషన్ ఏమిటో పరిశీలిస్తే.... దీనిపై `సే నో టు క్రూయిజ్` అని రాసి ఉంది. బ్లాక్ టీషర్ట్ పై ముద్రించిన బోల్డ్ టెక్స్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.
అయితే ఇది అందరూ మర్చిపోయిన ముంబై క్రూయిజ్ షిప్ పార్టీ గురించేనా? డ్రగ్స్ తీసుకున్నాడంటూ ఆర్యన్ ని అధికారులు అరెస్ట్ చేసిన ఘటనపై సెటైరికల్ గా స్పందించడమేనా? అంటూ చర్చ సాగుతోంది. ఒకసారి పాత విషయాల్లోకి వెళితే.... ఆర్యన్ ఖాన్ అతడి స్నేహితుల బృందం 2021 అక్టోబర్‌లో ముంబై తీరంలో కార్డెలియా ఎంప్రెస్ క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీని ఆస్వాధిస్తుండగా, అనూహ్యంగా అక్కడ ఊహించని అతిథులు ప్రత్యక్షమయ్యారు.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) రంగ ప్రవేశం చేసి, అక్కడ ఉన్న అందరినీ అరెస్ట్ చేసింది. ఆర్యన్ ఊహించని విధంగా డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు. లక్షద్వీప్‌కు వెళ్లే ఈ ఓడలో ఆర్యన్ అతడి స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో ఆర్యన్ తన తప్పు ఏమీ లేదని నిరూపించుకుని బయటపడ్డాడు. కానీ అంతకుముందు తనయుడిని విడిపించుకునేందుకు కింగ్ ఖాన్ షారూఖ్ తీవ్రమైన మానసిక వేదనను అనుభవించాడు. అతడు నార్కోటిక్స్ బ్యూటీ అధికారి సమీర్ వాంఖడేను ప్రాధేయపడ్డారని కూడా కథనాలొచ్చాయి. అందుకే ఈ ఘటనను ఎవరూ మర్చిపోలేదు. అందుకే ఇప్పుడు అతడు క్రూయిజ్ షిప్ పార్టీ గురించి ఆర్యన్ కి చెందిన కీలక ఈవెంట్లో గుర్తు చేయడం చర్చగా మారింది. సమయ్ ధరించిన టీ షర్ట్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో కొత్త చర్చకు తెరతీసింది. కావాలనే ఆర్యన్ వివాదాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రస్తావించాడా? లేదా యాధృచ్చికంగా జరిగిందా అనేది విశ్లేషిస్తున్నారు. నిజానికి ఆరోజు పార్టీలో ఏ తప్పు చేయలేదని ఆర్యన్ చెప్పినా అధికారులు వినలేదు. ఆ తర్వాత పరిణామాల గురించి తెలిసిందే.
బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్ షో సెప్టెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. గ్లామర్ అండ్ గ్లిజ్ ప్రపంచంలో చీకటి వ్యవహారాలను తెరపైకి తెచ్చిన సిరీస్ ఇదని కథనాలొచ్చాయి. ఏడు ఎపిసోడ్‌లుగా విస్తరించి ఉన్న ఈ సిరీస్‌లో లక్ష్య, బాబీ డియోల్, అన్య సింగ్, రాఘవ్ జుయాల్ - మోనా సింగ్ తదితరులు నటించారు.